క్రమశిక్షణకు మా పార్టీ ల్యాండ్ మార్క్ అని చెప్పే టీడీపీలో.. ఆ పార్టీ నేతల బిహేవియర్ మాత్రం డిఫరెంట్ గా కనపడుతోంది. ఎప్పుడు ఏ నాయకుడు.. ఏ వేరియేషన్ చూపిస్తాడో అర్థం కాక కార్యకర్తలు తల పట్టుకుంటున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘనవిజయం సాధించిందనే సంతోషం కంటే.. పార్టీలో పంచాయతీలు ఎక్కువయ్యాయి. ఒకపక్క కార్యకర్తలు మాకు పార్టీ న్యాయం చేయలేదు అని ఆవేదన వ్యక్తం చేస్తుంటే.. నాయకులు మాత్రం పనికిరాని పనులతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇలా గడిపే వారిలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ ముందు వరుసలో ఉంటారు.
2024లో గెలిచిన తర్వాత నుంచి ఇద్దరు మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. డైరెక్ట్ గా చిన్ని పై ఆరోపణలు.. ఆ తర్వాత మండల పార్టీ అధ్యక్షులు పై విమర్శలు.. సోషల్ మీడియా స్టేటస్ లు.. నియోజకవర్గంలో ప్రోటోకాల్ పక్కన పెట్టే కార్యక్రమాలు.. ఇలా ప్రతి ఒక్కటి విజయవాడ పార్లమెంట్ లోనే కాకుండా స్టేట్ వైడ్ గా ఇది సెన్సేషన్ అవుతుంది. ఇది చూసిన చాలామంది టీడీపీ కార్యకర్తలు.. మెచ్యూరిటీ లేని ప్రేమికుల కథలాగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. లేటెస్ట్ గా మరోసారి ఇద్దరి మధ్య గొడవకు పలు పరిణామాలు దారితీసాయి. ఇటీవల సీఎం చంద్రబాబు ఇద్దరికీ స్వయంగా వార్నింగ్ ఇచ్చినా.. ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరు గొడవపడే పరిస్థితి మళ్లీ క్రియేట్ అయింది.
తాజాగా తిరువూరు నియోజకవర్గంలోని.. గంపలగూడెం మండలం నెమలి గ్రామంలో ఉన్న.. శ్రీ వేణుగోపాలస్వామి పట్టువస్త్రాల సమర్పణ సందర్భంగా జరిగిన వివాదం మరోసారి పార్టీకి తలనొప్పిగా మారింది. అయితే ఈ విషయంలో విజయవాడ ఎంపీగా ఉన్న కేశినేని చిన్ని వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనలో స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు జరిగిన అవమానంపై పార్టీ పెద్దలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎన్టీఆర్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా నెమలి వేణుగోపాలస్వామి ఆలయాన్ని చెప్తూ ఉంటారు.
ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో జరగాల్సింది పోయి, ఎంపీ కేశినేని చిన్ని అతివల్ల రాజకీయ రణరంగంగా మారాయి. ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యేకు దక్కాల్సిన గౌరవాన్ని ఎంపీ అడ్డుకోవడమే ఈ గొడవకు ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆలయ నిబంధనల ప్రకారం, స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించే మొదటి హక్కు స్థానిక ఎమ్మెల్యేకు ఉంటుంది. కానీ, అధికారులపై ఒత్తిడి తెచ్చి ఎంపీ చిన్ని ఆ వస్త్రాలను తానే తీసుకోవడం వివాదానికి కేంద్రబిందువైంది. ఎమ్మెల్యే కొలికపూడిని కేవలం తలంబ్రాలకే పరిమితం చేయాలని చూడటం ఆయనను అవమానించడమేనని స్థానిక కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యే పట్టువస్త్రాల కోసం ప్రయత్నించినప్పుడు, ఎంపీ చిన్ని వాటిని వదలకపోవడం ఆయన అహంకారానికి నిదర్శనమని విమర్శలు వస్తున్నాయి. ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో.. తానే సుప్రీం అని నిరూపించుకోవాలనే తపనతో, గెలిచిన ఎమ్మెల్యేను కూడా లెక్కచేయకుండా ప్రవర్తించడం పార్టీ ప్రతిష్ఠను మసకబార్చింది. గతంలో కొలికపూడి చేసిన ఆరోపణలను ఈ సందర్భంగా రాజకీయ విశ్లేషకులు గుర్తు చేసుకుంటున్నారు. తిరువూరు టికెట్ కోసం కేశినేని చిన్ని కోట్లు డిమాండ్ చేశారని ఎమ్మెల్యే కొలికిపూడి ఆరోపణలు చేశారు. ఆ విషయంలో ఉన్న పాత కక్షలను మనసులో పెట్టుకునే, ఇప్పుడు కావాలనే ఆలయ ఉత్సవాల్లో ఎమ్మెల్యేను తక్కువ చేసి చూపించారని చర్చ జరుగుతోంది.
ఎంపీ స్థాయి వ్యక్తి, ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే ఇలా బాహాటంగా ఘర్షణ పడటం ఆయన మెచ్యూరిటీ లెవెల్ ను బయట పెట్టిందని గుసగుసలాడుకుంటున్నారు. విజయవాడ ఎంపీగా అందరినీ కలుపుకుని వెళ్లాల్సిన చిన్ని, తిరువూరు నియోజకవర్గ ఇంటర్నల్ విషయాల్లో వేలు పెడుతూ గ్రూపులను ఎంకరేజ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పట్టువస్త్రాల వివాదం కేవలం ఒక ఉదాహరణ మాత్రమేనని, తెర వెనుక ఎమ్మెల్యే కొలికపూడిని రాజకీయంగా అణచివేసేందుకు చిన్ని ప్రయత్నిస్తున్నారని ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవుడి సన్నిధిలో భక్తితో ఉండాల్సింది పోయి, తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి, ఎంపీ కేశినేని చిన్ని ప్రయత్నించడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయనే మాట వినపడుతోంది.
ఈ గొడవలో ఎమ్మెల్యేను ఇబ్బంది పెట్టిన తీరు చూస్తుంటే, జిల్లా రాజకీయాల్లో తన పట్టు కోసం చిన్ని ఏ స్థాయికైనా దిగజారుతారు.. విమర్శలు నిజమేననిపిస్తోందని పొలిటికల్ సర్కిల్స్ లో డిస్కషన్ మొదలైంది. ఇలాగే విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ విషయంలో చిన్ని.. ఇలా బిహేవ్ చేస్తారా.. అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే చిన్ని తాగి గుడికి వచ్చారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇప్పటివరకు కొలికిపూడి శ్రీనివాస్ ది మాత్రమే తప్పు అని అనుకున్న వాళ్ళందరూ.. ఇక్కడ ఎంపీ బిహేవియర్ చూసి షాక్ అయ్యారు. తెలుగుదేశం పార్టీకి విజయవాడ గుండెకాయ లాంటిది. అలాంటి నియోజకవర్గంలో ఇలాంటి చిల్లర రాజకీయాలు పార్టీ పరువు కృష్ణా నదిలో కలుపుతున్నాయి. ప్రోటోకాల్ తెలియని వ్యక్తిని ఎంపీ ని ఎలా చేశారంటూ పార్టీ టిడిపి కార్యకర్తలు కూడా ఫైర్ అవుతున్నారు.