దక్షిణ కొరియా వ్యాపార రంగాన్ని, గేమింగ్ పరిశ్రమను తీవ్రంగా ఆకట్టుకున్న అతిపెద్ద విడాకుల పరిహారం కేసులో సీయోల్ ఫ్యామిలీ కోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. దక్షిణ కొరియాలోనే అత్యంత సంపన్న గేమింగ్ వ్యాపారవేత్తల్లో ఒకరైన, 'స్మైల్‌గేట్' వ్యవస్థాపకుడు క్వాన్ హ్యుక్-బిన్ తన భార్య 'లీ' కి దాదాపు 2.55 ట్రిలియన్ వోన్ల ఆస్తిని బదిలీ చేయాలని కోర్టు ఆదేశించింది. అంటే మన కరెన్సీలో దాదాపు 17 వేల కోట్లు. దక్షిణ కొరియా చట్ట చరిత్రలోనే నమోదైన అత్యంత ఖరీదైన విడాకుల ఆస్తి పంపిణీ తీర్పుగా ఇది కొత్త రికార్డు సృష్టించింది. క్వాన్ హ్యుక్-బిన్ 1999లో సోగాంగ్ యూనివర్సిటీలో చదువుతున్న సమయంలో లీని కలుసుకుని, 2001లో వివాహం చేసుకున్నారు. మరుసటి ఏడాదే కేవలం 50 మిలియన్ వోన్ల పెట్టుబడితో 'స్మైల్‌గేట్' సంస్థను స్థాపించారు.
ఈ సంస్థ విశ్వవ్యాప్తంగా విజయం సాధించిన ‘క్రాస్‌ఫైర్’, ‘లాస్ట్ ఆర్క్’ లాంటి భారీ హిట్ గేమ్‌లను రూపొందించి, దక్షిణ కొరియాలోని టాప్-5 గేమింగ్ దిగ్గజాల్లో ఒకటిగా ఎదిగింది. సుదీర్ఘమైన 20 ఏళ్ల దాంపత్య జీవితం తర్వాత, 2022 నవంబర్‌లో.. లీ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. స్మైల్‌గేట్ వైఫల్యానికి క్వాన్‌యే బాధ్యుడని పేర్కొంటూ ఆయన ఆస్తిలో 50% వాటా కావాలని డిమాండ్ చేశారు. అయితే, వివాహ బంధాన్ని విచ్ఛిన్నం చేయకూడదని క్వాన్ భావించినప్పటికీ, నాలుగేళ్ల న్యాయపోరాటం తర్వాత సీయోల్ ఫ్యామిలీ కోర్టు విడాకులను మంజూరు చేసింది. క్వాన్ ఆస్తుల విలువను 7.33 ట్రిలియన్ వోన్లుగా గుర్తించింది కోర్టు. భార్య లీ కి 35% ఆస్తి వాటాను, క్వాన్‌కు 65% వాటాను కేటాయించింది.
క్వాన్ వద్ద ఉన్న స్మైల్‌గేట్ షేర్లలో 35% వాటాను భార్య లీ కి బదిలీ చేయడంతో పాటు, మిగిలిన లోటు కింద 65 బిలియన్ వోన్ల క్యాష్ చెల్లించాలని కోర్టు ఆదేశించింది. వివాహ బంధం దెబ్బతినడానికి ఇద్దరిదీ సమాన బాధ్యత అని భావిస్తూ.. లీ కోరిన ప్రత్యేక పరిహారం క్లెయిమ్‌ను కోర్టు కొట్టివేసింది. కంపెనీ వృద్ధిలో లీ పాత్రను కోర్టు ప్రత్యేకంగా గుర్తించింది. స్మైల్‌గేట్ ప్రారంభంలో లీ సీఈఓగా నమోదు కావడమే కాకుండా, దాదాపు 20 ఏళ్ల వివాహ జీవితంలో ఇంటి బాధ్యతలు, పిల్లల పెంపకాన్ని పూర్తిగా చూసుకుంటూ క్వాన్ వ్యాపార వృద్ధికి పరోక్షంగా మద్దతుగా నిలిచారని కోర్టు అభిప్రాయపడింది. అయితే, స్మైల్‌గేట్‌ను 1.4 ట్రిలియన్ వోన్ల వార్షిక ఆదాయం కలిగిన స్థాయికి తీసుకెళ్లడంలో క్వాన్ యొక్క వ్యాపార నైపుణ్యం, నిర్ణయాలు కీలకమని పేర్కొంటూ లీ వాటాను 35 శాతానికి పరిమితం చేసింది.
గత 14 ఏళ్లుగా స్మైల్‌గేట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా 100% వాటాతో పూర్తిగా క్వాన్ యొక్క ఏకచ్ఛత్రాధిపత్యం కింద నడుస్తోంది. తీర్పు ప్రకారం 35% వాటా ఇచ్చినా, క్వాన్ వద్ద 65% మెజారిటీ వాటా ఉంటుంది కాబట్టి కంపెనీపై ఆయన నిర్వహణ నియంత్రణ ప్రస్తుతానికి సురక్షితంగానే ఉంటుంది. దక్షిణ కొరియా వాణిజ్య చట్టాల ప్రకారం, విలీనాలు, రాజ్యాంగ సవరణలు వంటి ప్రధాన ప్రతిపాదనలు ఆమోదం పొందడానికి 2/3 వంతు.. అంటే సుమారు 66.7% వాటాదారుల అంగీకారం కావాలి. లీ వద్ద 35% వాటా ఉండటం వల్ల క్వాన్ ఇకపై ఒంటరిగా నిర్ణయాలు తీసుకోలేరు. లీ రెండవ అతిపెద్ద వాటాదారుగా మారడం వల్ల కంపెనీ బోర్డు సమాచారం సేకరించడం, వాటాదారుల ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడం, డివిడెండ్ల పంపిణీ లేదా కంపెనీని ఐపీఓ ద్వారా పబ్లిక్ లిస్టింగ్ చేయాలని ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. సుదీర్ఘకాలంగా బయటి పెట్టుబడిదారుల జోక్యం లేకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ ఏటా వందల కోట్ల డివిడెండ్లు అందుకుంటున్న క్వాన్ హ్యుక్-బిన్‌కు ఈ తీర్పు పెద్ద షాక్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఈ తీర్పుపై అప్పీలుకు వెళ్లేందుకు రెండు వారాల సమయం ఉంది. ఒకవేళ పైకోర్టుల్లో కూడా ఇదే తీర్పు ఖరారైతే, స్మైల్‌గేట్ కంపెనీ యొక్క భవిష్యత్తు వ్యాపార వ్యూహాలు మరియు కార్పొరేట్ గవర్నెన్స్‌లో గణనీయమైన మార్పులు రావడం ఖాయం.