Top story: సింధూ జలాలను ఆపేస్తే…సగం పాక్ ఎండిపోతుందా ? దాయాది ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవడం ఖాయమా ?

సింధూ జలాలను భారత్ ఆపేస్తే...పాకిస్తాన్‌లో తీవ్ర సంక్షోభం కూరుకుపోతుంది. నీరు నిలిచిపోతే పాకిస్తాన్‌లోని సాగు భూములు ఎండిపోతాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 25, 2025 | 04:00 PMLast Updated on: Apr 25, 2025 | 4:00 PM

If The Indus River Is Stopped Will Half Of Pakistan Dry Up Is It Certain That The Countrys Economy Will Collapse

సింధూ జలాలను భారత్ ఆపేస్తే…పాకిస్తాన్‌లో తీవ్ర సంక్షోభం కూరుకుపోతుంది. నీరు నిలిచిపోతే పాకిస్తాన్‌లోని సాగు భూములు ఎండిపోతాయి. తాగునీటికి కటకట అనాల్సిన పరిస్థితులు వస్తాయి. విద్యుత్ ప్రాజెక్టులు కూడా తీవ్రంగా నష్టపోతాయి. భారత్ తీసుకున్న ఈ చర్య పాకిస్తాన్‌ను ఆర్థికంగా మరింత దిగజార్చే అవకాశం ఉంది. అయితే, సింధు జల ఒప్పందాన్ని రద్దు చేయడం అంత ఈజీనా.. భారత్ ఒక్క రాత్రిలో చీనాబ్, జీలం, సింధు నదుల నీటిని ఆపగలదా ? ఈ మూడు నదులు నీటిని నిలిపేందుకు భారత్ కు ఎంత సమయం పడుతుంది ?

జమ్ముకశ్మీర్‌లో పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌ను భారత్‌ ఊహించని దెబ్బకొట్టింది. ముఖ్యంగా దౌత్య సంబంధాలపై భారత ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. వాటిలో అత్యంత కీలకమైనది తక్షణమే పాక్‌తో ఉన్న సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. సీమాంతర ఉగ్రవాదానికి పాక్‌ ముగింపు పలికే వరకూ ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. భారత నిర్ణయం తక్షణమే పాక్‌పై కనిపించకపోవచ్చు. సింధూ జలాలను నిల్వ చేయడానికి, మళ్లించడానికి తగిన వసతులు లేని కారణంగా ఆ నీటి ప్రవాహాన్ని వెంటనే ఆపడం భారత్‌కు సాధ్యం కాదు. కాకపోతే తక్షణమే 5 నుంచి 10శాతం ప్రవాహాన్ని మాత్రం తగ్గించే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. ఇప్పటి వరకు సింధూ, జీలం, చీనాబ్‌ నదులపై ప్రవాహానికి ఆటంకం కలిగించే నిర్మాణాలు చేపట్టకుండా ఈ ఒప్పందం అడ్డుపడింది. ఒప్పందం నిలిపివేతతో భారత్‌ స్వేచ్ఛగా నిర్మాణాలు చేపట్టే అవకాశం కలిగింది. ఒక్కసారి భారీ డ్యాంలు నీటి ప్రవాహాలపై నిర్మిస్తే పాక్ గొంతు తడారిపోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

చీనాబ్, జీలం, సింధు నదులపై భారత్ ఇప్పటికిపుడు నీటిని నిల్వ చేయడానికి ప్రాజెక్టులు కట్టడం సాధ్యం కాదు. అయితే విద్యుత్ ప్రాజెక్టులు మాత్రం వరుసగా భారత్ నిర్మిస్తూ వస్తోంది. ఒప్పందాల కారణంగా అనేక ప్రాజెక్టులను భారత్ పూర్తి చేయలేదు. సింధూనది ఒప్పందాన్ని రద్దు చేయడంతో…ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసే అవకాశం లభించింది. బాగ్లిహార్ అనే ప్రాంతం వద్ద జలవిద్యుత్ ప్రాజెక్టులు నిర్మించారు. దీంతో పాకిస్తాన్ కు ఇప్పటికే జల ప్రవాహం తగ్గిపోయింది. 2019 పుల్వామా దాడి తర్వాత, బియాస్, రావి, సట్లెజ్ జలాలను పూర్తిగా పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలకు మళ్లించే ప్రణాళికలను కేంద్రం ప్రకటించింది. సింధూనదిపై పంజాబ్ లోని షాహ్‌పూర్-కండి డ్యామ్ ప్రాజెక్ట్ నిర్మాణం ద్వారా నీటిని భారీస్థాయిలో మళ్లించవచ్చు. సింధు నది వ్యవస్థలోని ప్రధాన నదులు భారత భూభాగం గుండా ప్రవహిస్తాయి కాబట్టి వాటిని నియంత్రించడం భారత్ చేతుల్లోనే ఉంటుంది. పారే నీటిని ఆపుకునే డ్యాములను ఇప్పటికిప్పుడు కట్టలేకపోవచ్చు కానీ.. వాటిని మళ్లించి ఇతర చోట్లకు తరలించే అవకాశం మాత్రం ఉంటుంది.

పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలలో సింధు నది జలాలు అత్యంత కీలక భూమిక పోషిస్తాయి. భారత్, పాకిస్తాన్ 1960లో సింధు నదీ వ్యవస్థలోని నీటి వినియోగం మీద ఇక ఒప్పందం కుదుర్చున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం సట్లెజ్, బియాస్, రావి నదుల నీటిని భారత్ ఉపయోగించుకోవచ్చు. అదే సమయంలో జీలం, చీనాబ్, సింధు నదుల నీటిపై పాకిస్తాన్‌ వాడుకుంటుంది. సింధు జల ఒప్పందంలో భారత్ పాకిస్తాన్‌తో చేసుకున్న ఒప్పందంలో మొత్తం నదీ నీటిలో కేవలం 20 శాతం మాత్రమే తన వద్ద ఉంచుకుంది. శాంతి కోసం భారత్ 80 శాతం నీటిని పాకిస్తాన్ వినియోగానికే వదిలేసింది.

ఆ దేశ సాగు భూమిలో సుమారు 80 శాతం పంటలకు నీరు అందిస్తూ 16 లక్షల హెక్టార్ల సాగుభూమికి సింధు నది జీవనాడిగా ఉంది. పాక్‌లో దాదాపు 23.7 కోట్ల మంది ఈ నదిపై ఆధారపడి జీవిస్తున్నారు. కరాచీ, లాహోర్‌, ముల్తాన్‌ వంటి ప్రముఖ నగరాలు నీటి వనరుల కోసం ఈ నదిపైనే ఆధారపడ్డాయి. పాక్‌లో అత్యంత కీలకమైన తర్బెలా, మాంగ్ల జలవిద్యుత్‌ కేంద్రాలకు ఈ నీటి ప్రవాహమే దిక్కు. పాక్‌ విద్యుత్‌ ఉత్పత్తిలో ఏటా 8 శాతం జీలమ్‌ నదిపై నిర్మించిన మంగ్ల డ్యామ్‌ నుంచి ఉత్పత్తి అవుతుండగా, సింధూ నదిపై నిర్మించిన తర్బెల డ్యామ్‌ నుంచి 16 శాతానికి సమానమైన విద్యుత్తు తయారవుతుంది. పాకిస్థాన్ జీడీపీలో దాదాపు 25 శాతాన్ని అందిస్తున్న వ్యవసాయ ఉత్పత్తులు గోధుమ, వరి, చెరకు, పత్తి వంటి పంటలు సింధూ నది ప్రవాహంపైనే ఆధారపడి ఉన్నాయి.