2 చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు శిక్ష..!

మీకు రెండు చోట్ల ఓటు ఉందా? అయితే వెంటనే అప్రమత్తమవ్వండి. లేదంటే మీరు అరెస్ట్‌ అయ్య సంవత్సరం పాటు జైలులో ఉండాల్సి వస్తుంది. ఒక వ్యక్తికి ఒకే చోట ఓటు ఉండాలని, అలా కాకుండా రెండు లేదా అంతకంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు

Post Published By: dialnews
Updated : 13 July 2026, 7:00 PM IST

మీకు రెండు చోట్ల ఓటు ఉందా? అయితే వెంటనే అప్రమత్తమవ్వండి. లేదంటే మీరు అరెస్ట్‌ అయ్య సంవత్సరం పాటు జైలులో ఉండాల్సి వస్తుంది. ఒక వ్యక్తికి ఒకే చోట ఓటు ఉండాలని, అలా కాకుండా రెండు లేదా అంతకంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు కలిగి ఉండటం చట్టవిరుద్ధమని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్‌రెడ్డి హెచ్చరించారు. కావాలని తప్పుడు సమాచారంతో రెండు చోట్ల ఓటు పొందితే.. ఏడాది పాటు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో కీలక విషయాలు చెప్పారు సుదర్శన్‌ రెడ్డి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ''SIR'' ప్రక్రియ గురించి ప్రజలకున్న సందేహాలను నివృత్తి చేశారు. ఎవరైనా రెండు రాష్ట్రాల్లో ఓటు కలిగి ఉంటే వారిని పట్టుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ‘డెమోగ్రాఫికల్లీ సిమిలర్ ఎంట్రీస్’ DSE అనే అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌ను వాడుతోందని, దీని ద్వారా అక్రమ ఓటర్లను సులభంగా గుర్తిస్తామని ఆయన చెప్పారు.

ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణలో ప్రతి పౌరుడు పాల్గొని తమ ఓటు హక్కును కాపాడుకోవాలని సీఈవో కోరారు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి నుంచి సామాన్యుడి వరకు ఎవరికీ ఇందులో మినహాయింపు లేదు. బీఎల్‌వోలు BLO ఇంటికి వచ్చి రెండు ఎన్యుమరేషన్ ఫారాలు ఇస్తారు. అందులో ఒకటి నింపి వాళ్లకు ఇచ్చి, రెండోది రశీదుగా మనం ఉంచుకోవాలి. ఫారం నింపి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో ఉంటాయని స్పష్టం చేశారు. "నాకు ఇక్కడ ఆస్తులున్నాయి, కరెంటు బిల్లులు కడుతున్నాను" అని వాదిస్తే కుదరదని, ఫారం తప్పనిసరిగా నింపాల్సిందేనని తేల్చి చెప్పారు. ఒకవేళ మీ ఇంటికి బీఎల్‌వో రాకపోయినా, ఫారం అందకపోయినా కంగారు పడాల్సిన అవసరం లేదు. NVSP వెబ్‌సైట్ లేదా ఈసీఐ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో మీరే స్వయంగా వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఒకవేళ ముసాయిదా జాబితాలో పేరు రాకపోయినా.. ఆగస్టు 1 నుంచి కొత్త ఓటు కోసం ఫాం-6, వివరాల మార్పుల కోసం ఫాం-8 వాడుకునే అవకాశం ఉంటుంది.

గ్రామీణ ప్రాంతాల్లో అడ్రస్‌లు ఈజీగా దొరుకుతుండటంతో సర్వే 90% పూర్తయ్యింది. కానీ, హైదరాబాద్‌లో అడ్రస్‌లు సరిగ్గా దొరకకపోవడం, కొత్తగా వచ్చిన BLOలకు స్థానిక ప్రాంతాలపై అవగాహన లేకపోవడం వల్ల ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని సీఈవో వివరించారు. ఇక, ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే హైదరాబాద్, నిజామాబాద్ లాంటి ప్రాంతాల్లో వారి సౌకర్యం కోసం ఉర్దూ భాషలోనూ ఎన్యుమరేషన్ ఫారాలను అందుబాటులోకి తెచ్చారు. రోహింగ్యాల లాంటి అక్రమ నివాసితులు ఆధార్, బ్యాంక్ అకౌంట్లతో ఓటర్ల జాబితాలో చేరుతున్నారన్న ఆందోళనలపైనా ఆయన స్పందించారు. అలాంటి అనుమానిత ప్రాంతాలను గుర్తించామని, వారికి నోటీసులు జారీ చేసి, పక్కాగా విచారణ చేసిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాబట్టి ఓటర్లంతా బాధ్యతగా వ్యవహరించి, ఒకే చోట ఓటు ఉండేలా చూసుకోవాలని చెప్తున్నారు అధికారులు.

Published : 
  • 13 July 2026, 7:00 PM IST