Top story: ప్రైవేట్‌ కంపెనీల చేతికి ఇస్రో ? ఇస్రోలో అసలు ఏం జరుగుతోంది?

భారతదేశ కీర్తిపతాకాన్ని విశ్వవీధిలో ఎగురవేసిన ప్రతిష్టాత్మక అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘ఇస్రో’ ప్రస్తుతం ఒక కీలకమైన, సంక్లిష్టమైన పరిణామ దశ గుండా వెళుతోంది. అంతరిక్ష రంగాన్ని ప్రైవేటు రంగానికి ప్రోత్సాహకరంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం

Post Published By: dialnews
Updated : 8 September 2026, 5:30 PM IST

భారతదేశ కీర్తిపతాకాన్ని విశ్వవీధిలో ఎగురవేసిన ప్రతిష్టాత్మక అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘ఇస్రో’ ప్రస్తుతం ఒక కీలకమైన, సంక్లిష్టమైన పరిణామ దశ గుండా వెళుతోంది. అంతరిక్ష రంగాన్ని ప్రైవేటు రంగానికి ప్రోత్సాహకరంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విధానాలు, ఇప్పుడు సంస్థ లోపల తీవ్ర అలజడికి దారితీశాయి. రాకెట్ల ప్రాథమిక తయారీ, ఉపగ్రహాల నిర్మాణం, లాంచ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్వహణ వంటి కీలకమైన బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు, NSILకు అప్పగించే దిశగా వేగంగా అడుగులు పడుతుండటంతో, ఇస్రో ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమారు ఆరేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం భారత అంతరిక్ష రంగాన్ని ప్రైవేట్ భాగస్వామ్యానికి తలుపులు తెరిచింది. అయితే, ఇటీవల ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ చైర్మన్ పవన్ కుమార్ గోయెంకా చేసిన వ్యాఖ్యలు ఈ నిరసనకు ప్రధాన కారణమయ్యాయి.

భవిష్యత్తులో ఇస్రో రాకెట్ల నిర్మాణాన్ని పూర్తిగా నిలిపివేస్తుందని, ఆ బాధ్యతలన్నీ ప్రైవేట్ కంపెనీలు లేదా ఇతర ప్రభుత్వ రంగ సంస్థలే నిర్వహిస్తాయని ఆయన వెల్లడించారు. దీనికి తోడు, సాధారణ ఉపగ్రహాల తయారీని కూడా ప్రైవేట్ రంగానికి బదిలీ చేయడం, తమిళనాడులోని కులశేఖరపట్నంలో నిర్మిస్తున్న నూతన స్పేస్ లాంచ్ కాంప్లెక్స్ వంటి మౌలిక వసతులను ప్రైవేటు సంస్థల వినియోగానికి తెరవడానికే ప్రాధాన్యం ఇవ్వడం ఉద్యోగ వర్గాల్లో ఆందోళనలను పెంచింది. ఇప్పటివరకు ఇస్రోకు చెందిన సుమారు 120కి పైగా సాంకేతిక పరిజ్ఞానాలను ప్రైవేట్ రంగానికి బదిలీ చేసినట్లు సమాచారం. తమ భవిష్యత్తు, ఉద్యోగ భద్రతపై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాలంటూ దేశవ్యాప్తంగా ఉన్న వేర్వేరు ఇస్రో సెంటర్లకు చెందిన 9 ఉద్యోగ సంఘాలు ఏకమై, ఇస్రో చైర్మన్ మరియు అంతరిక్ష విభాగ కార్యదర్శి వి.నారాయణన్‌కు లేఖ రాశాయి.

ప్రైవేటీకరణపై బహిరంగంగా రకరకాల ప్రకటనలు వస్తున్నప్పటికీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ నుంచి స్పష్టమైన అధికారిక విధాన పత్రం లేకపోవడం ఏంటని ప్రశ్నించాయి. పవన్ గోయెంకా చేసిన వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వ అధికారిక పాలసీయేనా ? కాదా ? అని స్పష్టం చేయాలని కోరాయి. PSLV, LVM3, SSLV మరియు రాబోయే తరం రాకెట్ల డిజైన్, డెవలప్‌మెంట్, అసెంబ్లీ, టెస్టింగ్, ప్రయోగాల బాధ్యతల్లో ఇస్రో పాత్ర కొనసాగుతుందా లేదా అనే దానిపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశాయి. ఇస్రోలోని సాంకేతిక, వైజ్ఞానిక, పరిపాలనా విభాగాలు మరియు క్వాలిటీ, సేఫ్టీ కేడర్లకు చెందిన వేలాది మంది ఉద్యోగులలో ప్రధానంగా నాలుగు రకాల భయాలు వ్యక్తమవుతున్నాయి. కీలకమైన రాకెట్, శాటిలైట్ తయారీ బాధ్యతల నుంచి ఇస్రో తప్పుకుంటే, సంస్థ అంతర్గతంగా చేసే పనులు తగ్గిపోయి, ఉద్యోగుల అవసరం తగ్గిపోతుందని భయపడుతున్నారు.

అంతర్గత ప్రాజెక్టులు తగ్గితే, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు కొత్త నైపుణ్యాలను పెంపొందించుకునే అవకాశం ఉండదని, ప్రమోషన్ అవకాశాలు తీవ్రంగా దెబ్బతింటాయని పేర్కొంటున్నారు. గ్రూప్-ఎ, బి, సి పోస్టుల్లో ప్రభుత్వం నియామకాలను తగ్గిస్తే, ఇస్రోలో చేరాలనే యువత కల నెరవేరకుండా పోతుందని ఆందోళన చెందుతున్నారు. రాకెట్ డిజైన్, ప్రయోగాలు కేవలం వ్యాపార కాంట్రాక్టులు కావని, దశాబ్దాల తరబడి కష్టపడి సాధించిన నైపుణ్యమని, దానిని ప్రైవేటు రంగానికి పూర్తిగా ఇచ్చేస్తే భారత్ యొక్క స్వయంసమృద్ధి దెబ్బతింటుందని వాదిస్తున్నారు. ప్రైవేట్ భాగస్వామ్యానికి గానీ, న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ ద్వారా జరిగే వాణిజ్య కార్యకలాపాలకు గానీ పూర్తి వ్యతిరేకం కాదని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. అయితే ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడం వేరు, దాని పేరుతో ఇస్రో సొంత సామర్థ్యాలను తగ్గించివేయడం వేరని తేల్చిచెప్పాయి.

శాస్త్రవేత్తలు కేవలం రీసెర్చ్‌కే పరిమితమై, ప్రయోగాల అమలుకు దూరమైతే ఇస్రో తన ప్రాధాన్యతను కోల్పోతుందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామంపై దేశ రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చ నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం కావాలనే ఇస్రో ప్రాధాన్యతను తగ్గిస్తోందని, పరిశోధనా రంగాన్ని వ్యాపారీకరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. చంద్రయాన్, ఆదిత్య L1 వంటి చారిత్రాత్మక విజయాలతో ప్రపంచ వేదికపై భారత్‌ను అగ్రస్థానంలో నిలిపిన ఇస్రో శాస్త్రవేత్తలు, ఈ అనిశ్చితి వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. అంతరిక్ష ప్రయోగాల్లో ప్రైవేటు రంగాన్ని భాగస్వామ్యం చేస్తూనే, దేశానికి వెన్నుముకగా ఉన్న ఇస్రో ప్రాభవాన్ని, ఉద్యోగుల భవిష్యత్తును రక్షించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Published : 
  • 8 September 2026, 5:30 PM IST