పవన్ కు ముంబైలో 3.5 గంటల భారీ ఆపరేషన్.. వారాహి యాత్రలో అసలేం జరిగింది..?

కోట్ల మంది గుండెల్లో పవర్‌స్టార్.. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత కొన్నేళ్లుగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నారనే నిజం ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది. గత రెండేళ్లుగా ఆయన ఎన్నికల ప్రచారాలు, వారాహి యాత్రలు, పర్యటనల్లో

Post Published By: dialnews
Updated : 13 July 2026, 12:30 PM IST

కోట్ల మంది గుండెల్లో పవర్‌స్టార్.. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత కొన్నేళ్లుగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నారనే నిజం ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది. గత రెండేళ్లుగా ఆయన ఎన్నికల ప్రచారాలు, వారాహి యాత్రలు, పర్యటనల్లో ఎంత యాక్టివ్‌గా కనిపించినా.. లోపల మాత్రం నరకప్రాయమైన శారీరక నొప్పితో నలిగిపోయారు. ఎట్టకేలకు ఆయన ముంబైలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారు. అక్కడ వైద్యుల బృందం ఆయనకు సుమారు మూడున్నర గంటల పాటు ఒక భారీ సర్జరీని విజయవంతంగా పూర్తి చేసింది. అసలు పవన్ కళ్యాణ్‌ను పదేళ్లుగా వెంటాడుతున్న ఆ పాత గాయం ఏంటి? రెండు భుజాల కండరాలు పూర్తిగా చిట్లిపోయినా ఆయన ఎలా భరించారు? డాక్టర్లు ఇచ్చిన షాకింగ్ రిపోర్ట్ ఏంటి?

పవన్ కళ్యాణ్ కార్యాలయం విడుదల చేసిన అధికారిక సమాచారం ప్రకారం.. ఈ సమస్య ఈరోజుది కాదు. దాదాపు పదేళ్ల క్రితం, అంటే 2016లోనే పవన్ కళ్యాణ్‌కు భుజానికి తీవ్రమైన గాయాలయ్యాయి. అప్పట్లో ప్రాథమిక చికిత్స తీసుకున్న తర్వాత డాక్టర్లు విశ్రాంతి తీసుకోమని చెప్పారు. కానీ పవన్ దాన్ని లెక్కచేయకుండా ప్రజాసేవ, షూటింగులతో బిజీ అయిపోయారు. ఆ తర్వాత 2018లో సాగిన పోరాట యాత్ర, 2019 తర్వాత రాయలసీమ పర్యటనలు, ముఖ్యంగా మదనపల్లె టమోటా రైతుల సమస్యల పరిశీలనకు వెళ్లినప్పుడు.. జనసేన శ్రేణులు, అభిమానులు ఆయనతో కరచాలనం చేయడానికి దూసుకువచ్చేవారు. ఆ ఉత్సాహంలో పవన్ చేతులు పట్టుకుని గట్టిగా గుంజడంతో ఆ పాత గాయాలు తీవ్రంగా తిరగబెట్టాయి. అయినా సరే, పవన్ పంటిబిగువున ఆ నొప్పిని భరించారే తప్ప ఎక్కడా బయటపడలేదు.

గత రెండేళ్లుగా ఏపీ రాజకీయాల్లో వారాహి యాత్ర సృష్టించిన ప్రభంజనం మనందరికీ తెలిసిందే. కానీ, ఆ యాత్రలో వాహనంపై గంటల తరబడి నిలబడి, లక్షలాది మందికి చేతులెత్తి నమస్కరించడం వల్ల ఆయన భుజాలపై భౌతిక ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది. రీసెంట్‌గా గత ఏప్రిల్ నెలలో పవన్ కళ్యాణ్‌కు ముక్కుకు సంబంధించిన ఒక చిన్న సైనుసైటిస్ సర్జరీ జరిగినప్పుడు.. డాక్టర్లు భుజాలకు కూడా స్కానింగ్ చేసి షాక్ అయ్యారు. పవన్ రెండు భుజాల 'రొటేటర్ కఫ్' కండరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, అసలు ఇంత తీవ్రమైన నొప్పితో ఆయన పర్యటనలు ఎలా చేస్తున్నారని వైద్యులే ఆశ్చర్యపోయారు. వెంటనే సర్జరీ చేయాలని అప్పుడే హెచ్చరించారు.

అయితే, ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడటం, డెప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టడం, వరదలు, అధికారిక సమీక్షలు ఉండటంతో.. 'నా కార్యక్రమాలు ముగించుకుని వస్తాను' అని పవన్ సర్జరీని వాయిదా వేసుకున్నారు. చివరకు జూలై 10న ఆయన తన సతీమణి అన్నా లెజినోవాతో కలిసి ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రికి చేరుకున్నారు. శనివారం ఉదయం ప్రపంచ ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దిన్షా పార్థీవాలా నేతృత్వంలోని వైద్యుల బృందం పవన్‌కు సర్జరీ ప్రారంభించింది. కుడి భుజానికి తీవ్రమైన రొటేటర్ కఫ్ ఇంజ్యూరీతో పాటు 'అవల్షన్ ఫ్రాక్చర్' కూడా ఉండటంతో దాదాపు మూడున్నర గంటల పాటు ఈ భారీ ఆపరేషన్ నిర్వహించాల్సి వచ్చింది.

రెండు భుజాలకూ ఒకేసారి ఆపరేషన్ చేస్తే నొప్పి తీవ్రత భరించలేరని.. అందుకే ప్రస్తుతానికి కుడి భుజానికి మాత్రమే సర్జరీ పూర్తి చేశామని డాక్టర్లు ప్రకటించారు. మళ్లీ రెండు నెలల వ్యవధి తర్వాత ఎడమ భుజానికి కూడా సర్జరీ చేయనున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆరోగ్యం స్థిరంగా ఉందని, ఆయన కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. పవన్ కళ్యాణ్ సర్జరీ సక్సెస్ అవ్వడంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పవన్ త్వరగా కోలుకోవాలని, ఆయనకు భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు. అటు మెగా ఫ్యాన్స్, జనసైనికులు కూడా 'గెట్ వెల్ సూన్ పవన్ అన్నా' అంటూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.

Published : 
  • 13 July 2026, 12:30 PM IST