ఇరాన్ నేవీ కమాండర్ రేర్ అడ్మిరల్ షారమ్ ఇరానీ అయితే దిగ్బంధం లేకపోతే విధ్వంసం.. ఈ రెండే తప్ప మరో ఆప్షన్ లేదని ప్రకటించన ట్రంప్‌కు కౌంటర్‌గా షాకింగ్ ప్రకటన చేశారాయన. శత్రువుపై త్వరలోనే కొత్త ఆయుధంతో విరుచుకుపడనున్నట్లు తెలిపారు. ఆ ఆయుధం అమెరికాను తీవ్రంగా భయపెడుతుందని హెచ్చరించారు. 'అతిత్వరలో శత్రు బలగాలపై కొత్త ఆయుధాన్ని ప్రయోగిస్తాం. అది వారిని తీవ్రంగా భయపెట్టనుంది. అది వారి పక్కనే ఉంది. దానితో వారికి హార్ట్ ఎటాక్ కూడా రావొచ్చు' అని షారమ్ ఇరానీ పేర్కొన్నారు. అయితే, ఆ ఆయుధం ఏంటి అనే విషయాన్ని మాత్రం ఆయన స్పష్టంగా వెల్లడించలేదు. ప్రస్తుతం షారమ్ చెప్పిన ఆ సీక్రెట్ వెపన్ గురించే ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది. ఆ వెపన్ ఏమై ఉంటుందా అన్న ఉత్కంఠ మిడిల్ ఈస్ట్ మొత్తాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.
ఇరాన్ తన ఆయుధాగారంలో ఉన్నకొన్ని కీలక ఆయుధాలను అమెరికాకు హార్ట్ ఎటాక్ తెప్పించేవిగా అభివర్ణిస్తోంది. వాటిలో ఫతాహ్-2 ఒకటి. ఇరాన్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన హైపర్ సోనిక్ క్షిపణే ఇది. దీని వేగం ధ్వని వేగం కంటే 15 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇంత వేగంతో వచ్చే క్షిపణిని గుర్తించడం లేదా అడ్డుకోవడం ప్రస్తుత అమెరికా రక్షణ వ్యవస్థలకు దాదాపు అసాధ్యం. అందుకే దీన్ని చూసి అమెరికాకు హార్ట్ ఎటాక్ వస్తుందని ఇరాన్ వ్యంగ్యంగా అంటోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది మాత్రమే కాదు ఇరాన్ దగ్గర ఇతర సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులు కూడా ఉన్నాయి. సముద్ర మట్టానికి తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ, రాడార్లకు చిక్కకుండా యుద్ధ నౌకలను ధ్వంసం చేయగల సామర్థ్యం వీటికి ఉంది. అయితే, వీటన్నింటికీమించి ఇంకేదో ఆయుధం ఇరాన్ దగ్గర ఉండొచ్చు అన్న అనుమానాలూ లేకపోలేదు. అది డర్టీ బాంబ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే వాదనలూ ఉన్నాయి.
రేడియోధార్మిక పదార్థాలను దట్టించిన పేలుడు పదార్థాలనే డర్టీ బాంబుగా పిలుస్తారు. దాని దుష్పరిణామాలు కొన్ని మైళ్ల దాకా వ్యాపిస్తాయి. రేడియోధార్మిక పొడి, పెల్లెట్లున్న డర్టీ బాంబు పేలితే అక్కడి నీరు, గాలి, భూమి రేడియోధార్మిక పదార్థంతో కలుషితమవుతాయి. డ్రోన్లు, క్షిపణుల సాయంతో దాన్ని ప్రయోగిస్తే రేడియోధార్మిక అణువులు గాల్లో చెల్లాచెదురుగా వ్యాపిస్తాయి. ఆ గాలి పీల్చిన వారు తీవ్ర రోగాల బారిన పడతారు. సాగు భూములు ఎందుకూ పనికి రాకుండా పోతాయి. పైగా ఈ బాంబు సృష్టించే సమస్యల పరిష్కారం తలకుమించిన భారమే అవుతుంది. లాస్ ఏంజెలిస్ వంటి నగరంపై ఒక్క డర్టీ బాంబు వేస్తే అక్కడ గాలి, జల వనరుల శుద్ధికి ఏకంగా లక్షన్నర కోట్ల అవుతుందని 13 ఏళ్ల క్రితమే సదరన్ కాలిఫోర్నియా వర్సిటీ అంచనా వేసింది. ఈ లెక్కన గల్ఫ్ దేశాలపై ఇరాన్ డర్టీ బాంబులు వేస్తే జరిగే వినాశనం ఊహకు కూడా అందదు. కానీ, ఈ డర్టీ బాంబు ఇరాన్ దగ్గర నిజంగా ఉందా?
నిజానికి.. అమెరికా, ఇజ్రాయెల్‌తో యుద్ధంలో ఇరాన్ ముందున్న ఆఖరి అస్త్రం డర్టీ బాంబే అనేది డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అంచనా. ప్రస్తుతం వినియోగంలో ఉన్న వైద్య, వాణిజ్య ఉపకరణాల తయారీలో వాడే రేడియోధార్మిక మూలకాలతో డర్టీ బాంబును తయారు చేయొచ్చు. ఇందుకు రేడియోథెరపీలో వాడే సీసియం-137, స్మోక్ డిటెక్టర్‌లో వాడే అమేరిసియం-241, సర్జరీ ఉపకరణాలను శుద్ధి చేసే కోబాల్ట్-60 తదితరాల మిశ్రమాన్ని వాడతారు. ఇవిగాక ఇరాన్ దగ్గర 60 శాతం శుద్ధి చేసిన దాదాపు 440 కిలోల యురేనియం నిల్వలున్నాయి. వీటితో అణు బాంబు తయారు చేయలేకపోయినా డర్టీ బాంబును చాలా తేలిగ్గా రూపొందించవచ్చనీ, ఇరాన్ చిత్తుగా ఓడిపోయే పరిస్థితే వస్తే కచ్చితంగా డర్టీ బాంబులు ప్రయోగించే అవకాశం ఉందని అమెరికా జాతీయ భద్రతా విశ్లేషకుడు ఇటీవలే చెప్పారు. ఆ భయంతోనే ఇరాన్ న్యూక్లియర్ సైట్లపై అమెరికా, ఇజ్రాయెల్ ఇటీవల బాంబుల వర్షం కురిపిస్తున్నట్టు వార్తలొచ్చాయి. ఈ విషయంలో గల్ఫ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి కూడా.
ఇరాన్ ఒకవేళ డర్టీ బాంబును ఉపయోగిస్తే, అది ఇజ్రాయెల్‌లోని ప్రధాన నగరాలైన టెల్ అవీవ్ లేదా వ్యూహాత్మక సైనిక స్థావరాలను లక్ష్యం చేసుకోవచ్చని రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇజ్రాయెల్ తర్వాత ఇరాన్.. తమనే టార్గెట్ చేస్తుందని సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, కువైట్ వంటి గల్ఫ్ దేశాలు కూడా భయపడుతున్నాయి. ఇరాన్ నుండి దుబాయ్ కేవలం 100 మైళ్ల దూరంలోనే ఉంది. గాలి దిశను బట్టి, ఇరాన్ తన సొంత భూభాగంలో లేదా సముద్రంలో డర్టీ బాంబ్ ప్రయోగించినా, ఆ రేడియోధార్మిక మేఘాలు గంటల్లోనే పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలకు చేరుకోవచ్చు. అందుకే, ఆ దేశాలు డర్టీ బాంబ్ పేరు చెబితేనే నిలువునా వణికిపోతున్నాయి. పైగా తమపై దాడులు చేయడానికి అమెరికాకు భూభాగాలు ఇస్తున్నాయన్న కోపం ఇరాన్లో ఉంది. అందుకే, అమెరికాకు హార్ట్ ఎటాక్ తెప్పించే ఆయుధం డర్టీ బాంబే అయితే పెను విధ్వంసానికి దారి తీయడం ఖాయం.