Top Story:సున్నీ, షియాల వివాదం ఏమిటి ? ముస్లింల్లో షియా, సున్నీలు ఎవరు ?

సున్నీలు, షియాలకు...ఒకరంటే ఒకరికి పడదా ? రెండు వర్గాలు ఉప్పు నిప్పులా వ్యవహరిస్తాయా ? సున్నీ, షియాల మధ్య వివాదం ఎప్పుడు మొదలైంది ? అసలు సున్నీలు ఎవరు ? షియాలు ఎవరు ? దశాబ్దాలుగా ఆధిపత్యం కోసం పోరాటం

Post Published By: dialnews
Updated : 2 March 2026, 1:10 PM IST

సున్నీలు, షియాలకు...ఒకరంటే ఒకరికి పడదా ? రెండు వర్గాలు ఉప్పు నిప్పులా వ్యవహరిస్తాయా ? సున్నీ, షియాల మధ్య వివాదం ఎప్పుడు మొదలైంది ? అసలు సున్నీలు ఎవరు ? షియాలు ఎవరు ? దశాబ్దాలుగా ఆధిపత్యం కోసం పోరాటం చేస్తున్నాయా ? ఐదు ముస్లిం కంట్రీస్‌సై ఇరాన్‌ దాడితో...అనేక అంశాలు చర్చనీయాంశంగా మారాయి.సున్నీ, షియా వర్గాలు...ముస్లిం మతానికి చెందిన గ్రూపులే. అయితే ఒకరంటే మరొకరు అసలు పడదు. రెండు వర్గాలు బద్ధశత్రువుల్లా చూసుకుంటారు. వందల ఏళ్లుగా సున్నీలు, షియాలు...తాము గొప్పంటే తాము గొప్పంటూ ఆధిపత్యం ప్రదర్శిస్తూనే ఉన్నాయి. 632లో మహ్మద్‌ ప్రవక్త మరణంతోనే...ఈ ముస్లిం గ్రూపులు మధ్య వివాదం మొదలైందని చరిత్ర చెబుతోంది. ముస్లిం సమాజానికి నాయకత్వం వహించే అంశంతో పోరాటం షురూ అయింది. అది నేటికి రావణకాష్టంలా రగులుతూనే ఉంది.

సున్నీ, షియాలలో చట్టం, ఆచారాలు, సంస్థ వంటి అంశాలలో తేడాలుంటాయి. ఈ రెండు శాఖలు శతాబ్దాలుగా అనేక నమ్మకాలు, ఆచరణ పద్దతులు పాటిస్తున్నాయి. శతాబ్దాలుగా ఈ వర్గాలకు చెందిన నాయకులు ఒకరిపై ఒకరు ప్రభావం చూపిస్తూనే ఉన్నారు. సిరియా నుంచి లెబనాన్, ఇరాక్ నుంచి పాకిస్తాన్ వరకు విభజన వాదాన్ని విస్తరించడంలో ప్రాంతీయ సంఘర్షణల పాత్రే కీలకం. కొన్ని చోట్ల సంఘాలనూ చీల్చాయి. ఇస్లాంలోని ఈ రెండు శాఖల మధ్య వ్యత్యాసాలే...సౌదీ అరేబియా, ఇరాన్‌లను శత్రువులుగా మార్చేశాయని చరిత్రకారులు చెబుతున్నారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో మెజారిటీ ముస్లిం దేశాలు పాలస్తీనాకు మద్దతు తెలిపాయి.

ప్రపంచవ్యాప్తంగా ఇస్లాంను విశ్వసించే వారిలో ఎక్కువ మంది సున్నీ వర్గానికి చెందినవారే ఉన్నారు. ప్రపంచంలోని దాదాపు 90 శాతం ముస్లింలు సున్నీ శాఖను అనుసరిస్తారు. ఈ వర్గం ప్రజలు సున్నీని ఇస్లాంలోని అత్యంత సాంప్రదాయిక శాఖగా చూస్తారు.సున్నీ అనే పదం 'అహ్ల్-అల్-సున్నా' నుంచి వచ్చింది. అంటే... సంప్రదాయాన్ని అనుసరించే వ్యక్తులు. మహమ్మద్ ప్రవక్త , ఆయన సహచరుల పాటించిన ఆచరణలు, పద్దతులను ఈ సంప్రదాయం సూచిస్తుందని సున్నీ వర్గీయులు వారు భావిస్తారు. ఖురాన్‌లో ప్రవక్తలు చెప్పిన వాటిని సున్నీలు విశ్వసిస్తారు. వీరికి మహమ్మద్ ప్రవక్త అత్యంత పూజనీయులు. ఆ తర్వాత వచ్చిన ముస్లిం నేతలను తాత్కాలిక నాయకులుగా పరిగణిస్తారు.

షియా వర్గం...ఒక రాజకీయ వర్గంగా మొదలైంది. షియా అనే పదానికి సాహిత్యపరమైన అర్థం..షియాత్ అలీ.. అంటే అలీ పార్టీ. మహమ్మద్ ప్రవక్త‌కు అల్లుడు అలీ. ముస్లింలను నడిపించే హక్కు అలీ, ఆయన వారసులకు మాత్రమే ఉందని షియాలు భావిస్తుంటారు. అలీ హయాంలో జరిగిన కుట్రలు, హింస, అంతర్యుద్ధాల కారణంగా ఆయన హత్య జరిగింది. అలీ మరణానంతరం ఆయన కుమారులు హాసన్, హుస్సేన్‌లు...ఖలీఫా కావాలని షియాలు విశ్వసించారు. అలా జరగకపోవడంతో వారసత్వాన్ని కోల్పోయారు.

హాసన్‌పై ఉమయ్యద్ రాజవంశం మొదటి ఖలీఫా అయిన మువావియా ద్వారా విషప్రయోగం జరిగిందనే ఆరోపణలున్నాయి. కర్బలా యుద్ధభూమిలో హుస్సేన్ కుటుంబంతో సహా మరణించారు. షియాలలో మతాధికారుల శ్రేణి కూడా ఉంది. ఈ మత గురువులు ఇస్లామిక్ గ్రంథాలను అభ్యసిస్తారు. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో 12-17 కోట్ల మంది షియాలు ఉన్నారని చెబుతారు.ఈ జనాభా మొత్తం ముస్లిం జనాభాలో 10 శాతం. ఇరాన్, ఇరాక్, బహ్రెయిన్, అజర్‌బైజాన్, యెమెన్‌ లలో షియాలు అధికంగా ఉన్నారు. అఫ్గానిస్తాన్, ఇండియా, కువైట్, లెబనాన్, పాకిస్థాన్, ఖతార్, సిరియా, తుర్కియే, సౌదీ అరేబియా, యునైటెడ్ ఎమిరేట్స్‌లలో షియాల జనాభా ఎక్కువగానే ఉంది.

సున్నీ పాలిత దేశాలలో షియాలే ఎక్కువగా పేదలు. తమను తాము వివక్ష, అణచివేతలు బాధితులుగా షియాలు భావిస్తుంటారు. కొంతమంది సున్నీ మిలిటెంట్లు..షియాలపై ద్వేషాన్ని కూడా బోధిస్తుంటారు. ఈ రెండింటి మధ్య విభజనే మిడిల్ ఈస్ట్ పొత్తులు, శత్రువులను నిర్ణయిస్తుంటుంది. 1979 నాటి ఇరాన్ విప్లవం...ఈ ప్రాంతంలో షియా ఫండమెంటలిస్ట్ ఇస్లామిక్ ఎజెండాను ప్రారంభించింది. గల్ఫ్ దేశాల్లోని సున్నీ ప్రభుత్వాలకు ఇది సవాల్‌గా మారింది. విప్లవం తర్వాత ఇరాన్ చేసిన విధానంలో భాగంగా, అది దేశం వెలుపల ఉన్న షియా పార్టీలు, మిలీషియాలకు సహాయం చేయడం ప్రారంభించింది. లెబనీస్ అంతర్యుద్ధంలో ఇరాన్ మద్దతుతో హిజ్బుల్లా ఒక శక్తిగా ఎదిగింది. షియా ప్రభావాన్ని ఎదుర్కోవటానికి సున్నీ ప్రభుత్వాలు... దేశం వెలుపల ఇతర ఉద్యమాలకు మద్దతు ఇస్తున్నాయి. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్లలో సున్నీ మిలిటెంట్ గ్రూపు తాలిబాన్ ఈ విధంగానే ఉనికిలోకి వచ్చింది. తాలిబన్లు తరచూ షియా మత స్థలాలపై దాడులు చేస్తుంటారు.

 

Published : 
  • 2 March 2026, 1:10 PM IST