ఫుట్‌బాల్ ప్రపంచంలో మరో మహా సంగ్రామం ముగిసింది. కానీ కోట్ల మంది అర్జెంటీనా అభిమానుల గుండెలు ముక్కలయ్యాయి. ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్స్ పోరులో ల్యాటిన్ అమెరికా దిగ్గజం అర్జెంటీనా.. యూరోపియన్ పవర్‌హౌస్ స్పెయిన్ చేతిలో 1-0 తేడాతో మోకాళ్లూరింది. ఎక్స్ట్రా టైమ్‌లో, అది కూడా 106వ నిమిషంలో స్పెయిన్ స్ట్రైకర్ ఫెర్రాన్ టోర్రెస్ కొట్టిన ఆ ఒక్క గోల్.. మెస్సీ సామ్రాజ్యాన్ని కుప్పకూల్చింది. అసలు టోర్నమెంట్ అంతటా సింహంలా గర్జించిన అర్జెంటీనా, ఫైనల్ మ్యాచ్‌లో ఎందుకు చేతులెత్తేసింది? స్పెయిన్ చక్రవ్యూహంలో మెస్సీ సేన ఎలా చిక్కుకుపోయింది?
అర్జెంటీనా ఓటమికి మొదటి మరియు ముఖ్య కారణం.. కెప్టెన్ లియోనెల్ మెస్సీపై మితిమీరిన ఆధారపడటం. ఈ ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఏకంగా 8 గోల్స్ కొట్టి ఊపుమీదున్న మెస్సీని.. స్పెయిన్ డిఫెన్స్ విభాగానికి చెందిన రోడ్రి గ్యాంగ్ పూర్తిగా లాక్ చేసేసింది. మ్యాచ్ ప్రారంభమైన మొదటి 15 నిమిషాల పాటు మెస్సీకి కనీసం బంతిని తాకే అవకాశం కూడా రాలేదంటే స్పానిష్ వ్యూహం ఏ రేంజ్లో పనిచేసిందో అర్థం చేసుకోవచ్చు. మెస్సీని ఒంటరిని చేయడమే కాకుండా, జట్టులోని మిగతా ఫార్వర్డ్ ఆటగాళ్లు బాధ్యత తీసుకోకపోవడం అర్జెంటీనాకు శాపంగా మారింది.
రెండో కారణం.. మైదానం మధ్యలో అంటే మిడ్‌ఫీల్డ్‌లో స్పెయిన్ ప్రదర్శించిన అద్భుతమైన ఆధిపత్యం. టోర్నమెంట్ పొడవునా స్పెయిన్ జట్టు తమ పాసింగ్ గేమ్ ద్వారా ప్రత్యర్థులను ముప్పితిప్పలు పెట్టింది. ఈ ఫైనల్లో కూడా అర్జెంటీనా ఆటగాళ్లకు బంతి దక్కకుండా చేస్తూ, మ్యాచ్ టెంపోను తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. కేవలం బంతిని పాస్ చేయడమే కాదు, అర్జెంటీనా ప్లేయర్స్ దగ్గర నుండి బంతిని లాక్కోవడంలోనూ స్పెయిన్ మిడ్‌ఫీల్డ్ విభాగం వందకు వంద శాతం సక్సెస్ అయింది. దీనివల్ల అర్జెంటీనాకు అటాక్ చేసే అవకాశమే లేకుండా పోయింది.
ఇరు జట్లు గోల్స్ కోసం హోరాహోరీగా పోరాడుతున్న వేళ.. మ్యాచ్ సెకండ్ హాఫ్ ఇంజూరీ టైమ్‌లో అర్జెంటీనా కొంపముంచే ఘటన జరిగింది. స్పానిష్ ప్లేయర్ పావ్ కుబార్సీని దారుణంగా అడ్డుకున్నందుకు గాను అర్జెంటీనా స్టార్ ప్లేయర్ ఎంజో ఫెర్నాండెజ్ రెడ్ కార్డ్ తిని మైదానం వీడాడు. అంతటి బలమైన స్పెయిన్ జట్టుతో 11 మంది ఆడితేనే గెలవడం కష్టం. అలాంటిది కేవలం 10 మందితో మిగతా ఎక్స్ట్రా టైమ్ మ్యాచ్ ఆడటం అంటే అర్జెంటీనా చేజేతులా మ్యాచ్‌ను ప్రత్యర్థికి అప్పగించినట్లయింది. ఈ అదనపు ఆటగాడి అడ్వాంటేజ్తోనే 106వ నిమిషంలో స్పెయిన్ విన్నింగ్ గోల్ సాధించింది.
ఇక మ్యాచ్ సమతుల్యతను దెబ్బతీసిన మరో దురదృష్టకర సంఘటన.. డిఫెన్స్ పిల్లర్ లిసాండ్రో మార్టినెజ్ గాయపడటం. రొమేరోతో కలిసి టోర్నమెంట్లో అజేయమైన డిఫెన్స్ జోడీగా నిలిచిన మార్టినెజ్.. ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి ఇంజూరీ కారణంగా గ్రౌండ్ వదిలాడు. దాంతో కోచ్ స్కలోని తప్పనిసరి పరిస్థితుల్లో 38 ఏళ్ల వెటరన్ ఒటామెండును రంగంలోకి దించాల్సి వచ్చింది. ఒటామెండు టోర్నమెంట్లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడి ఉండటం వల్ల.. స్పానిష్ స్ట్రైకర్ల వేగాన్ని అందుకోవడంలో ఆయన విఫలమయ్యాడు. ఇది అర్జెంటీనా బ్యాక్ లైన్‌ను పూర్తిగా బలహీనపరిచింది.
ఐదో కారణం, బహుశా అత్యంత దారుణమైన విషయం ఏంటంటే.. ఈ ఫైనల్లో అర్జెంటీనా ఫార్వర్డ్ లైన్ పూర్తిగా చేతులెత్తేయడం. ఈ మ్యాచ్‌కు ముందు 19 గోల్స్‌తో టోర్నమెంట్లో మోస్ట్ అగ్రెసివ్ టీమ్‌గా ఉన్న అర్జెంటీనా.. నిర్ణీత 90 నిమిషాల సమయంలో కనీసం ఒక్కటంటే ఒక్క షాట్ కూడా గోల్ పోస్ట్‌పైకి కొట్టలేకపోయింది. మ్యాచ్ మొత్తం మీద వారు కొట్టింది కేవలం 2 షాట్లు మాత్రమే. దీనికి భిన్నంగా స్పెయిన్ ఏకంగా 20 షాట్లతో అర్జెంటీనా గోల్ పోస్ట్‌పై దండయాత్ర చేసింది. దాంతో స్పెయిన్ 2010 తర్వాత తమ రెండో వరల్డ్ కప్ టైటిల్‌ను గర్వంగా ముద్దాడింది.ఏది ఏమైనా, ప్రణాళికబద్ధమైన ఆటతీరుతో స్పెయిన్ విజేతగా నిలిస్తే, వ్యూహాత్మక లోపాలు, దురదృష్టం కలిసి వచ్చి అర్జెంటీనాను రన్నరప్‌గా మిగిల్చాయి. మెస్సీ కెరీర్లో బహుశా ఇదే చివరి వరల్డ్ కప్ మ్యాచ్ కావచ్చు.. అందుకే ఈ ఓటమి ఫ్యాన్స్‌ను మరింత వేధిస్తోంది.