ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన రెండు జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి... ఐదు టైటిల్స్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ సక్సెస్ మంత్ర మహేంద్రసింగ్ ధోనీనే.. కూల్ కెప్టెన్సీతో తీవ్ర ఒత్తిడిలో అద్భుతమైన వ్యూహాలతో జట్టును నడిపించే మహేంద్రుడి సారథ్యంలోనే చెన్నై సూపర్ కింగ్స్ ఛాంపియన్స్ గా నిలిచింది. అయితే రిటైర్మెంట్ కు చేరువలో ఉన్న ధోనీ స్థానంలో కెప్టెన్సీ మార్పు సీఎస్కేకు చేదు ఫలితాలను మిగిల్చింది. గత రెండు సీజన్లలోనూ పూర్తిగా నిరాశపరిచింది. 2023లో చివరిసారిగా టైటిల్ గెలుచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఆ తర్వాత వరుసగా రెండు సీజన్లలో అట్టర్ ఫ్లాప్ అయింది. 2024లో ఐదో స్థానంలో నిలిచిన చెన్నై గత ఏడాది చిట్టచివరి స్థానానికే పరిమితమైంది. ఈ నేపథ్యంలో మినీ వేలానికి ముందు పలువురు కీలక ఆటగాళ్ళకు గుడ్ బై చెప్పేసింది.
ముఖ్యంగా ట్రేడింగ్ విండోలో రవీంద్ర జడేజా, సామ్ కరన్ లను వదిలేసి సంజూ శాంసన్ ను తెచ్చుకుంది. భవిష్యత్తు కెప్టెన్ గా అతన్ని తయారు చేసే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే వేలంలో గతానికి భిన్నంగా అనామక ఆటగాళ్లపై కోట్లు కుమ్మరించింది. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ సమతూకంగా కనిపిస్తోంది. సీనియర్, జూనియర్ ఆటగాళ్లతో పవర్ఫుల్గా ఉంది.గత సీజన్ దాకా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సారథ్యం వహించిన సంజూ శాంసన్... చెన్నై జట్టులో ఎలాంటి పాత్ర పోషించబోతున్నారనే చూడాలి. ధోనీ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడతాడా లేక వికెట్ల వెనుక పూర్తి బాధ్యతలు తీసుకుంటాడా అనేది ఆసక్తికరంగా మారింది. సీజన్ మొత్తం ధోనీ ఆడతాడని చెన్నై క్లారిటీ ఇచ్చినా ఏ రోల్ తీసుకుంటాడనేది వేచిచూడాలి. బ్యాటింగ్ లో రుతురాజ్ కు తోడు సంజూ శాంసన్ ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశముంది.
అలాగే ఇండియా అండర్ 19లో అదరగొట్టి కెప్టన్ ఆయుష్ మాత్రే కూడా టాపార్డర్ లో కీలకం కాబోతున్నాడు. వీరితో పాటు డెవాల్డ్ బ్రేవిస్, సర్ఫరాజ్ ఖాన్ కూడా హిట్టర్లే. సర్ఫరాజ్ ఖాన్ దేశవాళీ క్రికెట్ లో ఫార్మాత్ తో సంబంధం లేకుండా సూపర్ ఫామ్ లో ఉండడం కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. అటు మిడిల్ ఆర్డర్ లో ఆల్ రౌండర్లు అన్షుల్ కంబోజ్, శివం దూబే, ఓవర్టన్ వంటి వాళ్లు బలంగా చెప్పొచ్చు. ముఖ్యంగా దూబే ఇటీవల టీ20 ప్రపంచకప్ లో ఎలాంటి మెరుపులు మెరిపించాడో అందరికీ తెలుసు. దీంతో సీఎస్కే ఫినిషర్ రోల్ అతనికే అప్పగించే అవకాశముంది. మరోవైపు బౌలింగ్ లో నాథన్ ఎల్లిస్ దూరమవడం ఇబ్బందే. అతని ప్లేస్ ను మ్యాట్ హెన్రీతో భర్తీ చేయనుంది. అలాగే రాహుల్ ఛాహర్, ఖలీల్ అహ్మద్, గుర్జాప్ నీత్ సింగ్, శ్రేయస్ గోపాల్ పైనే ఆశలు పెట్టుకుంది. ఓవరాల్ గా ధోనీ పర్యవేక్షణలో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్, సంజూ శాంసన్ ఫామ్ చెన్నై సూపర్ కింగ్స్ విజయాలను డిసైడ్ చేయబోతున్నాయి.