ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2027కు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ మెగా టోర్నీకి సంబంధించి ఆతిథ్యమిచ్చే నగరాల జాబితాను ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలోని 12 వేదికల్లో వన్డే వరల్డ్ కప్ జరుగుతుంది. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్ బర్గ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో త్రీ నేషన్స్, వన్ హార్ట్ బీట్ పేరిట ఆతిథ్య నగరాలను ప్రకటించారు. ఇది 3 అతిథ్య దేశాల మధ్య ఆశావాదం, వైవిధ్యం, ఐక్యతకు సూచిక అని పేర్కొంది.ప్రపంచ కప్ 14వ ఎడిషన్‌లో మొత్తం 57 మ్యాచ్‌లు జరుగుతాయి.దీనిలో 14 జట్లు పాల్గొంటాయి. మొత్తంగా 12 నగరాల్లో ఈ మ్యాచులు జరుగుతాయి. వీటిలో దక్షిణాఫ్రికాలోని ఎనిమిది నగరాలు, జింబాబ్వేలో మూడు నగరాలు, నమీబియా రాజధాని విండ్ హోక్ ఆతిథ్య వేదికలుగా ఎంపికయ్యాయి.
దక్షిణాఫ్రికా, జింబాబ్వే, కెన్యా సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన 2003 ఎడిషన్ తర్వాత ఆఫ్రికాలో జరుగుతున్న తొలి పురుషుల వన్డే ప్రపంచకప్ ఇదే.దాదాపు 24 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత పురుషుల వన్డే ప్రపంచకప్ మళ్లీ ఆఫ్రికా ఖండానికి తిరిగి రాబోతోంది. 24 ఏళ్ల తర్వాత మెగా ఈవెంట్ ఆఫ్రికాకు తిరిగి రావడం పట్ల ఐసీసీ ఛైర్మన్ జై షా స్పందించారు. ఇది క్రికెట్ చరిత్రలో కీలక మైలురాయిగా అభివర్ణించారు. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలు మర్చిపోలేని విధంగా క్రికెట్ టోర్నీని నిర్వహిస్తాయని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ టోర్నీ క్రికెట్‌కు ఉన్న ఆదరణను మరింత విస్తరించేలా చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త బ్రాండ్ థీమ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను ఏకం చేసే ఒక అద్భుతమైన ప్రయాణానికి పునాది వేసిందన్నారు. కాగా ఈ టోర్నీలో మెజారిటీ భాగం మ్యాచ్ లు సౌతాఫ్రికాలోనే జరగనున్నాయి.
ఆధునిక స్టేడియాల, మౌలిక వసతులు, ప్రేక్షకుల ఆదరణ దృష్ట్యా అక్కడే 8 నగరాలను ఐసీసీ ఎంపిక చేసింది. జింబాబ్వేలో 3 వేదికలు, నమీబియా రాజధాని విండ్కోలో ఒక వేదికలో మ్యాచ్ లు నిర్వహించనున్నారు. జోహన్నెస్‌బర్గ్‌లోని చారిత్రాత్మక వాండరర్స్ స్టేడియంలో ఈ టోర్నీ ప్రారంభవేడుకలతో పాటు ఫైనల్ జరగనుంది. ఈసారి 50 ఓవర్ల వరల్డ్ కప్ కొత్త ఫార్మాట్లో నిర్వహించనున్నారు. పోటీతత్వాన్ని పెంచేందుకు మూడు దశల విధానాన్ని ఐసీసీ ప్రవేశపెట్టనుంది. 12 నుంచి 14వ ర్యాంకులో ఉన్న జట్ల మధ్య జరిగే 'సూపర్ సిరీస్'తో టోర్నీ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 12 జట్లను రెండు గ్రూపులుగా విభజించి గ్రూప్ స్టేజ్ నిర్వహిస్తారు. అనంతరం 'సూపర్ 7' రౌండ్, సెమీ ఫైనల్స్, ఫైనల్ ఉంటాయి. ఈ వన్డే ప్రపంచకప్ అక్టోబర్ 4న ప్రారంభం కానుంది.