ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్స్ ఈ సీజన్‌లో ఒక్క విజయం కోసం వెంపర్లాడుతున్నారు. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వరుసగా మూడు మ్యాచ్‌లలో ఓటమిపాలయింది. ఐపీఎల్ 2008 నుంచి 2023 వరకు ధోనీ కెప్టెన్సీలో తిరగులేని జట్టుగా ఉన్న సీఎస్కే.. ధోనీ కెప్టెన్‌కి గుడ్ బై చెప్పిన తర్వాత నుంచి దారుణంగా విఫలమైంది. మ్యాచ్‌లు ఓడినా కనీసం ధోనీని అయినా చూద్దామనుకున్న సీఎస్కే ఫ్యాన్స్‌కి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. కాలి కండరాల సమస్యతో ఐపీఎల్ 2026కి రెండు వారాల పాటు దూరమైన ధోనీ, చెపాక్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌తో ఎంట్రీ ఇస్తాడని అందరూ అనుకున్నారు.
ఆ మేరకే ధోనీ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలు.. భారీ షాట్లతో సిక్సర్లు కొట్టే వీడియోలు నెట్టింట హల్‌చల్ కూడా చేశాయి. దాంతో ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌తో ఎంట్రీ గ్యారెంటీ అని అందరూ అనుకున్నారు.44 సంవత్సరాల ధోనీ కండరాల సమస్య నుంచి పూర్తి స్థాయిలో కోలుకోలేదని, ఫిట్‌నెస్ సాధించలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం ధోనీ పూర్తిగా కోలుకోవడానికి కనీసం ఇంకొక వారం సమయం పట్టే అవకాశం ఉంది. దాంతో ఏప్రిల్ 11న చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌కి కూడా ధోనీ అందుబాటులో ఉండే అవకాశం లేదని చెబుతున్నారు.దీంతో ధోనీ మళ్లీ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగే మ్యాచ్‌కే అందుబాటులోకి రానున్నాడు.
ఏప్రిల్ 18న కేకేఆర్‌తో జరిగే మ్యాచ్‌కి ధోనీ స్క్వాడ్‌లో చేరే అవకాశం ఉంది. ఈ వార్త ధోనీ ఫ్యాన్స్‌తో పాటు సీఎస్కే అభిమానులకు కూడా నిరాశను కలిగిస్తోంది. యువ సంచలనం డివాల్డ్ బ్రెవిస్ మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌కి అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథ్ కూడా చెప్పారు. సీఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా డివాల్డ్ బ్రెవిస్ దాదాపు గాయం నుంచి కోలుకుని, పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించాడనే చెబుతున్నాడు. మొత్తానికి ధోనీ దూరమవుతున్నాడని బాధపడుతూనే.. డివాల్డ్ బ్రెవిస్ అయినా జట్టులోకి వస్తున్నాడని ఫ్యాన్స్ కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.