టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. వరుసగా తన మూడో మ్యాచ్‌లోనూ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నెదర్లాండ్స్‌తో అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో టీ20 ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ డకౌట్స్ అయిన బ్యాటర్‌గా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు.అమెరికాతో మ్యాచ్‌లో గోల్డెన్ డక్ ఔట్ అయిన అభిషేక్ శర్మ.. అనారోగ్యంతో నమీబియాతో మ్యాచ్‌కు దూరమయ్యాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు రీఎంట్రీ ఇచ్చిన 4 బాల్ డక్‌గా వెనుదిరిగాడు. సూపర్-8 దశకు ముందు నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో ఫామ్ అందుకుంటాడని భావించిన అభిమానులను తీవ్రంగా నిరాశపర్చాడు. భారత సంతతి బౌలర్, స్పిన్నర్ ఆర్యన్ దత్ వేసిన బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
అభిషేక్ శర్మ ఆడిన గత 7 ఇన్నింగ్స్‌ల్లో ఐదు సార్లు డకౌటవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. గత 7 ఇన్నింగ్స్‌ల్లో అభిషేక్ శర్మ..ఒకే ఒక్క హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇందులో వరుసగా మూడు డకౌట్స్ ఉండటం, కీలక సూపర్-8 దశ ముందు అతను ఫామ్ కోల్పోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ పేలవ ప్రదర్శనతో అభిషేక్ శర్మ తన పేరిట పలు చెత్త రికార్డ్లను లిఖించుకున్నాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ చరిత్రలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన నాలుగో బ్యాటర్, రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో భారత దిగ్గజ పేసర్ ఆశిష్ నెహ్రా, వెస్టిండీస్ ప్లేయర్ ఆండ్రీ ఫ్లెచర్, ఉగాండ ఆటగాడు రోజర్ ముకాస, అభిషేక్ శర్మ కంటే ముందున్నారు.
అంతర్జాతీయ టీ20ల్లో ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సార్లు డకౌట్ అయిన తొలి భారత ఓపెనర్‌గా కూడా అభిషేక్ శర్మ అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. ఓవరాల్‌గా ఆరో బ్యాటర్‌గా ఈ చెత్త ఫీట్ తన పేరిట లిఖించుకున్నాడు. ఈ జాబితాలో పాకిస్థాన్ ఓపెనర్ సైమ్ అయుబ్ అగ్రస్థానంలో ఉన్నాడు. గతేడాది అతను 6 సార్లు డకౌటయ్యాడు.వరుసగా మూడు మ్యాచ్‌ల్లో అభిషేక్ శర్మ డకౌట్ అవ్వడంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతన్ని జట్టు నుంచి తప్పించి సంజూ శాంసన్‌ను ఆడించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతీ బంతినీ గుడ్డిగా ఆడడం జట్టుకు ప్రమాదకరమని అభిప్రాయపడుతున్నారు. ఫియర్లెస్ గేమ్ ముఖ్యమేనని, కానీ డకౌట్లు వద్దని అసహనం వ్యక్తం చేస్తున్నారు.