ఆర్సీబీ కోసం భారీ బిడ్ వేస్తున్నా… అదార్ పూనావాలా ట్వీట్
ఐపీఎల్ చరిత్రలో అత్యంత బ్రాడింగ్ కలిగిన జట్లలో ఒకటిగా ఉన్న రాయల్ ఛాలెంజర్స్ జట్టు గత ఏడాది ఎన్నాళ్లుగానో తమను ఊరిస్తున్న తొలి టైటిల్ ను కూడా కైవసం చేసుకుంది.
ఐపీఎల్ చరిత్రలో అత్యంత బ్రాడింగ్ కలిగిన జట్లలో ఒకటిగా ఉన్న రాయల్ ఛాలెంజర్స్ జట్టు గత ఏడాది ఎన్నాళ్లుగానో తమను ఊరిస్తున్న తొలి టైటిల్ ను కూడా కైవసం చేసుకుంది. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆర్సీబీ జట్టు యజమానిగా ఉన్న యునైటెడ్ స్పిరిట్స్ దీన్ని అమ్మేయాలని నిర్ణయించింది. దీంతో ఈ క్రేజీ ఫ్రాంచైజీ కోసం పోటీ మొదలైంది. ఇప్పుడు ఈ జట్టును కైవసం చేసుకునేందుకు కరోనా వ్యాక్సిన్ తయారు చేసిన సంస్థ సీఈవో ముందువరుసలో ఉన్నారు.
కరోనా వ్యాక్సిన్ తయారు చేసిన సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ సీఈవో అదార్ పూనావాలా ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ను కొనుగోలు చేయడానికి రాబోయే కొన్ని నెలల్లో బలమైన బిడ్ వేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఆర్సీబీ యజమాని అయిన డయాజియో నియంత్రణలో ఉన్న యునైటెడ్ స్పిరిట్స్ సంస్థ .. ఈ ఫ్రాంచైజీని విక్రయించడానికి సుమారు 17 వేల కోట్ల డిమాండ్ చేసినట్లు తెలిసింది.ప్రస్తుతం ఆర్సీబీ జట్టును కొనుగోలు చేయడానికి భారీగానే పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో యునైటెడ్ స్పిరిట్స్ సంస్థ దీని రేటును భారీగా పెంచేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ ఐపీఎల్ ఫ్రాంచైజీ కోసం పెట్టిన అతిపెద్ద పెట్టుబడి 7090 కోట్లు. దీన్ని లక్నో సూపర్ జెయింట్స్ కోసం గోయెంకా గ్రూప్ పెట్టింది.
ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ కొనుగోలుకు 18 వేలకోట్లు పెడితే మాత్రం ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద బేరం ఇదే అవుతుంది. ఇది ఫ్రాంచైజీ క్రికెట్ చరిత్రలో అత్యంత విలువైన సింగిల్-టీమ్ ఆస్తులలో ఒకటిగా మారుతుంది. ఈ అమ్మకాన్ని పర్యవేక్షించడానికి గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ సిటీని లావాదేవీ సలహాదారుగా నియమించినట్లు నివేదికలు చెప్తున్నాయి. ఐపీఎల్ ఆరంభం నుంచీ టైటిల్ గెలవకున్నా ఆర్సీబీ వాల్యూ మాత్రం పెరుగుతూనే ఉంది. దీనికి ప్రధాన కారణం విరాట్ కోహ్లీనే. చాలా మంది ప్లేయర్స్ ఆ ఫ్రాంచైజీని వీడినా కోహ్లీ మాత్రం ఆర్సీబీతోనే కొనసాగుతున్నాడు. చివరికి 2025 సీజన్ లో టైటిల్ అందించి తన ట్రోఫీ కలను కూడా నెరవేర్చుకున్నాడు.











