మీరు తప్పుకుంటే మేము ఆడతాం… పాకిస్థాన్ కు ఐస్ లాండ్ క్రికెట్ సెటైర్లు…!
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, ఐసీసీ మధ్య జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2026 వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో హాస్యాస్పదంగా మారింది.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, ఐసీసీ మధ్య జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2026 వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో హాస్యాస్పదంగా మారింది. భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్‌పై ఐసీసీ వేటు వేయడాన్ని తప్పుబడుతూ.. పాక్ కూడా టోర్నీని బహిష్కరిస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఐస్‌లాండ్ క్రికెట్ పాకిస్థాన్‌ను ట్రోల్ చేస్తూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. టీ20 వరల్డ్ కప్ వివాదం ముదురుతుండగా.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చేస్తోన్న బహిష్కరణ వ్యాఖ్యలపై ఐస్‌లాండ్ క్రికెట్ తనదైన శైలిలో సెటైర్లు వేసింది.ఐస్‌లాండ్ క్రికెట్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పాకిస్థాన్ ద్వంద్వ వైఖరిని ఎద్దేవా చేస్తూ సెటైరికల్ గా రాసుకొచ్చింది.
పాకిస్థాన్ త్వరగా తన నిర్ణయాన్ని చెప్పాలనీ, టోర్నీ నుంచి తప్పుకుంటే.. వారి స్థానంలో ఆడేందుకు తాము ఫ్లైట్ ఎక్కడానికి సిద్ధంగా ఉన్నామంటూ రాసింది. కాకపోతే కొలంబో చేరుకోవడానికి ఫ్లైట్ షెడ్యూల్స్ దొరకడమే పెద్ద తలనొప్పిగా మారిందంటూ ట్వీట్ చేసింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఐస్‌లాండ్ క్రికెట్ అడ్మిన్‌కు సాటి ఎవరూ లేరంటూ నవ్వుకుంటున్నారు.బంగ్లాదేశ్ జట్టు భద్రతా కారణాల దృష్ట్యా భారత్‌లో ఆడేందుకు నిరాకరించడంతో ఐసీసీ వారిని టోర్నీ నుండి తప్పించి.. వారి స్థానంలో స్కాట్లాండ్‌కు అవకాశం ఇచ్చింది. దీనిపై పీసీబీ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బంగ్లాదేశ్ కూడా ఐసీసీలో పూర్తిస్థాయి సభ్యత్వ దేశమేనని, వారికి ఎందుకు మినహాయింపు ఇవ్వలేదని ప్రశ్నించారు. పాకిస్థాన్‌కు ‘హైబ్రిడ్ మోడల్’ కింద శ్రీలంకలో మ్యాచ్‌లు ఆడే అవకాశం ఇచ్చినట్లే, బంగ్లాదేశ్‌కు కూడా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ కామెంట్స్‌తో పాక్ కూడా టోర్నీని బహిష్కరిస్తుందనే ప్రచారం జరిగింది. అయితే ఐసీసీ వెంటనే స్పందిస్తూ.. ఒకవేళ పాకిస్థాన్ కనుక టోర్నీ నుంచి తప్పుకుంటే తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు, నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. దీంతో వెనక్కి తగ్గిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. మరుసటి రోజే 15 మందితో కూడిన పాక్ జట్టును ప్రకటించింది. ప్రస్తుతానికి పాకిస్థాన్ జట్టు శ్రీలంకలో తన మ్యాచ్‌లను ఆడేందుకు సిద్ధంగా ఉంది. ఫిబ్రవరి 15న కొలంబోలో జరగబోయే భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. ఒకవేళ పాక్ చివరి నిమిషంలో మనసు మార్చుకుంటే, ఐసీసీ నిబంధనల ప్రకారం వారి స్థానంలో ఉగాండా జట్టు ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.










