మెగాటోర్నీకి ముందు అవసరమా ? బెడిసికొట్టిన గంభీర్ ప్రయోగాలు

న్యూజిలాండ్ పై హ్యాట్రిక్ విజయాలతో దుమ్మురేపి టీ20 సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా జోరుకు బ్రేక్ పడింది. విశాఖ వేదికగా భారీస్కోరును ఛేదించలేక చతికిలపడింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 29, 2026 | 05:01 PMLast Updated on: Jan 29, 2026 | 5:01 PM

Was It Necessary Before The Mega Tournament Gambhirs Experiments Backfired

న్యూజిలాండ్ పై హ్యాట్రిక్ విజయాలతో దుమ్మురేపి టీ20 సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా జోరుకు బ్రేక్ పడింది. విశాఖ వేదికగా భారీస్కోరును ఛేదించలేక చతికిలపడింది. అయితే గంభీర్ చేసిన ప్రయోగాలే ఓటమికి కారణమని చెప్పొచ్చు. అది కూడా మెగాటోర్నీకి 2 మ్యాచ్ ల ముందు ఇలాంటి ప్రయోగాలు అవసరమా అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ మ్యాచ్ కు సంబంధించి తుది జట్టు ఎంపికలో చేసిన తప్పిదం బ్యాటర్ గాయపడితే బౌలర్ ను తీసుకోవడం.. సూపర్ ఫామ్ లో ఉన్న ఇషాన్ కిషన్ గాయంతో తప్పుకున్నాడు. అతని స్థానంలో శ్రేయాస్ అయ్యర్ ను తీసుకోకుండా అర్షదీప్ సింగ్ ను తుది జట్టులోకి తీసుకోవడం ఓటమికి ఒక కారణంగా చెప్పొచ్చు. ఎందుకంటే బౌలింగ్ లో అంతా బాలెన్సింగ్ గా ఉన్నప్పుడు బ్యాటర్ ప్లేస్ లో బౌలర్ ను తీసుకుని గంభీర్ తప్పు చేశాడు. తప్పు అనడం కంటే పనికిమాలిన ప్రయోగంగా చెప్పొచ్చని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు.

ఎందుకంటే టీ20ల్లో ఎప్పుడూ పిచ్ పరిస్థితిని బట్టి బ్యాటింగ్ డెప్త్ లోతుగా ఉండేలా చూసుకోవాలి. కానీ గంభీర్ మాత్రం జట్టులో బుమ్రా, హర్షిత్ రాణాతో పాటు మూడో పేసర్ ను ఎంచుకోవడం కొంపముంచింది. పైగా జట్టులో అప్పటికే హార్థిక్ పాండ్యా, శివమ్ దూబేల రూపంలో బౌలింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అటు ఇద్దరు స్పిన్నర్లు కుల్దీప్, రవి బిష్ణోయ్ కూడా ఉండడంతో బౌిలింగ్ పరంగా ఎటువంటి ఇబ్బందీ లేదు. అయినా కూడా ఇషాన్ కిషన్ లాంటి బ్యాటర్ ప్లేస్ లో మళ్లీ అర్షదీప్ ను ఆడించడం వెనుక గంభీర్ వ్యూహం ఏంటనేది అర్థం కాలేదు. ఇదే విషయంపై పలువురు మాజీలు విమర్శలు గుప్పించారు.

అలాగే బ్యాటింగ్ ఆర్డర్ లో రింకూ సింగ్ ను ప్రమోట్ చేయడం మరో తప్పిదం. సహజంగా రింకూ సింగ్ ను ఫినిషర్ గా దింపుతారు. ఒత్తిడిలో అది కూడా మ్యాచ్ ముగింపు దశలో అతను బాగా ఆడిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటకీ రింకూను నాలుగో స్థానంలో ఎందుకు ఆడించారనేది గంభీర్ కే తెలియాలి. జట్టులో అప్పటికే ఇంకా హార్థిక్ కూడా ఆప్షనల్ గా ఉన్నా రింకూను కీలకమైన స్థానంలో దింపడం ఆశ్చర్యపరిచింది. దీంతో చివర్లో శివమ్ దూబేకు సరైన సపోర్ట్ ఇచ్చేవాడు కరువయ్యారు. ఒకవేళ రింకూ, దూబే జోడీ చివర్లో క్రీజులో ఉండి ఉంటే భారత్ ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలిచేదని పలువురు మాజీలు అభిప్రాయపడ్డారు. మొత్తం మీద ప్రపంచకప్ కు ఇంకా 9 రోజులే సమయం మిగిలున్న దశలో ఇలాంటి ప్రయోగాలు జట్టు రిథమ్ ను దెబ్బతీస్తాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.