వరల్డ్ కప్ బాయ్ కాట్ వివాదం, బంగ్లాదేశ్ బోర్డుపై ఐసీసీ చర్యలు ?

భారత్ వేదికగా జరిగే ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని బీసీబీ చేసిన విజ్ఞప్తిని ఐసీసీ తోసిపుచ్చినా వెనకడుగు వేయడం లేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 23, 2026 | 04:00 PMLast Updated on: Jan 23, 2026 | 5:08 PM

World Cup Boycott Controversy Will The Icc Take Action Against The Bangladesh Board

భారత్ వేదికగా జరిగే ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని బీసీబీ చేసిన విజ్ఞప్తిని ఐసీసీ తోసిపుచ్చినా వెనకడుగు వేయడం లేదు. తమ నిర్ణయాన్ని మార్చుకోకుంటే టీ20 ప్రపంచకప్‌లో మరో జట్టుకు అవకాశం ఇస్తామని ఐసీసీ స్పష్టం చేసినా పట్టువీడలేదు. భద్రత కారణాల దృష్ట్యా తమ జట్టును భారత్‌కు పంపే ప్రసక్తే లేదని బీసీబీ తేల్చి చెప్పింది.బంగ్లాదేశ్ ప్రభుత్వం, క్రికెటర్లతో చర్చించిన అనంతరం ఐసీసీకి గురువారం తమ నిర్ణయాన్ని తెలియజేసింది. ప్రపంచకప్‌కు బంగ్లాదేశ్ దాదాపుగా దూరమవడంతో.. ర్యాంకింగ్స్ ఆధారంగా ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్‌కు అవకాశం లభించనుంది. అయితే ఈ వ్యవహారంపై ఐసీసీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీకి బంగ్లాదేశ్‌ దూరమైతే ఐసీసీ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. భారీ జరిమానాలతో పాటు ఆర్థిక ఆంక్షలు విధించే ఛాన్స్ ఉంది. మెగా టోర్నీ నుంచి చివరి నిమిషంలో తప్పుకోవడం వల్ల ఐసీసీ నుంచి రావాల్సిన ఆదాయంలో భారీ కోత పడనుంది.టోర్నీలో పాల్గొనే ఫీజు సుమారు రూ.4 కోట్లు బంగ్లాదేశ్ కోల్పోనుంది. ఐసీసీ నుంచి ప్రతి ఏటా అందే రెవెన్యూ షేర్‌లో సుమారు 20 మిలియన్ల అమెరికా డాలర్లలో భారీగా కోత పడే ఛాన్స్ ఉంది. ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించినందుకు అదనపు జరిమానాలు కూడా విధించనున్నారు.టీ20 ప్రపంచకప్ దూరంగా ఉంటే బంగ్లాదేశ్ ర్యాంకింగ్స్ కూడా కోల్పోనుంది. భవిష్యత్తులో ఇతర టోర్నీలకు నేరుగా అర్హత సాధించే అవకాశాలను దెబ్బతీస్తుంది. భవిష్యత్తులో ఐసీసీ టోర్నీలకు ఆతిథ్యం ఇచ్చే అవకాశాలను కూడా బంగ్లాదేశ్ కోల్పోయే ప్రమాదం ఉంది. భద్రతా కారణాలు కాకుండా రాజకీయ కారణాలతో టోర్నీకి దూరమైందని ఐసీసీ భావిస్తే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుపై తాత్కలికంగా నిషేధం కూడా విధించే అధికారం కూడా ఉంది.

బోర్డు నిర్ణయాల్లో ప్రభుత్వం జోక్యం ఉందని భావిస్తే ఐసీసీ నిషేధం విధిస్తుంది. గతంలో శ్రీలంక క్రికెట్ బోర్డు, జింబాంబ్వే క్రికెట్ బోర్డులపై ఇదే కారణాలతో నిషేధం విధించింది.గతంలో ఐసీసీ టోర్నీలను ఏ జట్లు ఇలా బహిష్కరించలేదు. కాకపోతే టోర్నీల్లో కొన్ని మ్యాచ్‌లను బహిష్కరించాయి. దాంతో ఈ మ్యాచ్ పాయింట్స్ కోల్పోయాయి. 2009 టీ20 ప్రపంచకప్ నుంచి ఐసీసీ సూచనలతో జింబాబ్వే తప్పుకుంది. ఆ జట్టుకు బ్రిటన్ ప్రభుత్వం వీసాలు ఇచ్చేందుకు నిరాకరించింది. ఐసీసీ సూచనలతోనే తప్పుకోవడం ఆ జట్టుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఐసీసీ సూచనలను బేఖతరు చేస్తున్న బంగ్లాపై కఠిన చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది.