ఐపీఎల్ 2026లో ఇప్పటి వరకు ఒక్క విజయం కూడా సాధించని కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు గుజరాత్‌పై గోల్డెన్ ఛాన్స్ దొరికింది. కానీ, అది సద్వినియోగం చేసుకోవడంలో కేకేఆర్ విఫలమైంది. ఆరంభంలో వికెట్లు పడినా పది ఓవర్ల తర్వాత నుంచి మ్యాచ్ కేకేఆర్ చేతిలోకి వెళ్లింది. క్రీజులో ఫామ్‌లో ఉన్న గ్రీన్ ఉన్నాడు. కానీ, మిగతా ఏ ప్లేయరూ కూడా సపోర్ట్ చేయకపోవడంతో భారీ స్కోర్ సాధించలేక నామమాత్రపు పరుగులకే పరిమితమైంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. పవర్ ప్లేలో 37 పరుగులు మాత్రమే చేయగలిగింది. గ్రీన్, పావెల్ పవర్ షోతో 11 ఓవర్లలో 87 పరుగులు చేసింది.
పావెల్ అవుటైన తర్వాత గ్రీన్ హిట్టింగ్ చేయడంతో 14 ఓవర్లలోనే 139 పరుగులు బాదేసింది. అంటే నాలుగు ఓవర్లలో 52 పరుగులు చేసింది.ఇక ఆఖరి ఐదు ఓవర్లలో కేకేఆర్ విధ్వంసం సృష్టిస్తుంది అనుకుంటే వరుసగా వికెట్లు కోల్పోయి నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. 15 ఓవర్లకు 148 పరుగులు చేసిన కేకేఆర్ 20 ఓవర్లు ముగిసే సమయానికి 180 పరుగులకు ఆలౌట్ అయింది. అంటే కేవలం 32 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆఖరి రెండు ఓవర్లలో దారుణంగా ఎనిమిది పరుగులు మాత్రమే వచ్చాయి.
ఇదే కేకేఆర్ ఓటమికి ప్రధానంగా కారణంగా చెప్పొచ్చు.చివరి ఓవర్ వరకూ జరిగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్ 200కు పైగా స్కోర్ బాదుంటే, పరిస్థితి వేరేలా ఉండేదేమో. ఛేజింగ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్ ఒంటిచేత్తో మ్యాచ్‌ని గెలిపించాడు. గిల్ క్రీజులో ఉన్నంత సేపూ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. 50 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 86 పరుగులు చేసి అవుటయ్యాడు. ఒకానొక సమయంలో సెంచరీ చేస్తాడు అనుకున్నప్పటికీ అద్భుతమైన క్యాచ్ పట్టి గిల్‌ను గ్రీన్ అవుట్ చేశాడు. ఆఖర్లో ఫిలిప్స్, తెవాటియా, షారూఖ్ కలిసి 19.4 ఓవర్లలో విజయం సాధించారు. ఈ విజయంతో గుజరాత్ నాలుగో స్థానానికి ఎగబాకితే... కేకేఆర్ అట్టడుగు స్థానంలో ఉండిపోయింది.