ఆఫ్ఘనిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ సంచలన విషయాలను వెల్లడించాడు. భారత్, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన పౌరసత్వ ఆఫర్లను తిరస్కరించినట్లు తెలిపాడు. ఈ విషయాలను తన రాబోయే పుస్తకంలో ప్రస్తావించాడు. 2023 ఐపీఎల్ సీజన్ సందర్భంగా ఈ ఆఫర్లు వచ్చినట్లు పేర్కొన్నాడు. భారత్, ఆస్ట్రేలియా నుండి పౌరసత్వంతో పాటు వారి జట్లకు ఆడే అవకాశం ఇచ్చినా, తాను వాటిని సున్నితంగా తిరస్కరించానని తెలిపాడు. నేను నా దేశానికి ఆడకపోతే, మరే దేశానికి ఆడనని స్పష్టం చేసినట్లు పుస్తకంలో చెప్పాడు. భారత్ నుంచి వచ్చిన ఆఫర్ గురించి రషీద్ విపులంగా వివరించాడు. ఐపీఎల్ 2023 సమయంలో భారత క్రికెట్ బోర్డు ఉన్నతాధికారి ఒకరు తనను కలిశారని తెలిపాడు.
ఆ సమావేశంలో ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితులు క్లిష్టంగా ఉన్నాయని, భారత్‌లోనే స్థిరపడాలని, పౌరసత్వం ఇవ్వడంతో పాటు క్రికెట్ అవకాశాలు కూడా కల్పిస్తామని సూచించారని పేర్కొన్నాడు. అయితే ఆ ఆఫర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ, తాను ఆఫ్ఘనిస్తాన్‌కే ప్రాతినిధ్యం వహిస్తానని చెప్పినట్లు వివరించాడు. కాగా, రషీద్ ఖాన్ దేశభక్తి గతంలో కూడా వార్తల్లో నిలిచింది.2018 ఐపీఎల్ సమయంలో భారత అభిమానులు ఆయనకు పౌరసత్వం ఇవ్వాలని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఈ అంశంపై అప్పటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందిస్తూ, పౌరసత్వ నిర్ణయాలు హోం మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటాయని తెలిపారు.
అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్,... రషీద్‌ను దేశ గర్వంగా అభివర్ణిస్తూ, అతన్ని కోల్పోమని స్పష్టం చేశారు. ఆఫ్ఘనిస్తాన్లోని నంగర్హార్ వీధుల నుంచి అంతర్జాతీయ క్రికెట్లో అగ్రస్థానానికి ఎదిగిన రషీద్ ఖాన్ ప్రయాణం ఎంతో స్ఫూర్తిగాగా ఉంటుంది. తన ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ స్టార్ స్పిన్నర్ 2020లో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది డికేడ్‌గా కూడా నిలిచాడు. అయినప్పటికీ, ఎన్ని అవకాశాలు వచ్చినా తన దేశం పట్ల ఉన్న నిబద్ధతను విడవకపోవడం ఆయన వ్యక్తిత్వాన్ని మరింత గొప్పగా నిలబెడుతోంది. మొత్తంగా రషీద్ ఖాన్ తీసుకున్న ఈ నిర్ణయం దేశభక్తి, విలువలపై నిలబడే ధైర్యానికి ప్రతీకగా నిలుస్తోంది.