ఐపీఎల్ 2026లో చాలా విషయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఆటగాళ్ల వ్యవహారతీరు విమర్శలకు తావిస్తోంది. హోటల్ పరిసరాల్లో సిగరెట్ తాగుతూ గుజరాత్ టైటాన్స్ పేసర్ కగిసో రబాడా కనిపించగా.. డ్రెస్సింగ్‌రూమ్‌లో వేపింగ్ చేస్తూ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ కెమెరా కంట పడ్డాడు. అంతేకాకుండా ఇటీవల అర్షదీప్ సింగ్ చేసిన ఓ వ్లాగ్‌లో యుజ్వేంద్ర చాహల్.. విమానంలో వేపింగ్ చేసినట్లు కనిపించాడు. అయితే అది సరదాకు చేసిందని.. అతడు వేపింగ్ చేయలేదని తర్వాత తెలిసింది.దీంతో బీసీసీఐ ఈ విషయంపై ఫోకస్ చేసింది. దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఐపీఎల్ 2026 టోర్నీ మొత్తం ముగిసే వరకూ వ్లాగింగ్‌కు దూరంగా ఉండాలని పంజాబ్ కింగ్స్ పేసర్ అర్షదీప్‌ను బీసీసీఐ ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఢిల్లీ క్యాపిటల్స్ కూడా తమ ఆటగాళ్లు, సిబ్బంది సోషల్ మీడియా వాడకం విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. సామాజిక మాధ్యమాల్లో ఏం పోస్ట్ చేయాలి, వేటిని షేర్ చేయాలనే దానిపై సదరు ఫ్రాంచైజీ తమ ప్లేయర్లు, సహాయక సిబ్బందితోపాటు వారి కుటుంబ సభ్యులకు కూడా ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. జట్టు గోప్యతను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.మరోవైపు ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్‌లో తీవ్రస్థాయిలో ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతుండటంపై బీసీసీఐ సీరియస్ అయింది. ఆటగాళ్లు, జట్లు భవిష్యత్తులోనూ, అలాగే తక్షణమే పాటించాల్సిన కఠిన నిబంధనలను బీసీసీఐ రూపొందించింది. వాటిని తక్షణమే అమలులోకి తెచ్చింది. ఈ మేరకు అన్ని ఫ్రాంచైజీలకు అధికారికంగా సమాచారం అందించింది.
ఆటగాళ్ల భద్రత, ప్రస్తుతం జారీ చేసిన నిబంధనలు అమలు చేసే విషయం లో ఫ్రాంచైజీలదే బాధ్యతగా పేర్కొంది. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు తమ దృష్టి కి వచ్చాయనీ, ఇలాంటివి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదనీ ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ చెప్పారు. ఫ్రాంచైజీ యాజమాన్యం, అధికారులు డగౌట్‌లో ఆటగాళ్లతో మాట్లాడకూడదని మరోసారి స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఫ్రాంచైజీలు తమ ప్లేయర్ల సోషల్ మీడియా వాడకంపై ఆంక్షలు విధిస్తున్నాయి.దీంతో కేవలం ఆయా ఫ్రాంఛైజీలు రికార్డు చేసిన వీడియోలు మాత్రమే ఇకపై వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఆటగాళ్లు తీసుకునే ఫొటో, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకోవడంపై ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. దీంతో ఇకపై ఆటగాళ్లు తీసే వీడియోలు సోషల్ మీడియాలో కనిపించకపోవచ్చని సమాచారం.