చెన్నై సూపర్ కింగ్స్‌కు శుభవార్త అందింది. గాయం కారణంగా ఈ లీగ్‌లో తొలి రెండు వారాలు ఆటకు దూరమవుతాడని భావించిన ఆ జట్టు స్టార్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఊహించిన దానికంటే ముందుగానే కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మహీ.. ప్రాక్టీస్ ప్రారంభించాడు. దీంతో మరికొన్ని రోజుల్లోనే అతడు తిరిగి బరిలోకి దిగే అవకాశం ఉందని సమాచారం. దీంతో ఫ్యాన్స్ లో జోష్ కనిపిస్తోంది. ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ కీలక ప్రకటన చేసింది. ఎంఎస్ ధోనీ కాలి కండరాల గాయంతో బాధపడుతున్నట్లు తెలిపింది. సమస్య తీవ్రంగా ఉండటంతో ప్రస్తుతం ధోనీ రిహాబిలిటేషన్‌లో ఉన్నాడని సీఎస్కే వెల్లడించింది.
ఈ గాయం నుంచి కోలుకోవడానికి కనీసం రెండు వారాలు పట్టే అవకాశం ఉందని, దాంతో ధోనీ తొలి 2 వారాలు ఐపీఎల్‌కు దూరం కానున్నట్లు పేర్కొంది. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ధోనీ కాస్త ముందుగానే మ్యాచ్ ఆడే అవకాశం కనిపిస్తోంది.కాగా మహేంద్ర సింగ్ ధోనీ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తోన్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రాక్టీస్ చేయడానికి తన కిట్‌ను తీసుకెళ్తోన్న వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ పోస్టు చేసింది. దీంతో ధోనీ కోలుకుంటున్నాడని చెప్పకనే చెప్పింది. సీఎస్కే తన తొలి మ్యాచ్‌ల రాజస్థాన్ రాయల్స్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఆ జట్టు తన తర్వాతి మ్యాచ్‌లలో శుక్రవారం పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది.
ఈ మ్యాచ్ తర్వాత ధోనీ తుది జట్టులోకి వస్తాడని ప్రచారం జరుగుతోంది.ఇక భారీ అంచనాలతో మెగా లీగ్‌ను మొదలుపెట్టిన సీఎస్కేకు తొలి మ్యాచ్‌లోనే ఘోర పరాభవం ఎదురైంది. రాజస్థాన్ రాయల్స్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. దీంతో పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానానికి పడిపోయింది. మరి తర్వాతి మ్యాచ్‌లలో పుంజుకుని.. ఆ జట్టు అద్భుత ప్రదర్శన చేస్తుందా.. లేదా గత సీజన్ మాదిరే నిరాశపరుస్తుందా అనేది చూడాలి. ప్రస్తుతం సంజూ శాంసన్ సీఎస్కే జట్టులో వికెట్ కీపింగ్ చేస్తున్నాడు. ధోనీ వచ్చాక పరిస్థితి ఏంటనేది తేలాల్సి ఉంది.