ఐపీఎల్ 2026 క్లైమాక్స్ దశకు చేరుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించగా.. మిగిలిన జట్లు లీగ్ దశలోనే వెనుదిరిగాయి. దీనికి ప్రధాన కారణం ఆయా జట్లలోని స్టార్ ఆటగాళ్లు దారుణంగా విఫలం కావడమే. వేలంలోనూ, రిటెన్షన్‌లోనూ కోట్ల రూపాయలు తీసుకుని.. మైదానంలో మాత్రం దారుణమైన ఆటతీరుతో ఫ్రాంచైజీల కొంపముంచారు. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఐపీఎల్ 2026 మెగా వేలంలో రిషబ్ పంత్ ను ఏకంగా 27 కోట్ల రికార్డు ధరకు దక్కించుకుని జట్టు కెప్టెన్‌గా కూడా నియమించింది. కానీ అంతటి భారీ ధరకు తగ్గ ప్రదర్శనను రిషబ్ పంత్ ఈ సీజన్లో అందించలేకపోయాడు. ఓ ఆటగాడిగా, కెప్టెన్ గా పంత్ ఆటతీరులో ఏ మాత్రం దూకుడు కనిపించలేదు. ఈ సీజన్లో ఆడిన 14 మ్యాచ్‌ల్లో రిషబ్ పంత్ కేవలం 312 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆర్సీబీపై ఆడిన ఒకే ఒక్క మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ మినహాయిస్తే లక్నోను ప్లేఆఫ్స్‌కు చేర్చడంలో పంత్ ఘోరంగా విఫలమయ్యాడు.
లక్నో జట్టుకు చెందిన మరో విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్‌ను ఫ్రాంచైజీ 21 కోట్లకు రిటైన్ చేసుకుంది. గత సీజన్లో 524 పరుగులతో దుమ్మురేపిన పూరన్.. ఈ 2026 సీజన్లో మాత్రం దారుణమైన ఫామ్‌తో నిరాశపరిచాడు. ముఖ్యంగా సీజన్ మొదటి భాగంలో నికోలస్ పూరన్ ఫామ్ మరీ దారుణంగా పడిపోయింది. ఈ సీజన్ లోని తన మొదటి 5 ఇన్నింగ్స్‌లలో పూరన్ కేవలం 42 పరుగులు మాత్రమే చేశాడు. సీఎస్కే వదిలేసిన తర్వాత మలింగ లాంటి బౌలింగ్ యాక్షన్ ఉన్న శ్రీలంక పేసర్ మతీషా పతిరానాను కేకేఆర్ భారీ పోటీ నడుమ 18 కోట్లకు కొనుగోలు చేసింది. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా జట్టును గట్టెక్కిస్తాడని కేకేఆర్ నమ్మింది. అయితే దురదృష్టవశాత్తూ పతిరానా జట్టు తరఫున ఆడిన తన తొలి మ్యాచ్‌లోనే గాయపడి టోర్నమెంట్ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో కోల్‌కతా పెట్టిన భారీ పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీరైంది.
ముంబై ఇండియన్స్ జట్టు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాను 18 కోట్లకు రీటైన్ చేసుకుంది. సాధారణంగా ప్రత్యర్థి బ్యాటర్లను వణికించే బుమ్రాకు ఈ సీజన్ ఓ పీడకలలా మిగిలింది. ఈ సీజన్లో 13 మ్యాచ్‌లు ఆడిన బుమ్రా 8.37 ఎకానమీతో పరుగులైతే కట్టడి చేయగలిగాడు కానీ, వికెట్లు తీయడంలో మాత్రం పూర్తిగా వెనుకబడ్డాడు. ఈ సీజన్ మొత్తంలో జస్ప్రీత్ బుమ్రా కేవలం 4 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. భారత టీ20 ప్రపంచకప్ విజేత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను కూడా ముంబై ఇండియన్స్ రూ.18 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఐపీఎల్ 2026లో సూర్య 13 మ్యాచ్‌లు ఆడి 20.77 సగటుతో, 147.54 స్ట్రైక్ రేట్‌తో కేవలం 270 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సీజన్లో సూర్య బ్యాట్ నుంచి కేవలం 2 హాఫ్ సెంచరీలు రాగా.. అత్యధిక స్కోరు 60 రన్స్ మాత్రమే. 2025 సీజన్‌తో పోలిస్తే సూర్యకుమార్ యాదవ్ గ్రాఫ్ ఈసారి భారీగా పడిపోవడంతో ముంబై ఇండియన్స్ టేబుల్ చివరి స్థానాల్లో నిలవాల్సి వచ్చింది.