Top story: ఈ రికార్డులు, రివార్డులు మెస్సీకి మాత్రమే సాధ్యం.!

గ్రౌండ్‌లో ఫుట్‌బాల్ అతని పాదాల దగ్గరికి వచ్చిందంటే చాలు.. ప్రపంచం మొత్తం ఊపిరి బిగబట్టి చూసేది. తన మంత్రముగ్ధమైన డ్రిబ్లింగ్స్, అద్భుతమైన గోల్స్, అసాధ్యాలను సుసాధ్యం చేసే ఆటతీరుతో కొన్ని దశాబ్దాల పాటు కోట్లాది మంది అభిమానుల హృదయాలను ఏలిన ఫుట్‌బాల్

Post Published By: dialnews
Updated : 2 September 2026, 10:49 AM IST

గ్రౌండ్‌లో ఫుట్‌బాల్ అతని పాదాల దగ్గరికి వచ్చిందంటే చాలు.. ప్రపంచం మొత్తం ఊపిరి బిగబట్టి చూసేది. తన మంత్రముగ్ధమైన డ్రిబ్లింగ్స్, అద్భుతమైన గోల్స్, అసాధ్యాలను సుసాధ్యం చేసే ఆటతీరుతో కొన్ని దశాబ్దాల పాటు కోట్లాది మంది అభిమానుల హృదయాలను ఏలిన ఫుట్‌బాల్ శకం ముగిసింది. అర్జెంటీనా దిగ్గజం, సాకర్ సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ.. ఇంటర్నేషనల్ కేరీర్‌కు ముగింపు పలుకుతూ రిటైర్మెంట్ ప్రకటించాడు. 21 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి వీడ్కోలు చెబుతూ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆయన చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులను తీవ్ర భావోద్వేగానికి గురిచేసింది. 1987 జూన్ 24న అర్జెంటీనాలోని రోసారియోలో మెస్సీ జన్మించాడు. చిన్నతనం నుంచే ఫుట్‌బాల్‌పై అమితమైన ప్రేమ పెంచుకున్న మెస్సీకి 11 ఏళ్ల వయస్సులో 'గ్రోత్ హార్మోన్ లోపం' ఉన్నట్లు తేలింది. ఈ వ్యాధి చికిత్సకు నెలకు వేల డాలర్లు ఖర్చయ్యేవి.

నిరుపేద కుటుంబం కావడంతో ఆ ఖర్చు భరించడం కష్టమైంది. కానీ, అతనిలోని అసమాన ప్రతిభను గుర్తించిన స్పానిష్ క్లబ్ 'బార్సిలోనా'.. మెస్సీ వైద్య ఖర్చులన్నీ భరిస్తామని ముందుకు వచ్చి తమ అకాడమీలో చేర్చుకుంది. మెస్సీకి బార్సిలోనా క్లబ్‌ అండగా నిలిచిందని చాలా మంది అనుకుంటారు కానీ.. మెస్సీ ప్రతిభను ఆ క్లబ్‌ ముందే గుర్తించింది. మెస్సీ మనసు మార్చుకుంటాడేమో అన్న భయంతో.. పక్కనే ఉన్న టిష్యూ పేపర్‌ మీదే మెస్సీతో వేరే క్లబ్‌కు వెళ్లకుండా అగ్రీమెంట్‌ చేయించుకుని మెస్సీని తమ క్లబ్‌లో చేర్చుకున్నారు. అలా ఒక సాదాసీదా బాలుడి ప్రయాణం ప్రపంచ విజేతగా మారే దిశగా మొదలైంది. 2004లో బార్సిలోనా సీనియర్ టీమ్‌లో అరంగేట్రం చేసిన మెస్సీ, 2005లో అర్జెంటీనా జాతీయ జట్టు తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 21 ఏళ్ల ఈ సుదీర్ఘ కేరీర్‌లో మెస్సీ సాధించని రికార్డు లేదు. అర్జెంటీనా తరఫున ఏకంగా 207 మ్యాచ్‌లు ఆడి, 125 గోల్స్ సాధించాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ చేసిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు.

ఆరు సార్లు వరల్డ్ కప్‌లలో పాల్గొని, అత్యధికంగా 26 ప్రపంచ కప్ మ్యాచ్‌లు ఆడిన రికార్డు సాధించాడు. క్లబ్ ఫుట్‌బాల్‌లో బార్సిలోనా, పారిస్ సెయింట్ జర్మన్ తరఫున పదుల సంఖ్యలో ట్రోఫీలు ముద్దాడాడు. ప్రస్తుతం అమెరికా ఫుట్‌బాల్ క్లబ్ 'ఇంటర్ మియామి'కి మెస్సీ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మెస్సీ జీవితంలో గొప్ప విజయం 2022 ఫిఫా వరల్డ్ కప్. 1986 తర్వాత అర్జెంటీనాకు ప్రపంచకప్ అందించాలనే దశాబ్దాల నిరీక్షణకు 2022 ఖతార్ వరల్డ్ కప్‌లో మెస్సీ ముగింపు పలికాడు. తన నాయకత్వంలో 7 గోల్స్, 3 అసిస్ట్‌లతో అద్భుత ప్రదర్శన చేసి 'గోల్డెన్ బాల్' అవార్డు గెలుచుకున్నాడు. 2021 మరియు 2024లలో అర్జెంటీనాకు వరుసగా కోపా అమెరికా కప్‌లను అందించాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫుట్‌బాలర్‌కు ఇచ్చే 'బ్యాలన్ డి ఓర్' అవార్డును అత్యధికంగా 8 సార్లు గెలుచుకుని చరిత్ర సృష్టించాడు. కెరీర్ ప్రారంభంలోనే జాతీయ జట్టుకు యూత్ ఛాంపియన్‌షిప్ అందించాడు. అయితే, మెస్సీ కెరీర్ అంతా విజయాల బాటలోనే సాగలేదు.

2014 వరల్డ్ కప్ ఫైనల్, వరుసగా కోపా అమెరికా ఫైనల్స్‌లో ఓటములు అతనిని తీవ్రంగా కుంగదీశాయి. ఒకానొక దశలో 2016లో తీవ్ర మనస్తాపంతో రిటైర్మెంట్ ప్రకటించి, అభిమానుల కోరిక మేరకు మళ్లీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఇటీవలి ఫిఫా వరల్డ్ కప్-2026 ఫైనల్లో స్పెయిన్ చేతిలో అర్జెంటీనా ఓడిపోవడం, అదే సమయంలో తన ప్రాణసమానమైన తండ్రి జార్జ్ మెస్సీ అనారోగ్యంతో మరణించడం మెస్సీని తీవ్ర శోకసంద్రంలో నెట్టివేసింది. అందుకే ఇక తన ఆటకు ముగింపు పలికాడు మెస్సీ. "మా నాన్న చనిపోయాక ఇక ఆడడంలో అర్థం లేదనిపించింది. జాతీయ జట్టు నుంచి తప్పుకోవాలనే నిర్ణయం నన్ను ఎంతో బాధిస్తోంది, కానీ ఇది సరైన సమయమని అనిపిస్తోంది" అంటూ మెస్సీ భావోద్వేగానికి లోనయ్యాడు. మైదానంలో మెస్సీ ఆటను చూడటం ఒక కల లాంటి అనుభూతి. అర్జెంటీనా జెర్సీలో ఇకపై మెస్సీ కనిపించకపోయినా, ఆయన చెరిపేయలేని రికార్డులు, అందించిన జ్ఞాపకాలు సాకర్ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి.

Published : 
  • 2 September 2026, 10:49 AM IST