ఎవ్వరూ ఊహించని విధంగా ఐపీఎల్ 2026 సాగుతుంది. వరల్డ్ టాప్ ప్లేయర్లంతా ఈ సీజన్లో అడ్రస్ లేకుండా పోతున్నారు. వరల్డ్ నెంబర్ వన్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఈ సీజన్లో దారుణంగా విఫలమయ్యాడు. టీమిండియా విజయాల్లో కీలకంగా మారిన బుమ్రా, ఈ ఐపీఎల్లో అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు. ప్రపంచంలోనే బెస్ట్ బౌలర్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చేది జస్ప్రీత్ బుమ్రానే. టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు కెప్టెన్ చూసే మొదటి వ్యక్తి బుమ్రా. అలాంటి బుమ్రా ఇప్పుడు ఐపీఎల్లో కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోతున్నాడు. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన బుమ్రా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.
కారణం ఏదైనా, బుమ్రా ఫామ్ కోల్పోవడం ఇప్పుడు ముంబై ఇండియన్స్‌కు పెద్ద మైనస్‌లా మారింది. చెత్త బౌలింగ్‌తో ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో వరుసగా నాలుగు మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా నాలుగు ఓవర్లు వేసి 41 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ సీజన్లో మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడిన బుమ్రా ఒక్క మ్యాచ్‌లో కూడా వికెట్ తీయలేకపోయాడు. కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 35 పరుగులు ఇవ్వగా, ఢిల్లీ క్యాపిటల్స్‌పై 21 పరుగులు ఇచ్చాడు. రాజస్థాన్ రాయల్స్‌పై 32 పరుగులు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 35 పరుగులు ఇచ్చాడు.
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఏకంగా 41 పరుగులు చేసి ముంబై ఓటమికి తానూ కారణమయ్యాడు.కాగా గత సీజన్లో ముంబైని మట్టికరిపించిన పంజాబ్.. ఈ సీజన్లోనూ అదే జోష్ చూయించింది. వరుసగా చివరగా జరిగిన మూడు మ్యాచ్‌లలో ముంబై ఇండియన్స్ పంజాబ్ చేతిలో ఘోర ఓటమిపాలయింది. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీ, కీలక బ్యాటింగ్ ఇన్నింగ్స్‌తో భారీ స్కోర్‌ను సైతం పంజాబ్ సులభంగా ఛేదించింది. విజయంతో ఈ సీజన్‌ను ఆరంభించిన ముంబై ఇండియన్స్ ఆ తర్వాత వరుస పరాజయాలను మూటగట్టుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్‌తో వరుసగా ఓడిపోయింది. రెండు సార్లు ఛేజింగ్ చేయలేక, మరో రెండు సార్లు టార్గెట్‌ను డిఫెండ్ చేయలేక ముంబై ఓడిపోయింది. ప్రస్తుతం రెండు పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది.