ఐపీఎల్-2026 సీజన్‌కు ముందు రాజస్తాన్ రాయల్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ జట్టు నూతన సారథిగా ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్‌ను ఖరారు చేసింది. దీనిపై రాజస్తాన్ రాయల్స్ అధికారిక ప్రకటన చేసింది. గత సీజన్ వరకు కెప్టెన్‌గా పనిచేసిన సంజూ శాంసన్ స్దానాన్ని పరాగ్ భర్తీ చేయనున్నాడు. తొలుత పరాగ్‌తో పాటు రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్ వంటి స్టార్ ప్లేయర్లు రాజస్తాన్ కెప్టెన్సీ రేసులో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ రాజస్తాన్ మేనెజ్‌మెంట్ మాత్రం పరాగ్ వైపే మొగ్గు చూపింది. వేలానికి ముందు ట్రేడింగ్ విండో ద్వారా సంజూ శాంసన్ ను వదిలేసి జడేజా, సామ్ కరన్ లను తీసుకుంది. సీనియర్ ప్లేయర్ గా, మ్యాచ్ విన్నర్ గా పేరున్న జడేజాకే పగ్గాలు అప్పగిస్తారని భావించారు.
అటు జైస్వాల్ , ధృవ్ జురెల్ కూడా పరాగ్ కంటే రేసులో ముందున్నట్టు క్రికెట్ వర్గాలు తెలిపాయి. కానీ రాయల్స్ యాజమాన్యం మాత్రం పరాగ్ పైనే నమ్మకముంచింది. రియాన్ పరాగ్ 2019 నుంచి రాజస్తాన్ జట్టుతో కొనసాగుతున్నాడు. అస్సాం జట్టుతో పాటు రాజస్తాన్ కెప్టెన్‌గా కూడా పరాగ్‌కు పనిచేసిన అనుభవం ఉంది.ఐపీఎల్-2025 సీజన్‌లో గాయపడిన సంజూ శాంసన్ స్ధానంలో 8 మ్యాచ్‌లకు పరాగ్ నాయకత్వం వహించాడు. పరాగ్ కెప్టెన్సీలో రాయల్స్ కేవలం రెండే మ్యాచ్ లు గెలిచింది. అయితే హెడ్ కోచ్ కుమార్ సంగక్కర సూచన మేరకు పరాగ్‌కు తమ జట్టు పగ్గాలను రాజస్తాన్ అప్పగించినట్లు సమాచారం.
కెప్టెన్సీ కోసం ఆ జట్టు కోచ్ సంగక్కర పలువురు ఆటగాళ్లను ఇంటర్వ్యూలు చేశారని, వారిలో పరాగ్ అతడిని మెప్పించాడని పేర్కొంది. అయితే.. సంగక్కర ఇంటర్వ్యూ చేసిన మిగిలిన ఆటగాళ్లు ఎవరు అన్న విషయాలను మాత్రం వెల్లడించలేదు. రియాన్ పరాగ్ 2019లో ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరుపున అరంగ్రేటం చేశాడు. ఇప్పటి వరకు అతడు 84 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 26.1 సగటుతో 1566 పరుగులు చేశాడు. ఇందులో 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.ఇక ఈ ఏడాది సీజన్‌కు ముందు రాజస్తాన్ జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. సంజూ శాంసన్ చెన్నైకి వెళ్లిపోగా.. రాహుల్ ద్రవిడ్ హెడ్‌కోచ్‌గా తప్పుకోవడంతో కుమార్ సంగక్కర ఆధ్వర్యంలో రాజస్తాన్ బరిలోకి దిగనుంది.