ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో సంచలన ఫలితం నమోదైంది. పసికూన జింబాబ్వే అద్వితీయమైన ప్రదర్శనతో ఆస్ట్రేలియాకు షాకిచ్చింది. గ్రూప్-బీలో భాగంగా కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే 23 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లల్లో రెండు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. జింబాబ్వేలో ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ ఇన్నింగ్ హైలైట్ గా నిలిచింది . 56 బంతుల్లో ఏడు ఫోర్లతో 64 పరుగులు చేశాడు. మరుమని- 35, ర్యాన్ బ్యూరీ- 35 పరుగులతో రాణించారు. కేప్టెన్ సికందర్ రజా 13 బంతుల్లో 25 పరుగులతో మెరుపు ఇన్నింగ్ ఆడాడు.అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా ఏ మాత్రం దీన్ని ఛేదించలేకపోయింది. 19.3 ఓవర్లల్లో 146 పరుగులకు చాప చుట్టేసింది. మిడిలార్డర్ బ్యాటర్ రెన్ షా ఒక్కడే టాప్ స్కోరర్. 44 బంతుల్లో 65 పరుగులు చేశాడు.
టీ20 ప్రపంచకప్ చరిత్రలో జింబాబ్వే చేతిలో ఓడిపోవడం ఆస్ట్రేలియాకు ఇది రెండోసారి. అరంగేట్ర టీ20 ప్రపంచకప్ 2007 టోర్నీలోనూ ఆస్ట్రేలియాను జింబాబ్వే ఓడించింది. తాజా ఓటమితో జింబాబ్వే సూపర్-8 అవకాశాలను మెరుగుపర్చుకోగా.. ఆసీస్ సంక్లిష్టంగా మార్చుకుంది. ప్రస్తుతం గ్రూప్-బీలో శ్రీలంక, జింబాబ్వే రెండేసి విజయాలతో టాప్-2లో కొనసాగుతున్నాయి. ఆస్ట్రేలియా ఒక మ్యాచ్‌లో గెలిచి మరో మ్యాచ్‌లో ఓడి మూడో స్థానంలో కొనసాగుతోంది.ఆస్ట్రేలియా తమ చివరి రెండు మ్యాచ్‌లను శ్రీలంక, ఒమన్‌లతో ఆడనుంది.
ఈ రెండు మ్యాచ్‌లను మెరుగైన రన్‌రేట్‌తో గెలిస్తేనే ఆసీస్ సూపర్-8 చేరుతుంది. లేదంటే జింబాబ్వే, శ్రీలంక తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో కనీసం ఒక్క మ్యాచ్ ఓడిపోవాలి. అప్పుడు కూడా ఆసీస్ రన్‌రేట్ మెరుగ్గా ఉంటేనే టోర్నీలో ముందడుగు వేస్తోంది. జింబాబ్వే తమ తదుపరి రెండు మ్యాచ్‌ల్లో ఐర్లాండ్, శ్రీలంకతో తలపడనుంది.ఈ రెండు మ్యాచ్‌లకు రెండు గెలిస్తే గ్రూప్ బీ టాపర్‌గా జింబాబ్వే సూపర్-8కు అర్హత సాధిస్తుంది. ఒక్క మ్యాచ్ ఓడినా రన్ రేట్ కీలకం అవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆసీస్ తమ తదుపరి రెండు మ్యాచ్‌లను మెరుగైన రన్‌రేట్‌తో గెలవాలి. అప్పుడే గ్రూప్-బీలో రెండో స్థానంలో నిలిచి సూపర్-8 రేసులోకి అడుగుపెడుతుంది.