సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘80s AI Avatar Trend’ హవా నడుస్తోంది. మీ ప్రస్తుత ఫోటోను AI చాట్‌బాట్‌కు ఇస్తే చాలు, 1980ల నాటి బాలీవుడ్ లేదా టాలీవుడ్ రెట్రో లుక్‌లో, వింటేజ్ హెయిర్‌స్టైల్స్, పాతకాలం గ్లాసెస్.. క్లాసిక్ ఫిల్మ్ టోన్‌తో మిమ్మల్ని ఒక రెట్రో స్టార్లా మార్చేస్తోంది. సామాన్య నెటిజన్ల నుంచి కేంద్ర మంత్రులు, సీనియర్ నాయకులు, క్రికెటర్లు, సినీ ప్రముఖుల వరకు ప్రతీ ఒక్కరూ ఈ '80ల లుక్' మాయలో పడిపోయారు. అయితే, కొన్ని సెకన్ల వినోదం, కొన్ని లైక్స్, కామెంట్ల కోసం మనం ఉత్సాహంగా జెనరేట్ చేస్తున్న ఈ AI ఫోటోల వెనుక చాలా పెద్ద పర్యావరణ మూల్యం దాగి ఉంది. 'ఉచితంగా' వస్తున్నట్లు అనిపించే ఈ AI విప్లవం వెనుక విద్యుత్, మంచినీరు, డేటా దుర్వినియోగం ఏ స్థాయిలో జరుగుతున్నాయో వివరిస్తూ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏఐ ట్రెండ్ వెనక సైబర్ డేంజర్ ఉంది అనేది చాలా మందికి తెలుసు. కానీ ఇదే ట్రెండ్ వెనక ఊహకందని నీటి నష్టం కూడా ఉందంటున్నారు నిపుణులు.
ఇది ఇలాగే కంటిన్యూ అయితే తాగడానికి కూడా నీల్లు లేని పరిస్థితి ఏర్పడుతుందంటున్నారు. AI మన తాగునీటి వ్యవస్థను ఖాళీ చేస్తోందంటే నమ్మడం కష్టంగా ఉండొచ్చు. కానీ, తీవ్రంగా పనిచేసే సర్వర్లు వేడెక్కకుండా ఉండేందుకు డేటా సెంటర్లు ‘కూలింగ్ సిస్టమ్స్’ కోసం స్వచ్ఛమైన మంచినీటిని విపరీతంగా వాడతాయి. ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం, ఒక్క AI ఇమేజ్ ప్రొడ్యూస్ చేయడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా 29 మిల్లీలీటర్ల నీరు ఖర్చవుతుంది. ఒక సాధారణ 100 మెగావాట్ల డేటా సెంటర్ రోజుకు దాదాపు 20 లక్షల లీటర్ల మంచినీటిని తాగుతుంది. ఇది రోజువారీగా దాదాపు 6,500 కుటుంబాల నీటి అవసరాలతో సమానం. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న డేటా సెంటర్లు ఏటా దాదాపు 150 బిలియన్ లీటర్ల నీటిని వాడుతున్నాయి. 2030 నాటికి ఇది 358 బిలియన్ లీటర్లకు చేరుకుంటుందని అంచనా. ప్రపంచ జనాభాలో 18% ఉన్న భారత్‌లో లభ్యమయ్యే మంచినీరు కేవలం 4% మాత్రమే. ఇప్పటికే ముంబై, చెన్నై, పుణే వంటి నగరాలు తీవ్ర నీటి ఎద్దడిని, హీట్‌వేవ్‌లను ఎదుర్కొంటున్నాయి.
డేటా సెంటర్ల ప్రధాన హబ్‌లుగా మారిన ఈ నగరాల్లో AI కోసం నీటిని మళ్లించడం తీవ్రమైన పర్యావరణ ముప్పుకు దారితీస్తోంది. ఇలాంటి పనికిరాని ట్రెండ్లతో ఏఐ వాడకం ఇలానే ఇష్టారీతిని పెరిగితే నిజంగానే తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి ఏర్పడటం మాత్రం ఖాయం. మరో పక్క ఇలాంటి ట్రెండ్స్ వల్ల భారీ స్థాయిలో విద్యుత్ కూడా వృధా అవుతోంది. మనం ఫోన్లో ఒక సాధారణ క్లిక్‌తో AI చిత్రాన్ని సృష్టించినప్పుడు, ఆ పని మన ఫోన్లో జరగదు. ఎక్కడో వేల మైళ్ల దూరంలో ఉన్న భారీ డేటా సెంటర్లలో ఉన్న శక్తివంతమైన సర్వర్లు రన్ అవుతాయి. TRG డేటా సెంటర్స్ నివేదిక ప్రకారం, ఒకే ఒక్క AI ఇమేజ్ సృష్టించడానికి దాదాపు 3 వాట్-అవర్ల విద్యుత్ ఖర్చవుతుంది. ఇది ఒక స్మార్ట్‌ఫోన్‌ను పూర్తిగా ఛార్జ్ చేయడానికి పట్టే విద్యుత్‌తో సమానం. ఒక్కో AI ఫోటో తయారీలో దాదాపు 1 గ్రాము కార్బన్ డై ఆక్సైడ్ వాతావరణంలోకి విడుదలవుతుంది. గూగుల్ సెర్చ్ కంటే AI చిత్రాల తయారీకి అనేక రెట్లు ఎక్కువ ప్రాసెసింగ్ పవర్ అవసరం. సామ్ ఆల్ట్‌మన్ ప్రకారం, భారతీయులు నెలకు కోట్లాది AI ఇమేజ్ ప్రాంప్ట్‌లను వాడుతున్నారు. ఇవన్నీ కలిపితే డేటా సెంటర్ల విద్యుత్ వినియోగం ఊహించని స్థాయికి చేరుతోంది. ఇక డేటా ప్రైవసీ విషయంలో ఎన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు.
పర్యావరణ సమస్యల పక్కన పెడితే, ఉచితంగా ఫోటోలు చేసి ఇచ్చే ఈ థర్డ్-పార్టీ AI యాప్‌లకు మీ ఫోటోలు ఇవ్వడం వల్ల డిజిటల్ సెక్యూరిటీ ప్రమాదాలు ఎదురవుతున్నాయి. మనం హై-రిజల్యూషన్ సెల్ఫీలు అప్లోడ్ చేసినప్పుడు, మన ముఖం యొక్క అనాటమీ మరియు బయోమెట్రిక్ డేటాను ఆ కంపెనీలకు ఇచ్చేస్తున్నాం. మన అనుమతి లేకుండానే ఈ ఫేషియల్ డేటాను ఇతర AI మోడళ్లకు ట్రైనింగ్ ఇవ్వడానికి, లేదా భవిష్యత్తులో డీప్‌ఫేక్ స్కామ్‌లకు ఉపయోగించే ప్రమాదాలున్నాయి. మోడల్ శిక్షణ కోసం యూజర్ల డేటాను డిఫాల్ట్‌గా వాడుకునే నిబంధనలు అనేక యాప్‌లలో ఉంటాయి. వీటిని సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆఫ్ చేసుకోకపోతే మన ప్రైవేట్ ఫోటోలు పబ్లిక్ డేటాబేస్‌లోకి వెళ్లిపోతాయి. AI అనేది వ్యవసాయం, వైద్యం, వాతావరణ అంచనా వంటి రంగాలలో అద్భుతాలు సృష్టించడానికి ఉపయోగపడాల్సిన సాంకేతికత. కానీ, కేవలం కొన్ని రోజుల పాటు సాగే సోషల్ మీడియా ట్రెండ్లు మరియు సరదా రీల్స్ కోసం విచ్చలవిడిగా AI ఇమేజ్‌లను జెనరేట్ చేయడం వల్ల భవిష్యత్తు తరాలకు దక్కాల్సిన విద్యుత్, నీటి వనరులు హరించుకుపోతున్నాయంటున్నారు నిపుణులు.