Top story: ఆమె శాపమే నేపాల్‌ను మృత్యువులా వెంటాడుతోందా ? ఈ కథ వింటే మీ మైండ్‌ పోతుంది..!

భూకంపాలు, కొండచరియలు విరిగిపడడం, ఆకస్మిక వరదలు. కొన్నేళ్లుగా నేపాల్‌ను వెంటాడుతున్న ప్రమాదాలు ఇవి. మిగతా ప్రపంచానికి ఇవి కేవలం ప్రమాదాలు మాత్రమే.. కానీ ఓ పతివ్రత శాపమే ఇలా ప్రమాదాల రూపంలో నేపాల్‌ను వెంటాడుతోందని మీలో ఎంత మందికి తెలుసు.

Post Published By: dialnews
Updated : 1 September 2026, 6:35 PM IST

భూకంపాలు, కొండచరియలు విరిగిపడడం, ఆకస్మిక వరదలు. కొన్నేళ్లుగా నేపాల్‌ను వెంటాడుతున్న ప్రమాదాలు ఇవి. మిగతా ప్రపంచానికి ఇవి కేవలం ప్రమాదాలు మాత్రమే.. కానీ ఓ పతివ్రత శాపమే ఇలా ప్రమాదాల రూపంలో నేపాల్‌ను వెంటాడుతోందని మీలో ఎంత మందికి తెలుసు. వినడానికి ఇది ఇక మిత్‌ లాగే ఉన్నా.. నేపాల్‌ ప్రజలు మాత్రం ఆ పతివ్రత పెట్టిన శాపమే మమ్మల్ని మృత్యువులా ఇప్పటికీ వెంటాడుతోందని నమ్ముతున్నారు. అక్కడి వాళ్లు చెప్తున్న కథల ప్రకారం.. 17వ శతాబ్దంలో ఖాట్మాండు లోయను మల్ల రాజవంశానికి చెందిన లక్ష్మీ నరసింహ మల్ల పరిపాలించేవారు. ఆ సమయంలో ఆయన దర్బార్‌లో భీమ్‌ మల్లా అత్యంత నమ్మకస్తుడైన, శూరుడైన ప్రధానిగా ఉండేవారు. రాజ్యం విస్తరణలో, వర్తక సంబంధాలు పెంచడంలో భీమ్‌ మల్లా కీలక పాత్ర పోషించారు. అయితే, ఆయన పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేని కొందరు కుట్రదారులు, భీమ్‌ మల్లా రాజ్యానికి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నాడని రాజు వద్ద అబద్ధాలు ప్రచారం చేశారు.

అసూయ, నిందలతో నిండిన మాటలను రాజు నిజమని నమ్మాడు. విచారణ లేకుండానే, దేశం కోసం ఎంతో సేవ చేసిన భీమ్‌ మల్లాను అకారణంగా హత్య చేయించాడు. భర్త అన్యాయంగా ప్రాణాలు కోల్పోయాడనే వార్త తెలిసిన ఆయన భార్య భువనలక్ష్మి గుండె పగిలిపోయింది. ఆ కాలంలో నేపాల్‌లో సతి సహగమన ఆచారం అమలులో ఉండేది. తన భర్త భౌతికకాయంతో పాటు చితిపైకి ఎక్కిన భువనలక్ష్మి, ఆత్మాహుతి చేసుకునే ముందు తీవ్ర ఆవేదనతో కన్నీరు మున్నీరై శపించింది. "నిజాయితీగా సేవ చేసిన నా భర్తను అన్యాయంగా బలితీసుకున్న ఈ రాజ్యానికి, ఈ నేలకు ఎప్పటికీ మనశ్శాంతి ఉండదు. ఈ దేశం ఏనాటికీ సంతోషంగా, ప్రశాంతంగా జీవించలేదు. నిరంతరం విధ్వంసం, కన్నీళ్లతోనే కాలం గడుపుతుంది" అని శపించి తాను కూడా ప్రాణం తీసుకుంది. ఈ కథ కేవలం ఒక జానపద విశ్వాసమే అయినప్పటికీ, నేపాల్ చరిత్రలో జరుగుతున్న వరుస పరిణామాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంటాయి.

నేపాల్‌లో ఏ ప్రభుత్వమూ స్థిరంగా నిలబడలేకపోవడం, నిరంతరం అంతర్గత కలహాలు రాజుకోవడం ఈ శాప ఫలితమేనని కొంతమంది భావిస్తారు. 2001 జూన్ 1న నేపాల్ రాజకుటుంబంలో జరిగిన నరమేధం దేశాన్ని షాక్‌కు గురిచేసింది. ఆ ఘటనతో నేపాల్‌లో శతాబ్దాల రాజరికం అంతమైంది. 2015లో వచ్చిన భారీ భూకంపం వేలాది మందిని పొట్టనబెట్టుకుంది. అలాగే ప్రతి ఏటా సంభవించే ఆకస్మిక వరదలు, కొండచరియలు నేపాల్‌లోని అనేక గ్రామాలు, ప్రాజెక్టులను ముంచెత్తుతున్నాయి. ఇవన్నీ ఆ మహిళ పెట్టిన శాపం మూలంగానే జరిగాయని నేపాల్‌లో చాలా మంది నమ్ముతున్నారు. రీసెంట్‌గా వచ్చిన వరదలు కూడా ఆమె శాపం మూలంగానే వచ్చాయి అనేది ఇప్పుడు వినిపిస్తున్న వాదన. ఆధునిక విజ్ఞాన ప్రపంచంలో విపత్తులకు వాతావరణ మార్పులు, భూభౌతిక కారణాలే ముఖ్యమని సైన్స్ చెబుతుంది. కానీ, అనవసరంగా చిందించిన ఒక నిరాధారమైన రక్తబొట్టు, ఒక సాధ్వి కన్నీటి ఆవేదన ఎంతటి శక్తివంతమైనవో చెప్పడానికి ఈ "సతి శాపం" కథ నేపాల్ సంస్కృతిలో నిలిచిపోయింది. వరదలు వచ్చినా, విపత్తులు ఎదురైనా.. భువనలక్ష్మి కన్నీటి రూపంలోనే నేపాల్‌కు ఈ శాపం వెంటాడుతోందా అనే ప్రశ్న అక్కడి ప్రజల మదిలో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది.

Published : 
  • 1 September 2026, 6:35 PM IST