Top story: 45 ఏళ్ల క్రితం నాటి దొంగను పట్టించిన 80s AI ట్రెండ్‌.!

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ ట్రెండ్ వైరల్ అవుతుందో చెప్పడం కష్టం. నెటిజన్లు కూడా సరికొత్త రీల్స్, ఏఐ ఫిల్టర్లు, విభిన్న సవాళ్లతో సందడి చేస్తుంటారు.

Post Published By: dialnews
Updated : 17 September 2026, 3:51 PM IST

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ ట్రెండ్ వైరల్ అవుతుందో చెప్పడం కష్టం. నెటిజన్లు కూడా సరికొత్త రీల్స్, ఏఐ ఫిల్టర్లు, విభిన్న సవాళ్లతో సందడి చేస్తుంటారు. అయితే, సరదాగా డిజిటల్ దుస్తులు తొడిగి అందరినీ అలరించే కొన్ని వినూత్న ట్రెండ్లు.. కొందరి జీవితాల్లో అనూహ్య మలుపులు తెస్తుంటాయి. తాజాగా మధ్యప్రదేశ్ పరిధిలోని ఉజ్జయినిలో సరిగ్గా అలాంటి ఒక విచిత్ర ఘటనే వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో విపరీతంగా క్రేజ్ సంపాదించుకున్న ‘80s ఏఐ రెట్రో ఫొటో ట్రెండ్’.. ఏకంగా 45 ఏళ్ల క్రితం నాటి దొంగతనం కేసును బయటపెట్టి, ఒక మహిళను పోలీసులకు పట్టించింది.

దాదాపు 45 ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఒక చిన్న గోల్డ్‌ దుకాణంలో చోరీ జరిగింది. అప్పట్లో యువతిగా ఉన్న ఒక మహిళ ఆ షాప్‌లోకి కస్టమర్‌లా వెళ్లి, దుకాణదారుడి దృష్టి మరల్చి ఓ విలువైన బంగారు హారాన్ని కాజేసి పరారైంది. ఈ ఘటనపై అప్పట్లోనే బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే ఎంత వెతికినా ఆ దొంగ ఆధారాలు దొరకకపోవడంతో, ఆ కేసు విచారణ పెండింగ్‌లోనే ఉండిపోయింది. దొంగతనం చేసిన తర్వాత ఆ మహిళ కూడా పోలీసుల కంటపడకుండా ఉండేందుకు తన ఉనికిని పూర్తిగా మార్చేసింది. ఉజ్జయిని నగరాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్లిపోవడమే కాకుండా, తన పేరును కూడా మార్చుకుని ఎవరికీ అనుమానం రాకుండా పదేళ్లుగా సాధారణ జీవితం గడుపుతోంది. కాలం మారుతున్న కొద్దీ సాంకేతికత అందుబాటులోకి వచ్చింది.

ఇటీవల కాలంలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్‌ వేదికలపై "1980ల నాటి లుక్" పేరుతో ఓ వైరల్ ఫిల్టర్ హల్‌చల్ చేసింది. మన ప్రస్తుత ఫొటోను ఆ ఏఐ టూల్‌లో అప్‌లోడ్ చేస్తే.. అది 1980లో ఉన్న హెయిర్‌స్టైల్‌, దుస్తులు, పాతకాలం నాటి రెట్రో ఫ్రేమ్‌లతో అప్పటి లుక్‌లోకి మార్చి ఇస్తుంది. ఈ క్రమంలోనే సదరు మహిళ కూడా తన ప్రస్తుత ఫొటోను ఆ ఏఐ యాప్‌లో అప్‌లోడ్ చేసి, 80ల నాటి వింటేజ్ లుక్‌లోకి మార్చుకుని మురిసిపోయింది. అంతటితో ఆగక ఆ ఫొటోను సరదాగా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ క్రమంలో ఆ ఫొటో 45 ఏళ్ల క్రితం బంగారం పోగొట్టుకున్న ఉజ్జయిని వ్యాపారి కంట పడింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ మహిళ 80ల నాటి ఏఐ ఫొటోను చూడగానే వ్యాపారికి ఒక్కసారిగా 45 ఏళ్ల కిందట తన షాప్‌లో హారం దొంగిలించిన యువతి గుర్తుకొచ్చింది. ఏఐ ఫిల్టర్ వల్ల ఆమె ప్రస్తుత ముఖం 45 ఏళ్ల కిందటి యువతి రూపంలోకి మారడంతో, యజమాని ఆ పోలికలను సులువుగా గుర్తుపట్టగలిగాడు. వెంటనే ఆలస్యం చేయకుండా ఆ వ్యాపారి పోస్ట్ లింక్, ఫొటో ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 45 ఏళ్ల నాటి పాత కేసు ఆధారాలను రీఓపెన్ చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సోషల్ మీడియా ఐడీ, ఐపీ అడ్రస్ ఆధారంగా ఆమె ఉన్న ప్రాంతాన్ని ట్రాక్ చేసి అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో, ఆ మహిళ 45 ఏళ్ల క్రితం ఉజ్జయినిలోని బంగారు హారం దొంగిలించిన మాట వాస్తవమేనని ఒప్పుకుంది. అప్పట్లో దొంగతనం చేసి పేరు మార్చుకుని తప్పించుకున్నప్పటికీ, డిజిటల్ యుగంలో సరదాగా చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ తనను ఇలా పోలీసుల బోనులో నిలబెడుతుందని ఊహించలేదని వాపోయింది. ఏది ఏమైనా, 45 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఒక పాత కేసును సాంకేతికతతో పాటు ఏఐ ట్రెండ్ ఛేదించడం ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. "నేరం చేసి ఎంతకాలం దాక్కున్నా, ఏదో ఒక రోజు చట్టానికి చిక్కక తప్పదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Published : 
  • 17 September 2026, 3:51 PM IST