శవాల మీద పేలాలు ఏరుకోవడం అంటే బహుశా ఇదేనేమో.. నేపాల్‌లో ఇటీవల సంభవించిన అకస్మిక వరదలు తీవ్ర వినాశనాన్ని మిగిల్చాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది ఇళ్లు లేక నిరాశ్రయులయ్యారు. బాధితులను ఆదుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉదార స్వభావంతో ఎంతోమంది ముందుకు వస్తున్నారు. అయితే, ప్రజల ఈ సానుభూతిని సైబర్ నేరగాళ్లు తమ స్వార్థానికి అనుకూలంగా మలుచుకుంటూ ఘోరమైన మోసాలకు పాల్పడుతున్నారు. వరద బాధితులకు సాయం చేయాలనే పేరుతో ఉదారులు పంపే విరాళాల సొమ్మును తమ ఖాతాల్లోకి మళ్లించుకుంటూ వికృత దోపిడీకి తెరతీశారు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్, వైబర్ ద్వారా చారిటీ పేరుతో విస్తరిస్తున్నారు. 'ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధి' పేరుతో నకిలీ పేజీలు, గ్రూప్‌లు సృష్టిస్తున్నారు. ప్రభుత్వ అధికారిక లోగోలను కాపీ చేసి అమయాకులను నమ్మిస్తున్నారు.
అసలైన విరాళాల క్యూఆర్ కోడ్లను మార్చి, తమ సొంత బ్యాంక్ ఖాతాలు, ఇ-వాలెట్లకు లింక్ అయిన క్యూఆర్ కోడ్లను షేర్ చేస్తున్నారు. సహాయం అందిస్తామని, విరాళాలు సేకరిస్తున్నామని నమ్మించి.. బ్యాంక్ అకౌంట్ నంబర్లు, డెబిట్, క్రెడిట్ కార్డ్ వివరాలు, ఓటీపీలు అడిగి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. విదేశీ నంబర్ల నుండి కాల్స్ చేసి, "నేను వరదల్లో చిక్కుకున్నాను, వెంటనే డబ్బులు పంపండి" అంటూ బంధువుల పేరిట ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్‌కు దిగుతున్నారు. ఈ మోసాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం మరింత కలకలం రేపుతోంది. ఇటీవల చాట్‌జీపీటీ సహాయంతో ఓ వ్యక్తి నకిలీ రసీదును సృష్టించాడు. తాను ప్రధాని సహాయ నిధికి 1.2 లక్షలు విరాళం ఇచ్చినట్లు ఫేక్ స్టేట్మెంట్ డిజైన్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాని కిందే "నేను సాయం చేశాను, మీరూ చేయండి" అంటూ తన సొంత క్యూఆర్ కోడ్‌ను జత చేసి ప్రజల నుండి లక్షల రూపాయలు వసూలు చేయాలని చూశాడు.
ఈ విషయాన్ని గుర్తించిన నేపాల్ పోలీసులు ఆ నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇలాంటి వాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలిన పోలీసులు సూచిస్తున్నారు. వరద బాధితులకు సహాయం చేయాలనుకునేవారు కేవలం నేపాల్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన 'ప్రధానమంత్రి నేచురల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్' అకౌంట్లు, వెబ్సైట్ ద్వారా మాత్రమే విరాళాలు పంపాలని చెప్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే అనుమానాస్పద క్యూఆర్ కోడ్లు, లింకులను అస్సలు స్కాన్ చేయవద్దు. డబ్బులు పంపే ముందు స్కాన్ స్క్రీన్‌పై స్వచ్ఛంద సంస్థ పేరు లేదా ప్రభుత్వ నిధి పేరు వస్తోందో లేదో సరిచూసుకోవాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ బ్యాంక్ వివరాలు, పిన్లు , ఓటీపీలు ఎవరికీ షేర్ చేయకూడదు. సైబర్ మోసానికి గురైనా లేదా ఏదైనా నకిలీ క్యూఆర్ కోడ్ కంటపడినా వెంటనే 1930 హెల్ప్‌లైన్ సంఖ్యకు లేదా సమీప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం మంచిదని చెప్తున్నారు పోలీసులు. ఒకవైపు విపత్తుతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న బాధితులుంటే, మరోవైపు వారి పేరుతో అక్రమార్జన చేస్తున్న ఈ సైబర్ రాక్షసుల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఆదేశిస్తున్నారు.