హిట్లర్ అనగానే మనకు గుర్తొచ్చేది కోట్లాది మందిని పొట్టనబెట్టుకున్న ఒక నరరూప రాక్షసుడు, రెండో ప్రపంచ యుద్ధానికి కారణమైన ఒక క్రూరమైన పాలకుడు. కానీ, ప్రపంచాన్ని వణికించిన ఈ డిక్టేటర్.. తన సొంత ఇంట్లోనే ఒక అమ్మాయి పట్ల సైకోలా ప్రవర్తించాడనే నిజం ఎంతమందికి తెలుసు? ఆమె మరెవరో కాదు.. హిట్లర్ స్వయంగా ప్రాణంగా ప్రేమించిన అతని మేనకోడలు '
Geli Roubal
'. 1931 సెప్టెంబర్ 19న, మ్యూనిచ్ నగరంలోని హిట్లర్ విలాసవంతమైన అపార్ట్మెంట్లో.. ఒక మూసి ఉన్న గదిలో 23 ఏళ్ల గెలీ రౌబల్ రక్తం మడుగులో శవమై కనిపించింది. ఆమె గుండెల్లోకి హిట్లర్ సొంత తుపాకీ బుల్లెట్ దూసుకెళ్లింది. అసలు ఆ రాత్రి ఆ గదిలో ఏం జరిగింది? అది ఆత్మహత్యా లేక హిట్లర్ చేసిన హత్యనా?
కథలోకి వెళ్తే.. గెలీ రౌబల్ హిట్లర్ సగం సోదరి అయిన ఏంజెలా రౌబల్ కూతురు. అంటే వరసకు హిట్లర్‌కు మేనకోడలు అవుతుంది. 1925లో హిట్లర్ తన ఇంటి పనులను చూసుకోవడానికి ఏంజెలాను పిలిపించాడు. ఆమెతో పాటు 17 ఏళ్ల గెలీ రౌబల్ కూడా హిట్లర్ జీవితంలోకి అడుగుపెట్టింది. గెలీ చూడటానికి చాలా అందంగా, ఎప్పుడూ నవ్వుతూ, ఎంతో చురుగ్గా ఉండేది. అప్పటికే జర్మనీ రాజకీయాల్లో ఎదుగుతూ, అత్యంత ఒంటరితనంతో, మానసిక ఒత్తిడితో ఉన్న హిట్లర్.. గెలీ అందానికి, ఆమె చమత్కారానికి పూర్తిగా దాసోహమయ్యాడు. ఆమెను తనతోనే ఉంచుకోవాలని డిసైడ్ అయ్యాడు. 1929లో మ్యూనిచ్‌లో ఒక పెద్ద లగ్జరీ అపార్ట్మెంట్ కొని, గెలీని తనతో పాటే ఒకే ఇంట్లో ఉంచుకున్నాడు. అయితే, మొదట్లో బాబాయ్‌గా ప్రేమ చూపించిన హిట్లర్ మనసులో.. మెల్లమెల్లగా ఆమెపై ఒక వికృతమైన వ్యామోహం మొదలైంది.
హిట్లర్ ప్రజల ముందు తాను బ్రహ్మచారిని అని చెప్పుకునేవాడు కానీ, ఇంట్లో మాత్రం గెలీ రౌబల్పై విపరీతమైన పొసెసివ్‌నెస్ చూపించేవాడు. ఆమెను ఒక బంగారు పంజరంలో బంధించిన చిలుకలా మార్చేశాడు. గెలీని ఒంటరిగా బయటకు వెళ్లనిచ్చేవాడు కాదు. ఆమె ఏ ఫ్రెండ్స్‌తో మాట్లాడుతోంది, ఎక్కడికి వెళ్తోంది అనే ప్రతి విషయాన్ని పక్కాగా గమనించడానికి తన సొంత బాడీగార్డ్స్‌ను నిఘా పెట్టాడు. ఆమె ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎవరిని కలవాలి అనేది కూడా హిట్లరే డిసైడ్ చేసేవాడు. గెలీకి సంగీతం నేర్చుకోవాలని, వియన్నా నగరానికి వెళ్లి పెద్ద సింగర్ అవ్వాలని కోరిక ఉండేది. కానీ హిట్లర్ ఆమెను తన కళ్లెదుట నుండి ఒక్క అడుగు కూడా దూరం వెళ్లనిచ్చేవాడు కాదు.
హిట్లర్ చూపించే ఈ అతి ప్రేమ, నిఘా మెల్లమెల్లగా గెలీకి ఒక నరకంలా మారడం ప్రారంభమైంది. ఇలాంటి ఊపిరాడని వాతావరణంలో ఉన్న గెలీ జీవితంలో ఒక సంచలన ట్విస్ట్ చోటుచేసుకుంది. హిట్లర్ పర్సనల్ డ్రైవర్, అలాగే నాజీ పార్టీ వ్యవస్థాపక సభ్యుడైన 'ఎమిల్ మారిస్' తో గెలీ రహస్యంగా ప్రేమలో పడింది. హిట్లర్ భయంకరమైన నిఘా కళ్లను గప్పి, వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా డిసైడ్ అయ్యారు. కానీ ఈ విషయం నాజీ గూఢచారుల ద్వారా హిట్లర్‌కు తెలిసింది. అంతే.. హిట్లర్ కోపంతో ఊగిపోయాడు. తన డ్రైవర్ ఎమిల్ మారిస్‌ను తక్షణమే ఉద్యోగంలోంచి తీసేసి, గెలీని గదిలో వేసి ఘోరంగా హింసించాడని చరిత్రకారులు చెబుతారు.
తన అనుమతి లేకుండా ఏ మగాడి వైపు చూడటానికి వీల్లేదని ఆమెను హెచ్చరించాడు. ఈ ఘటన తర్వాత హిట్లర్, గెలీల మధ్య గొడవలు పీక్ స్టేజ్‌కు వెళ్లాయి. ఇక సెప్టెంబర్ 18, 1931 రాత్రి.. హిట్లర్ ఒక పొలిటికల్ మీటింగ్ కోసం బెర్లిన్ వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు. ఆ సమయంలో వియన్నా వెళ్లే విషయంపై హిట్లర్, గెలీల మధ్య పెద్ద గొడవ జరిగింది. "నువ్వు నన్ను ఇక్కడి నుంచి వెళ్లనివ్వవా?" అని గెలీ గట్టిగా అరిచింది. దానికి హిట్లర్ "నేను బ్రతికుండగా నిన్ను ఎక్కడికీ వెళ్లనివ్వను" అని గట్టిగా చెప్పి బెర్లిన్ వెళ్లిపోయాడు. కట్ చేస్తే.. మరుసటి రోజు ఉదయం గెలీ గది ఎంతకీ తెరుచుకోలేదు. అనుమానం వచ్చిన నాజీ అధికారులు తలుపులు బద్దలు కొట్టి చూసేసరికి.. గెలీ రౌబల్ మంచం పక్కన బోర్లా పడి ఉంది.
ఆమె గుండెల్లోంచి రక్తం కారుతోంది. పక్కనే హిట్లర్ కి చెందిన పవర్ ఫుల్ 'వాల్థర్' పిస్టల్ పడి ఉంది. ఈ వార్త తెలియగానే మ్యూనిచ్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ప్రాథమిక విచారణలో గెలీ ముక్కు విరిగిపోయి ఉందని, ఆమె శరీరంపై కొన్ని గాయాలు ఉన్నాయని తేలింది. అంటే చనిపోయే ముందు అక్కడ పెద్ద ఫైట్ జరిగిందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అంతేకాదు, గెలీ రాసిన ఒక సగం లెటర్ దొరికింది.. అందులో త్వరలోనే తాను వియన్నా వెళ్తున్నట్లు ఎంతో సంతోషంగా రాసుకుంది. అంత సంతోషంగా ఉన్న అమ్మాయి అకస్మాత్తుగా ఆత్మహత్య ఎందుకు చేసుకుంటుంది? కానీ, అప్పటికే హిట్లర్ జర్మనీలో ఒక పవర్ఫుల్ లీడర్.
నాజీ పార్టీ అగ్రనేతలు హెన్రిచ్ హిమ్లర్, హెర్మన్ గోరింగ్ రంగంలోకి దిగారు. పోలీసులపై, డాక్టర్లపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. పోస్ట్‌మార్టం కూడా సరిగ్గా జరగకుండా కేవలం కొన్ని గంటల్లోనే అది "ఆత్మహత్య" అని తేల్చేసి కేసును శాశ్వతంగా క్లోజ్ చేసేశారు. గెలీ మరణ వార్త వినగానే హిట్లర్ తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. తన జీవితంలో తాను అత్యంత ప్రేమించిన ఏకైక మహిళ గెలీ మాత్రమేనని హిట్లర్ స్వయంగా చెప్పుకున్నాడు. కొన్ని రోజుల పాటు అసలు అన్నం ముట్టలేదు, ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నించాడు. ఆమె మరణం తర్వాతే హిట్లర్ పూర్తిగా శాకాహారిగా మారిపోయాడు.
గెలీ ఉన్న గదిని ఒక టెంపుల్ లా మార్చేసి, ఆమె ఫోటోలను తన బెడ్రూమ్లో పెట్టుకున్నాడు. అయితే, గెలీ చనిపోయిన కొన్నాళ్లకే.. హిట్లర్ జీవితంలోకి 'ఐవా బ్రాన్' అనే మరో మహిళ వచ్చింది. విచిత్రం ఏంటంటే.. ఎవా బ్రాన్ కూడా హిట్లర్ పెట్టే మానసిక హింస తట్టుకోలేక తన జీవితంలో రెండుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఒక దేశాన్ని శాసించిన డిక్టేటర్, తన సొంత ఇంట్లోని ఒక మహిళను ఎంతలా మానసిక నరకానికి గురిచేశాడో. గెలీ రౌబల్ ది ఆత్మహత్యే అని నాజీలు నమ్మించినా.. హిట్లరే స్వయంగా ఆమెను కాల్చి చంపాడని లేదా నాజీ లీడర్లే ఆమెను హతమార్చారని నేటికీ చాలామంది నమ్ముతారు.