క్రైమ్ ప్రపంచంలో రోజుకో రకమైన వింతైన, భయంకరమైన కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగిన ఒక మర్డర్ మిస్టరీ వింటే.. "ఇదేం ట్విస్ట్ రా నాయనా" అని ముక్కున వేలేసుకోక తప్పదు. ఒక మహిళ తన భర్తను అత్యంత కిరాతకంగా ప్రియుడితో కలిసి చంపించేసింది. అసలు ఆమె చంపడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆ భర్త తన మొదటి భార్యతో మాట్లాడుతున్నాడని, ఆమెకు ఆర్థికంగా సహాయం చేస్తున్నాడని. కేవలం ఈ ఒక్క కారణంతో ప్రియుడిని ఇంటికి పిలిపించి, నిద్రపోతున్న భర్తను కత్తులతో పొడిపించి చంపేసింది. అంతటితో ఆగకుండా, ఆధారం దొరకకుండా శవాన్ని ఈ-రిక్షాలో తీసుకెళ్లి కాల్వలో పడేసింది.
లక్నో సౌత్ డీసీపీ మహ్మద్ ముస్తాక్, అడిషనల్ డీసీపీ రాళ్లపల్లి వసంత కుమార్ మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ కేసులో ప్రధాన నిందితురాలు సుఫియా బానో. ఈమెకు రామ్‌కిషోర్ వాల్మీకి అనే వ్యక్తితో గత నాలుగేళ్లుగా పరిచయం ఉంది. వీరిద్దరూ ప్రేమించుకుని, రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. అయితే రామ్‌కిషోర్‌కు అంతకుముందే కవితా దేవి అనే మహిళతో మొదటి వివాహం జరిగింది. పెళ్లయిన కొత్తలో అంతా బాగానే ఉన్నా.. కొన్నాళ్ల తర్వాత రామ్‌కిషోర్ మళ్లీ తన మొదటి భార్య కవితా దేవి దగ్గరకు వెళ్లడం ప్రారంభించాడు. ఆమెకు క్రమం తప్పకుండా డబ్బులు ఇస్తూ ఆర్థికంగా సాయం చేసేవాడు. ఈ విషయం రెండో భార్య సుఫియా బానోకు అస్సలు నచ్చలేదు. దీనివల్ల వారిద్దరి మధ్య రోజు ఇంట్లో గొడవలు జరగడం మొదలయ్యాయి.
ఈ గొడవల మధ్యనే సుఫియా బానోకు మున్నా అలియాస్ ముచ్చడ్ అనే యాభై రెండేళ్ల వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్త రామ్‌కిషోర్‌కు తెలిసిపోయింది. దీంతో ఇంట్లో గొడవలు మరింత ఎక్కువయ్యాయి. ఒకవైపు తనతో గొడవలు పడుతూ, మొదటి భార్యకు డబ్బులు ఇస్తున్న భర్తను ఎలాగైనా వదిలించుకోవాలని సుఫియా బానో డిసైడ్ అయింది. ఇందుకోసం తన ప్రియుడు మున్నా, అలాగే అతని స్నేహితుడైన మహ్మద్ ఇక్బాల్‌తో కలిసి భర్తను చంపడానికి ఒక పక్కా స్కెచ్ వేసింది. సెప్టెంబర్ 14 మరియు 15 మధ్య రాత్రి.. రామ్‌కిషోర్ ఇంట్లో గాఢ నిద్రలో ఉన్న సమయంలో, సుఫియా బానో ఇంటి తలుపులు తీసి ఉంచింది. ప్లాన్ ప్రకారం లోపలికి వచ్చిన ప్రియుడు మున్నా, అతని స్నేహితుడు నిద్రపోతున్న రామ్‌కిషోర్‌ను కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు.
హత్య చేసిన తర్వాత సాక్ష్యాలు దొరకకుండా సుఫియా బానో ఇల్లంతా క్లీన్ చేసింది. రక్తపు మరకలు ఉన్న నేలను ప్లాస్టర్ చేసి, రక్తం తుడిచిన చీపురును, భర్త బట్టలను, హత్యకు వాడిన కత్తిని దాచేసింది. ఆ తర్వాత సుఫియా బానో తన 16 ఏళ్ల మైనర్ కొడుకును కూడా పిలిచింది. నలుగురు కలిసి రామ్‌కిషోర్ శవాన్ని బెడ్ కింద ఉన్న ఒక పెద్ద చెక్క పెట్టెలో దాచారు. ఆ మరుసటి రోజు రాత్రి, ఎవరికీ అనుమానం రాకుండా ఆ పెట్టెను ఒక ఈ-రిక్షాపై లోడ్ చేశారు. కానఖా పరిధిలోని భవాఖడా దగ్గర ఉన్న ఒక కాల్వ వంతెన కిందకు తీసుకెళ్లి, శవాన్ని ఎవరూ గుర్తుపట్టకుండా కాల్వలో పడేసి సాక్ష్యాలను పూర్తిగా తుడిచేసే ప్రయత్నం చేశారు.
సెప్టెంబర్ 17న రామ్‌కిషోర్ మొదటి భార్య కవితా దేవి ఫిర్యాదుతో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఈ కేసును ఛేదించడానికి లక్నో పోలీసులు ఏకంగా నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. నిందితులు శవాన్ని తరలించిన రూట్ లో ఉన్న దాదాపు 170 నుండి 180 సీసీటీవీ కెమెరాల రికార్డింగులను జల్లెడ పట్టారు. టెక్నికల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఆ ఈ-రిక్షాను ట్రేస్ చేసి, చివరకు నిందితుల గుట్టురట్టు చేశారు. శుక్రవారం నాడు పోలీసులు రెండో భార్య సుఫియా బానో, ప్రియుడు మున్నా, సహాయకుడు ఇక్బాల్‌తో పాటు ఆ 16 ఏళ్ల మైనర్ కొడుకును కూడా అరెస్ట్ చేశారు. హత్యకు వాడిన ఆయుధాన్ని, శవాన్ని తరలించిన ఈ-రిక్షాను స్వాధీనం చేసుకున్నారు.