Top story: ఆరుగురిని చంపి.. చివరకు ఇలా శవమయ్యాడు తండ్రికి ఫోన్ చేసి.. మేనమామ ఊళ్లో శవమై..!

ఒకే ఒక్క రాత్రి.. మూడు వేర్వేరు ప్రాంతాలు.. ఆరుగురు అమాయకుల ప్రాణాలు బలి. అవును, తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఇటీవలి కాలంలో అత్యంత కిరాతకమైన సామూహిక హత్యలతో రంగారెడ్డి జిల్లా షాబాద్ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

Post Published By: dialnews
Updated : 14 July 2026, 12:30 PM IST

ఒకే ఒక్క రాత్రి.. మూడు వేర్వేరు ప్రాంతాలు.. ఆరుగురు అమాయకుల ప్రాణాలు బలి. అవును, తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఇటీవలి కాలంలో అత్యంత కిరాతకమైన సామూహిక హత్యలతో రంగారెడ్డి జిల్లా షాబాద్ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? తన కన్న బిడ్డలను, భార్యను కూడా చూడకుండా ఒకే రాత్రి ఆరుగురిని నరికి చంపిన ఆ నరహంతకుడు ఎవరు? అతడి కోసం రెండు రాష్ట్రాల పోలీసులు ఎందుకు వేటాడాల్సి వచ్చింది? చివరకు ఆ నరహంతకుడి ముగింపు ఎలా జరిగింది?ఈ దారుణమైన కథ జూలై 10వ తేదీ అర్ధరాత్రి ప్రారంభమైంది.

షాబాద్‌కు చెందిన రాజ్ కుమార్ అనే వ్యక్తి ఒక్కసారిగా సైకోలా మారిపోయాడు. తనపై నమోదైన ఒక పోక్సో కేసు విషయంలో తీవ్రమైన కక్ష, ఆగ్రహంతో రగిలిపోతున్న రాజ్ కుమార్ ప్రతీకారం తీర్చుకోవాలని డిసైడ్ అయ్యాడు.అనుకున్నదే తడవుగా.. జూలై 10 అర్ధరాత్రి పూట, ఆ పోక్సో కేసుకు సంబంధించిన ఒక మైనర్ బాలిక ఇంటికి వెళ్లాడు. అక్కడ నిద్రిస్తున్న ఆ బాలిక తల్లిపై, అలాగే నాయనమ్మపై అత్యంత కిరాతకంగా దాడి చేసి, వారిద్దరినీ అక్కడికక్కడే హతమార్చాడు. అంతటితో ఆ రాక్షసుడి పగ చల్లారలేదు. ఆ మైనర్ బాలికను బలవంతంగా లాక్కెళ్లి, సమీపంలోని అఖిల్ సాగర్ చెరువు ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఏమాత్రం జాలి లేకుండా ఆ బాలిక గొంతుకోసి అత్యంత దారుణంగా చంపేశాడు.

బయట ముగ్గురిని చంపిన తర్వాత కూడా రాజ్ కుమార్ లోని క్రూరత్వం తగ్గలేదు. అక్కడి నుంచి నేరుగా తన స్వగృహానికి చేరుకున్నాడు. తను చేసిన పాపం ఎక్కడ బయటపడుతుందో అనే భయమో.. లేక సైకోలా మారాడో తెలీదు కానీ, కట్టుకున్న భార్యను.. కన్న బిడ్డలని కూడా చూడలేదు. తన ఇంట్లో ఉన్న తన భార్యను, అలాగే తన ఇద్దరు అమాయక పిల్లలను కూడా అదే రాత్రి అత్యంత దారుణంగా నరికి చంపేశాడు.ఒకే ఒక్క రాత్రి.. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే మూడు వేర్వేరు చోట్ల మొత్తం ఆరుగురిని మట్టుబెట్టాడు. మరుసటి రోజు ఉదయం ఈ విషయం వెలుగులోకి రావడంతో షాబాద్ పట్టణమే కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్రం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఒకే వ్యక్తి ఆరుగురిని చంపేసి పరారు కావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

ఈ వరుస హత్యలను తెలంగాణ పోలీసులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నిందితుడు రాజ్ కుమార్ కోసం రంగంలోకి దిగారు. అతడిని పట్టుకోవడానికి ఏకంగా 12 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రమైన కర్ణాటక సరిహద్దుల్లో కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రాజ్ కుమార్ కోసం లుకౌట్ నోటీసులు జారీ చేయడమే కాకుండా, అతడి ఆచూకీ తెలిపిన వారికి రూ. 2 లక్షల నగదు బహుమతి కూడా ప్రకటించారు.అయితే, హత్యలు చేసిన వెంటనే రాజ్ కుమార్ తన తండ్రికి ఫోన్ చేసి, "నేను కూడా చనిపోతున్నా" అని చెప్పాడు. ఆ తర్వాత తిమ్మాపూర్ రైల్వే ట్రాక్ సమీపంలో తను ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించే ప్రయత్నం చేసి, పోలీసుల కళ్లు గప్పి అక్కడి నుంచి తెలివిగా తప్పించుకున్నాడు. దీంతో పోలీసులు టెక్నాలజీ, సీసీటీవీ విజువల్స్ మరియు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతడి కోసం వేటను మరింత తీవ్రం చేశారు.

గత మూడు రోజులుగా పోలీసుల వేట సాగుతున్న తరుణంలో.. ఈ రోజు అంటే జూలై 13 సోమవారం నాడు ఈ కేసులో ఊహించని పెద్ద మలుపు చోటుచేసుకుంది. కొత్తూరు మండలం పెంజర్ల గ్రామ సమీపంలో ఉన్న ఒక ఖాళీ వెంచర్ వద్ద ఒక వ్యక్తి మృతదేహం పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ శవాన్ని పరిశీలించగా.. అది మరెవరో కాదు, గత మూడు రోజులుగా పోలీసులు వెతుకుతున్న ప్రధాన నిందితుడు రాజ్ కుమార్ మృతదేహమేనని నిర్ధారించారు. ఆ మృతదేహం పక్కనే ఒక విషం బాటిల్ కూడా లభ్యమైంది.

పోలీసుల వేట తీవ్రమవ్వడం, తప్పించుకునే దారి లేకపోవడంతో తన మేనమామ ఊరైన పెంజర్ల సమీపంలో రాజ్ కుమార్ విషం తాగి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. రాజ్ కుమార్ మరణంతో ఆరుగురిని బలితీసుకున్న నరహంతకుడి కోసం సాగిన పోలీసుల వేట అయితే ముగిసింది. కానీ, అతడు పరారీలో ఉన్న ఈ మూడు రోజులు ఎక్కడెక్కడ తిరిగాడు? అతనికి ఎవరైనా ఆశ్రయం ఇచ్చారా? అలాగే అతడి మరణానికి గల ఖచ్చితమైన కారణాలు ఏంటి? అనే కోణాల్లో పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని అధికారిక వివరాలు తెలియనున్నాయి. ఏదేమైనా ఆరుగురిని చంపిన నిందితుడు ఇలా విషం తాగి చావడంపై స్థానికులు 'పాపం పండి కుక్క చావు చచ్చాడు' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Published : 
  • 14 July 2026, 12:30 PM IST