అమెరికాలో చదువుకుని, అక్కడే స్థిరపడాలనేది లక్షలాది మంది భారతీయ విద్యార్థుల జీవిత కాల స్వప్నం. కానీ, ఇప్పుడు ఆ కలలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కోలుకోలేని దెబ్బ కొట్టబోతోంది. యూఎస్ వీసాలు, ముఖ్యంగా అంతర్జాతీయ విద్యార్థుల పోస్ట్-స్టడీ వర్క్ పర్మిట్లపై ట్రంప్ యంత్రాంగం అత్యంత కఠినమైన, సంచలన నిర్ణయాలు తీసుకోబోతోంది. దీనివల్ల రాబోయే రోజుల్లో అమెరికాలో చదువుకోవడం, ఉద్యోగం సంపాదించడం ఊహించని రీతిలో కష్టతరం కానుంది. అసలు విద్యార్థుల నెత్తిన ట్రంప్ మోపబోతున్న ఆ రూ. 95 లక్షల భారీ భారం ఏంటి? వీసా నిబంధనల్లో తీసుకొస్తున్న కొత్త మార్పులు ఏంటి? దీనివల్ల మన తెలుగు రాష్ట్రాల విద్యార్థులపై ఎలాంటి ప్రభావం పడబోతోంది?
అసలు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం అమెరికా ప్రభుత్వం పరిశీలిస్తున్న ఆ మైండ్ బ్లాయింగ్ ప్రతిపాదన ఏంటంటే.. యూఎస్‌లో చదువు పూర్తయిన తర్వాత అంతర్జాతీయ విద్యార్థులు అక్కడ ఉద్యోగం చేయాలంటే ఏకంగా 100,000 అమెరికన్ డాలర్ల భారీ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మన భారతీయ కరెన్సీలో దీని విలువ అక్షరాలా సుమారు రూ. 95 లక్షలు. సాధారణంగా చదువు పూర్తయ్యాక విద్యార్థులు 'ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్' లేదా OPT అనే ప్రోగ్రామ్ కింద ఒకటి నుండి మూడేళ్ల పాటు అమెరికాలో ఉండి ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడీ OPT అవకాశానికి ట్రంప్ ప్రభుత్వం ఈ భారీ ప్రైస్ ట్యాగ్‌ను తగిలించాలని చూస్తోంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఈ ప్రతిపాదనపై తీవ్రంగా చర్చిస్తోంది. అయితే ఈ 95 లక్షల రూపాయల ఫీజును విద్యార్థి కట్టాలా, లేదా వారిని చేర్చుకునే కంపెనీ కట్టాలా అనే దానిపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు.
ఈ ప్రతిపాదన గనుక చట్టంగా మారితే, అది భారతీయ విద్యార్థుల భవిష్యత్తును ఎలా మార్చేస్తుందో ఒకసారి ఆలోచించండి. సాధారణంగా మన దేశం నుండి వెళ్లే విద్యార్థులు లక్షల్లో, కొన్నిసార్లు కోట్లలో అప్పులు చేసి మరి అమెరికాలో చదువుకుంటారు. చదువు అయిపోయాక OPT ద్వారా వచ్చే జీతంతో ఆ అప్పులను తీర్చుకుని, కెరీర్ బిల్డ్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు అదనంగా ఈ 95 లక్షల ఫీజు భారం పడితే.. విద్యార్థులు అంత డబ్బు భరించడం అసాధ్యం. ఒకవేళ ఈ ఫీజు కంపెనీలే కట్టాలని రూల్ పెడితే.. ఏ అమెరికన్ కంపెనీ కూడా అంత పెద్ద మొత్తాన్ని ఖర్చు పెట్టి విదేశీ విద్యార్థులను ఉద్యోగాల్లోకి తీసుకోదు. వారి కంటే స్థానికంగా ఉండే అమెరికన్లకే ఉద్యోగాల్లో మొదటి ప్రాధాన్యత ఇస్తారు. దీనివల్ల అమెరికా వెళ్లి చదువుకోవాలనే క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా తగ్గిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కేవలం 95 లక్షల ఫీజు మాత్రమే కాదు.. ట్రంప్ ప్రభుత్వం మరో పెద్ద షాక్ కూడా ఇవ్వబోతోంది. ఇప్పటివరకు అమెరికాలో చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులకు 'డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్' అనే సిస్టమ్ ఉండేది. అంటే మీరు కాలేజీలో చదువుతున్నంత కాలం, మీ వీసా రూల్స్ పాటిస్తున్నంత కాలం అమెరికాలో ఎన్ని ఏళ్లయినా ఉండొచ్చు, ఎటువంటి ఫిక్స్‌డ్ ఎండ్ డేట్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఆ పాత వ్యవస్థకు స్వస్తి పలుకుతూ కొత్త నిబంధన తీసుకురాబోతున్నారు. దీని ప్రకారం అంతర్జాతీయ విద్యార్థులకు గరిష్టంగా కేవలం 4 ఏళ్ల పాటు మాత్రమే అమెరికాలో ఉండేందుకు అనుమతి ఇస్తారు. ఒకవేళ మీ డిగ్రీ, పీహెచ్‌డీ లేదా మెడికల్ రీసెర్చ్ పూర్తి కావడానికి 4 ఏళ్ల కంటే ఎక్కువ సమయం పడితే.. మీకు ఆటోమేటిక్‌గా అక్కడ ఉండే హక్కు ఉండదు.
మీరు మళ్లీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీకి అప్లై చేసుకుని ఎక్స్‌టెన్షన్ పొందాల్సి ఉంటుంది. అసలు అమెరికా ప్రభుత్వం ఈ తరహా కఠినమైన మార్పులను ఎందుకు తీసుకురావాలని చూస్తోంది? ట్రంప్ ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం.. దేశ ఇమ్మిగ్రేషన్ చట్టాలను మరింత బలోపేతం చేయడానికి, జాతీయ భద్రతను మెరుగుపరచడానికి అలాగే లీగల్ ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను దుర్వినియోగం కాకుండా కాపాడటానికే ఈ చర్యలు తీసుకుంటున్నారట. గత కొన్నాళ్లుగా కేవలం స్టూడెంట్ వీసాల పైనే కాకుండా, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు అత్యంత కీలకమైన H-1B వర్క్ వీసా వ్యవస్థలో కూడా చాలా కఠినమైన మార్పులను ట్రంప్ సర్కార్ అమలు చేస్తూ వస్తోంది. ఈ OPT ప్రోగ్రామ్‌కు సంబంధించి ఈ ఏడాది చివర్లో మరికొన్ని కొత్త నిబంధనలను కూడా ప్రవేశపెట్టే యోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుతం అమెరికాలో 3.3 లక్షల కంటే ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే ప్రస్తుతం అమెరికా వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్న విద్యార్థులు ఇప్పుడే కంగారుపడి తమ ప్లాన్స్ మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ $100,000 ఫీజు అనేది కేవలం ఒక ప్రతిపాదన దశలోనే ఉంది, దీనిపై ఇంకా ఎలాంటి అంతిమ నిర్ణయం తీసుకోలేదు. అలాగే ఈ 4 ఏళ్ల వీసా పరిమితి రూల్ కూడా కాంగ్రెస్ ఆమోదం పొందాకే చట్టంగా మారుతుంది. కాకపోతే రాబోయే రోజుల్లో యూఎస్ ఇమ్మిగ్రేషన్ పాలసీలు మరింత ఖరీదైనవిగా, కఠినమైనవిగా మారబోతున్నాయనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది.