వేల కోట్ల రూపాయల అప్పుల నుంచి తప్పించుకోవడానికి పారిశ్రామికవేత్తలు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్.. NCLT రీసెంట్‌గా ఇచ్చిన ఒక సంచలనాత్మక తీర్పు.. ఇప్పుడు దేశీయ బ్యాంకింగ్, కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. జీ మీడియా, ఎస్సెల్ గ్రూప్ వ్యవస్థాపకుడు డాక్టర్ సుభాష్ చంద్రకు సంబంధించిన వ్యక్తిగత దివాలా కేసులో NCLT ఆమోదించిన రీ పేమెంట్ ప్లాన్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సుభాష్ చంద్ర వివిధ ఎస్సెల్ గ్రూప్ కంపెనీల కోసం ఇచ్చిన వ్యక్తిగత పూచీకత్తులు ప్రాతిపదికన, బ్యాంకులు మరియు వివిధ రుణదాతలు మొత్తం 22 వేల 57 కోట్ల మేర క్లెయిమ్‌లు దాఖలు చేశారు. అయితే, వీటి పరిపరిష్కారానికి సుభాష్ చంద్ర ప్రతిపాదించిన ప్రణాళిక ప్రకారం ఆయన చెల్లించేది కేవలం 6.25 కోట్లు మాత్రమే. ప్రాసెస్ ఖర్చుల కోసం మరొక 25 లక్షలు కలిపి మొత్తం 6.50 కోట్లతో కేసు ముగిసేలా ప్లాన్ రూపొందించారు.
అంటే రుణదాతల క్లెయిమ్‌లలో ఏకంగా 99.97 శాతం తగ్గిపోయింది. ఇంతటి భారీ రుణాల మాఫీ ప్రక్రియ ఎలా సాధ్యమైందనే విషయం పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇన్సోల్వెన్సీ అండ్ బ్యాంక్‌రప్సీ కోడ్ ప్రకారం.. రుణ పరిష్కార ప్రణాళికకు ఆమోదం లభించాలంటే రుణదాతల కమిటీలో కనీసం 75 శాతం ఓటింగ్ లభించాలి. ఈ ప్రక్రియలో సుభాష్ చంద్ర ప్రతిపాదించిన 6.5 కోట్ల చెల్లింపు ప్లాన్‌కు 80.81 శాతం మంది రుణదాతలు ఓటు వేసి ఆమోదం తెలిపారు. అయితే, ఈ ప్లాన్‌కు మద్దతుగా ఓటు వేసిన ప్రధాన కంపెనీల్లో ఐదు సంస్థలు సుభాష్ చంద్ర కుటుంబసభ్యులు, సన్నిహితులు, అనుబంధ గ్రూపులకే చెందినవని బ్యాంకులు ఆరోపిస్తున్నాయి. ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్న వీనా ఇన్వెస్ట్‌మెంట్స్, వరల్డ్ క్రెస్ట్ అడ్వైజర్స్, డైరెక్ట్ మీడియా డిస్ట్రిబ్యూషన్, లెమనేడ్ క్యాపిటల్ అడ్వైజర్స్, కార్ప్‌కాల్ క్యాపిటల్ వంటి 5 కంపెనీలకు ఏకంగా 61.78 శాతం ఓటింగ్ హక్కులు ఉన్నాయి. వీనా ఇన్వెస్ట్‌మెంట్స్ సుభాష్ చంద్ర సోదరుడైన జవహర్ గోయల్ భార్య సుశీలా దేవి నియంత్రణలో ఉందనే ఆరోపణలు ఉన్నాయి.
ఇన్సోల్వెన్సీ నిబంధనల ప్రకారం.. అప్పు తీసుకున్న వ్యక్తికి చెందిన "సంబంధిత వ్యక్తులు, సంస్థలు" ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనకూడదు. కానీ, రిజల్యూషన్ ప్రొఫెషనల్, NCLT సాంకేతిక వ్యత్యాసాల ఆధారంగా వీటిని 'అసోసియేట్' కంపెనీలుగా పరిగణించకపోవడంతో అవి ఓటింగ్ వేసే అవకాశం లభించింది. ప్రభుత్వ మరియు ప్రైవేట్ బ్యాంకుల వాదన ప్రకారం.. ఈ కుటుంబ అనుబంధ కంపెనీలు సుభాష్ చంద్రకు గానీ, ఆయన సంస్థలకు గానీ ఎటువంటి ప్రత్యక్ష అప్పులు ఇవ్వలేదు. అయినప్పటికీ, సుభాష్ చంద్ర వ్యక్తిగతంగా హామీ ఇచ్చారనే నెపంతో సుమారు 1,260 మంది వ్యక్తుల ప్రతిపాదనలతో పాటు ఈ కంపెనీలను రుణదాతల జాబితాలో చేర్చారు. ఎటువంటి సరైన ధ్రువీకరణ పత్రాలు లేకుండానే రిజల్యూషన్ ప్రొఫెషనల్ ఈ క్లెయిమ్‌లను ఆమోదించారని, వీటికి ఓటింగ్ హక్కులు కల్పించారని బ్యాంకులు ఆరోపిస్తున్నాయి. HDFC బ్యాంక్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆక్సిస్ బ్యాంక్, LIC హౌసింగ్ ఫైనాన్స్ వంటి ప్రముఖ బ్యాంకులు సుభాష్ చంద్ర ప్రతిపాదించిన ఈ స్వల్ప చెల్లింపుల ప్లాన్‌ను తీవ్రంగా వ్యతిరేకించాయి.
ఈ బ్యాంకులకు ఓటింగ్ ప్రక్రియలో కేవలం 19.18 శాతం ఓటింగ్ హక్కులు మాత్రమే దక్కడంతో, 61% ఓటింగ్ బలం ఉన్న కుటుంబ కంపెనీల మద్దతుతో ప్లాన్ సులభంగా ఆమోదం పొందింది. ఉదాహరణకు ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ 1,322 కోట్ల క్లెయిమ్ దాఖలు చేస్తే, ఈ ప్లాన్ ప్రకారం దానికి దక్కేది కేవలం రూ. 38 లక్షలు మాత్రమే. ఈ వివాదంపై సుభాష్ చంద్ర వెర్షన్ వేరేలా ఉంది. 22 వేల కోట్ల అప్పు అనే ప్రచారం తప్పుదారి పట్టించేలా ఉందంటున్నారు సుభాష్ చంద్ర. తాను కేవలం కంపెనీల రుణాలకు వ్యక్తిగత పూచీకత్తుగా ఉన్నానని, తన అసలు వ్యక్తిగత బాధ్యత 3 వేల 992 కోట్లు మాత్రమేనని తెలిపారు. ఎస్సెల్ గ్రూప్ ఇప్పటికే తన ఆస్తులను విక్రయించి గతంలో 43 వేల కోట్ల మేర రుణాలు చెల్లించిందని, ఇబ్బందుల్లో ఉన్న ఇతర సంస్థల రుణాల చెల్లింపులపై చర్చలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు.
రుణదాతలకు దక్కాల్సిన వేల కోట్ల రూపాయల బకాయిలను తుంగలో తొక్కి, కేవలం 6.5 కోట్లతో ప్రక్రియను ముగించడం వల్ల చట్టంలోని లొసుగులను దుర్వినియోగం చేసినట్లవుతుందని బ్యాంకింగ్ రంగానికి చెందిన నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏంటి అప్పులు ఇలా కూడా ఎగ్గొడతారా అంటూ ఈ విషయం తెలిసిన వాళ్లు షాక్ అవుతున్నారు. ఈ NCLT తీర్పుపై నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ లేదా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు HDFC, కెనరా బ్యాంక్ తదితర బ్యాంకులు సిద్ధమవుతున్నాయి. ఈ కేసు తేలే ఫలితం భవిష్యత్తులో దివాలా చట్టం అమలుపై, బ్యాంకుల రుణ రికవరీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.