ప్రస్తుతం సోషల్ మీడియాలో రష్మిక మందన్న మరియు విజయ్ దేవరకొండకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త తెగ వైరల్ అవుతోంది. రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'మైసా' కు సంబంధించిన పోస్టర్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్లో రష్మిక గెటప్ చూసి మురిసిపోయిన విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టా స్టోరీలో సరదాగా స్పందించారు. 'వాయిలెంట్ పిల్లా.. ఈ చిత్రంతో నీ అభిమానులు గర్వపడేలా చేస్తావు' అంటూ ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
రవీంద్ర పుల్లె దర్శకత్వంలో 'అన్ఫార్చులా ఫిల్మ్స్' సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా నవంబరు 27న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.ఇదిలా ఉండగా, ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కూడా తుది దశకు చేరుకున్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కేవలం 12 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉన్నట్లు చిత్రవర్గాలు వెల్లడించాయి.
ఇటీవల సెట్స్‌లో ఒక పవర్ పుల్ పోరాట సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో రష్మిక స్వల్పంగా గాయపడినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆమె త్వరగానే కోలుకుని తిరిగి షూటింగ్లో పాల్గొంటారని చిత్రబృందం స్పష్టం చేసింది. మిగిలిన చివరి దశ చిత్రీకరణను కూడా త్వరలోనే పూర్తి చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. విజయ్ దేవరకొండ సపోర్ట్, రష్మిక వైలెంట్ యాక్షన్ లుక్ తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.