విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైసిపి నేత, బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీను ఎవరు ఊహించని విధంగా, ఎవరికీ తెలియకుండా... అకస్మాత్తుగా టిడిపిలో చేరిపోయారు.కనీసం విజయనగరం టిడిపి నేతలుకు కూడా సమాచారం లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎదుట ప్రత్యక్షమై ఆయన కుమార్తెతో కలిసి టిడిపిలో చేరారు. ఇది వైసీపీ కంటే విజయనగరం టిడిపి నేతలకే పెద్ద షాక్. మజ్జి శ్రీను అలియాస్ చిన్న శీను , డాన్ శీనువిజయనగరం జిల్లాలో వైసీపీకి అన్ని రకాలుగా బలమైన నేత.కరుడుగట్టిన జగన్ ఫాలోయర్. చంద్రబాబుకు బద్ధ వ్యతిరేకి. విజయనగరం టిడిపి నేతలు అందరికీ కాలిలో ముల్లులాంటోడు. అలాంటి వాడిని స్థానిక సంస్థల ఎన్నికల ముందు.... ఎవ్వరికి ముందస్తు సమాచారం లేకుండా రహస్యంగా తీసుకొచ్చి చేర్చుకోవాల్సిన అవసరం ఏముంది అని విజయనగరం టిడిపి నేతలు రగిలిపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని ప్రోటోకాల్స్ ఫాలో అవుతూ ఉంటారు. ఎవరైనా వేరే పార్టీ నేతలని తీసుకొచ్చినప్పుడు ఆ జిల్లా నేతలతో మాట్లాడి చర్చించి వాళ్లను ఒప్పించి నిర్ణయం తీసుకుంటారు. ఈ సంప్రదాయానికి భిన్నంగా టిడిపి నేతలు ఎవరిని పరిగణనలోకి తీసుకోకుండా చిన్న శీను ని నేరుగా తీసుకొచ్చి పార్టీలో చేర్చేశారు. ఈ వ్యవహారాన్ని మొత్తం రాజ్యసభ సభ్యుడు, లోకేష్ కి సన్నిహితుడైన సానా సతీష్ నడిపించారు.
విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ చిన్న శీనుకి... మేనమామ బొత్స సత్యనారాయణ కి చాలా రోజులుగా విభేదాలు ఉన్నాయి. విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర ఇన్చార్జిగా ఉన్నప్పుడు శ్రీను ని చేరదీసి బొత్స కి వ్యతిరేకంగా సానపట్టారు. అప్పటినుండి మేనల్లుడు ...మేనమామ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గు మంటుంది. మరోవైపు బొత్స తన కుమార్తె అనూష ని విజయనగరం జడ్పిటిసి చైర్మన్ కోసం సిద్ధం చేస్తున్నారు. మజ్జి శీను కూడా
తన రెండో భార్య కుమార్తె సిరి సహస్రానీ జడ్పీ చైర్మన్ చేయాలనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో లిక్కర్ రవాణా కేసులో ఇరుక్కున్నారు చిన్న శీను. బొత్స తో విభేదాలు, లిక్కర్ కేసులో ఈడీ పిలుపు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పార్టీ మారిపోవడమే మంచిదనుకున్నారు. విజయ నగరం జడ్పీ చైర్మన్ వైసీపీ సీటు ఎలాగూ బొత్స కూతురు అనూష కే ఇస్తారు.... ఆమెని తాను గెలిపించాల్సి వస్తుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తన పాత మిత్రుడైన సానా సతీష్ ద్వారా.... లోకేష్ ని చంద్రబాబును ఒప్పించి టిడిపిలో దూరిపోయారు మజ్జి శ్రీను.
ఈ హఠాత్పరిణామం టిడిపి నేతలకు ఎవరికీ మింగుడు పడడం లేదు. విజయనగరంలో అరాచకాలకు పేరు మజ్జి శ్రీనివాసరావు.
ఇసుక, మట్టి వ్యవహారాలతో పాటు కాంట్రాక్టులు, కమిషన్లు ఇలా ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. కొన్ని సంవత్సరాలుగా విజయనగరం టిడిపి నేతలు బొత్స పై కంటే ఆయన మేనల్లుడు పైనే నిత్యం ఆరోపణలు చేస్తూ వచ్చారు. చిన్న శీను కూడా నిత్యం చంద్రబాబుని, విజయనగరం టిడిపి నేతలునీ దుమ్మెత్తి పోస్తూనే ఉంటారు. అలాంటి నాయకుడుతో రేపటి నుంచి కలిసి ఎలా తిరగాలి అన్నది విజయనగరం టిడిపి నేతల ను కలచివేస్తుంది.మజ్జి శ్రీనుకి లేదా ఆయన కుమార్తె కి జడ్పీ చైర్మన్ పోస్ట్ ఇచ్చేస్తే స్థానిక టిడిపి నేతల పరిస్థితి ఏమిటి అని జుట్టు పీక్కుంటున్నారు విజయనగరం టిడిపి పెద్దలు.
జగన్ ఐదేళ్ల పాలనలో తమను అష్ట కష్టాలు పెట్టిన డాన్ శ్రీను తో ఇప్పుడు ఎలా కలిసి పని చేయాలన్నది టిడిపి నేతల ఆవేదన. చిన్న శీను ని టిడిపిలో చేర్చుకునే విషయాన్ని జిల్లా నేతలతో చర్చిస్తే వాళ్ళు వ్యతిరేకిస్తారు కనుక... ఎవరికీ తెలియకుండా చేర్చుకోవాలని అధిష్టానం భావించి ఉండొచ్చు. శీను ని చేర్చుకోవడం అంటే ఒక ముసలాన్ని తీసుకొచ్చి జిల్లా పార్టీలో పెట్టుకున్నట్లేనని టిడిపి నేతలు లబోదిబోమంటున్నారు. సహజంగానే మజ్జి శీను కి దూకుడు ఎక్కువ. అతనికి రకరకాల ఆదాయ మార్గాలు కూడా తెలుసు. ఇలాంటి లీడర్లు టిడిపిలోకి వస్తే... కాస్త పెద్దరికంతో పార్టీని నడిపించే మిగిలిన నాయకులు అంతా అవుట్ డేటెడ్ అయిపోరా....? రేపు భవిష్యత్తులో మజ్జి సీనుకే అధిష్టానం ప్రాధాన్యమిస్తే.... తమ పరిస్థితి ఏమిటి అన్నది విజయనగరం టిడిపి నేతల ఆందోళన. కానీ లోకేష్ ఇవేమీ ఆలోచించడం లేదు. స్థానిక సంస్థలు ఎన్నికలు, ఆ తర్వాత వచ్చే 2029 అసెంబ్లీ ఎన్నికలు లో బొత్స సత్యనారాయణ నీ కొట్టాలి అంటే అంతే దూకుడుతో పనిచేసే, సొంతంగా ఆదాయ వనరులు సమకూర్చుకునే చిన్న శీను లాంటి వాళ్లు అవసరమని టిడిపి అధినేత భావిస్తున్నారు.