గత కొన్నాళ్ళుగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఒకప్పుడు అత్యంత ఆప్తుడిగా, ఆ పార్టీలో నంబర్ టూ స్థానంలో ఉన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గుప్పించిన విమర్శలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నాయి. వైసీపీ నుండి బయటకు వచ్చి సరికొత్త ప్రాంతీయ పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్న విజయసాయిరెడ్డి.. రీసెంట్‌గా వైసీపీలో జరిగిన మత మార్పిడులపై అత్యంత ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల ముందు వైసీపీకి చెందిన ఒక మాజీ, సీనియర్ ఎమ్మెల్యే చేసిన ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ ఆయన సంధించిన ప్రశ్నలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
2024 ఎన్నికల ముందు వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే చేసిన ఆ ప్రసంగంపై రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, టీడీపీ, జనసేన, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం తమ స్టాండ్ ఏంటో స్పష్టం చేయాలని విజయసాయిరెడ్డి బహిరంగంగా డిమాండ్ చేశారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం, ఓట్ల వేట కోసమే హిందువుల మత మార్పిడిలను గత ప్రభుత్వం ప్రోత్సహించిందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాదు, గతంలో ఎంతమంది నాయకులు ఎమ్మెల్యే టికెట్ల కోసం, ఆ తర్వాత వైఎస్ జగన్ ప్రభుత్వంలో మంత్రి పదవులను దక్కించుకోవడం కోసం.. జగన్ గారిని ఆకట్టుకోవడానికి మతాలు మార్చుకున్నారో సమాధానం చెప్పాలంటూ విజయసాయిరెడ్డి సవాల్ విసిరారు.
ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో నంబర్ వన్ ఎవరైతే ఉన్నారో, వారే దీనికి సమాధానం చెప్పాలని విజయసాయిరెడ్డి నిలదీశారు. వైఎస్సార్ కుటుంబం క్రైస్తవ మతాన్ని స్వీకరించినప్పటికీ, రాజకీయాల కోసం "రెడ్డి" అనే కుల గుర్తింపును వాడుకుంటోందని ఆయన నేరుగా విమర్శలు గుప్పించారు. అయితే ఈ వ్యాఖ్యలపై వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. జగన్ అన్ని మతాలను గౌరవిస్తారని, ఒకవేళ జగన్‌కు మతమార్పిడి చేసే ఉద్దేశమే ఉంటే.. ఇన్నేళ్లు ఆయనతో కలిసి ఉన్న విజయసాయిరెడ్డినే మొదట మార్చేవారంటూ ఎద్దేవా చేశారు. మరోవైపు, కూటమి ప్రభుత్వం కూడా గత వైసీపీ హయాంలో ఒత్తిడితో కూడిన మత మార్పిడులు జరిగాయంటూ వస్తున్న ఆరోపణలపై సీరియస్ గా విచారణ జరుపుతోంది. సొంత పార్టీ పెట్టబోతున్న వేళ విజయసాయిరెడ్డి హిందూ కార్డును చేతబట్టడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.