Top story: మక్కాపై హౌతీల డ్రోన్ల దాడి..? సౌదీపై క్షిపణులు వర్షం సౌదీకి అమెరికా హ్యాండ్ ఇచ్చిందా..? అసలు ఏం జరుగుతోంది?

ముస్లింల అత్యంత పవిత్రమైన నగరం.. ప్రతి ఏటా కోట్లాది మంది భక్తులు సందర్శించే శాంతి నిలయం.. పవిత్ర మక్కా నగరం చరిత్రలోనే మున్నెన్నడూ లేని విధంగా ఒక ఉలిక్కిపాటుకు గురైంది. అవును, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మక్కా నగరంలో తొలిసారిగా ‘ఎయిర్ రైడ్ అలర్ట్’ అంటే వైమానిక దాడి హెచ్చరికలు జారీ అయ్యాయి

Post Published By: dialnews
Updated : 17 September 2026, 8:30 PM IST

ముస్లింల అత్యంత పవిత్రమైన నగరం.. ప్రతి ఏటా కోట్లాది మంది భక్తులు సందర్శించే శాంతి నిలయం.. పవిత్ర మక్కా నగరం చరిత్రలోనే మున్నెన్నడూ లేని విధంగా ఒక ఉలిక్కిపాటుకు గురైంది. అవును, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మక్కా నగరంలో తొలిసారిగా ‘ఎయిర్ రైడ్ అలర్ట్’ అంటే వైమానిక దాడి హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆకాశం నుండి ఎప్పుడైనా ప్రమాదం ముంచుకురావచ్చని సౌదీ అరేబియా ప్రభుత్వం అక్కడ అత్యవసర హెచ్చరికలు ప్రకటించింది. అసలు ప్రశాంతంగా ఉండే మక్కా నగరంలో ఈ అలర్ట్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది..? సౌదీ సరిహద్దు దేశమైన యెమెన్ నుండి దూసుకొస్తున్న క్షిపణులు, డ్రోన్ల కథేంటి..?

వివరాల్లోకి వెళ్తే.. సౌదీ అరేబియా పశ్చిమ తీరంలోని అత్యంత కీలకమైన నగరాల్లో ఒక్కసారిగా సైరన్లు మోగాయి. సౌదీ పౌర రక్షణ విభాగం పవిత్ర నగరమైన మక్కాతో పాటు, పక్కనే ఉన్న జెద్దా, తైఫ్ గవర్నరేట్లలో హై అలర్ట్ ప్రకటించింది. నేషనల్ ఎర్లీ వార్నింగ్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ప్రజల మొబైల్స్ కు ప్రమాద సంకేతాలు పంపారు. ఆకాశం నుండి డ్రోన్లు లేదా బాలిస్టిక్ క్షిపణులు దాడి చేసే అవకాశం ఉందని, ప్రజలంతా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. అయితే, అధికారులు ఈ అలర్ట్ ప్రకటించిన కొద్దిసేపటికే.. ప్రమాదం తప్పిందని, పరిస్థితి అదుపులోనే ఉందని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

అత్యవసరమైతే emergency services నంబర్ కు కాల్ చేయాలని కోరారు. కానీ, ఈ కొద్దిపాటి సమయమే సౌదీ రక్షణ వ్యవస్థను, అక్కడి ప్రజలను ఉత్కంఠకు గురిచేసింది. ఉద్రిక్తతల తీవ్రత ఎంతలా ఉందంటే.. పక్కనే ఉన్న మదీనా అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చే విమాన సర్వీసులను కూడా తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. అసలు ఇంతకీ ఈ దాడులకు కారణం ఎవరు…? వారే యెమెన్ దేశానికి చెందిన ‘హౌతీ తిరుగుబాటుదారులు’.

వీరికి ఇరాన్ దేశం వెనుక ఉండి ఆయుధాలు, నిధులు సమకూరుస్తోందని అంతర్జాతీయ నిపుణులు చెబుతుంటారు. గడిచిన కొద్ది రోజులుగా ఈ హౌతీలు సౌదీ అరేబియాను టార్గెట్ చేస్తూ మున్నెన్నడూ లేనంత భారీ ఎత్తున దాడులకు తెగబడుతున్నారు. కేవలం ఈ ఒక్క వారంలోనే హౌతీలు జరిపిన డ్రోన్, బాలిస్టిక్ క్షిపణి దాడుల వల్ల సౌదీ అరేబియాలోని కొన్ని ప్రధాన చమురు నిల్వ కేంద్రాలు అగ్ని కీలల్లో చిక్కుకున్నాయి. ఈ దాడుల్లో దాదాపు 73 మందికి పైగా గాయపడ్డారు. దీనికి సరిగ్గా ఒకరోజు ముందే జరిగిన దాడిలో మరో 13 మంది గాయపడ్డారు. సౌదీ తమపై దాడులు చేస్తోందని, దానికి ప్రతికారంగానే తాము సౌదీలోని మిలిటరీ స్థావరాలు, ఎయిర్ బేస్ లపై డ్రోన్లతో దాడులు చేస్తున్నామని హౌతీలు ప్రకటించారు.

అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. తాము మక్కా నగరాన్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు పంపామని, వాటిని తాము కూల్చేశామని సౌదీ కూటమి ప్రకటించగా.. హౌతీలు మాత్రం ఆ వార్తలను తీవ్రంగా ఖండించారు. హౌతీ పొలిట్‌బ్యూరోకు చెందిన హాజెమ్ అల్-అస్సాద్ స్పందిస్తూ.. "మక్కా నగరాన్ని మేము టార్గెట్ చేశామనడం ముమ్మాటికీ అబద్ధం. సౌదీ ప్రభుత్వం పాత అబద్ధాలనే మళ్లీ చెబుతోంది. ముస్లింల పవిత్ర స్థలాన్ని మేము టార్గెట్ చేయం. కానీ, మా ప్రజలపై సౌదీ చేస్తున్న దాడులకు బుద్ధి చెప్పేందుకు.. వారి ఆర్థిక, సైనిక స్థావరాలపై మా దాడులు మరింత తీవ్రం అవుతాయి" అంటూ హెచ్చరించారు.

ఈ ఇరు దేశాల వివాదం కేవలం మధ్యప్రాచ్యానికే పరిమితం కాలేదు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ప్రమాదం కనిపిస్తోంది. యెమెన్ అంతర్యుద్ధం కారణంగా ఎర్రసముద్రంలో ప్రయాణించే సౌదీ రవాణా నౌకలపై హౌతీలు నావెల్ బ్లాకేడ్ విధించారు. ఈ నేపథ్యంలో కతార్ దేశం అంతర్జాతీయ సమాజానికి ఓ స్ట్రాంగ్ వార్నింగ్ ఒక గట్టి హెచ్చరిక జారీ చేసింది. ప్రపంచ దేశాల వాణిజ్యానికి అత్యంత కీలకమైన ‘బాబ్ అల్-మందాబ్’ జలసంధి గనుక ఈ యుద్ధం వల్ల మూతపడితే, అది ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక విపత్తుకు దారితీస్తుందని కతార్ విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు ఈ యుద్ధంలో జోక్యం చేసుకోవాలంటూ సౌదీ క్రౌన్ ప్రిన్స్ చేసిన అభ్యర్థనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించడం గమనార్హం.

వాషింగ్టన్‌తో హౌతీలు మాట్లాడారని, అమెరికా ఇందులో జోక్యం చేసుకోవద్దని కోరారని ట్రంప్ వ్యాఖ్యానించారు. దీంతో సౌదీ అరేబియా ఇప్పుడు ఒంటరిగా ఈ ముప్పును ఎలా ఎదుర్కోవాలా అని ప్రత్యామ్నాయ వ్యూహాలను వెతుకుతోంది. ఏది ఏమైనా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ముస్లింల ఆరాధ్య దైవ స్థానమైన మక్కా నగరంలో ఇలాంటి ఎయిర్ రైడ్ అలర్ట్ రావడం చరిత్రలో ఇదే మొదటిసారి. యుద్ధాలు ఏవైనా సరే.. పవిత్ర స్థలాలకు, సామాన్య ప్రజలకు ఎలాంటి హాని జరగకూడదని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి. మరి సౌదీ-హౌతీల మధ్య జరుగుతున్న ఈ ఘర్షణ ఎటు వైపు దారితీస్తుంది? అనేది ఆసక్తిని రేపుతోంది.

Published : 
  • 17 September 2026, 8:30 PM IST