తెలుగు సినిమాకి ఎన్టీఆర్, ఏఎన్నార్ ఎలాగో.. హాస్యానికి బ్రహ్మానందం అలాగ..! ఫిబ్రవరి 1న బ్రహ్మానందం 70వ పుట్టినరోజు. ఒకప్పుడు సినిమా థియేటర్లలో ఆయన కనిపిస్తే చాలు ఈలలు, కేకలతో హాల్ దద్దరిల్లిపోయేది. ఇప్పుడు ఆయన తెరపై కనిపించినా, కనిపించకపోయినా సోషల్ మీడియాలో నిత్యం కనిపిస్తూనే ఉన్నారు. ఈ డిజిటల్ యుగంలో ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు, ఒక మీమ్ గాడ్. మన రోజువారీ జీవితంలో ఏ ఎమోషన్ అయినా సరే, బ్రహ్మానందం ఎక్స్ప్రెషన్ తో మీమ్ వేయకుండా ఆ రోజు గడవదు అంటే అతిశయోక్తి కాదు. ఒక సాధారణ తెలుగు లెక్చరర్ గా జీవితాన్ని ప్రారంభించి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వరకు ఎదిగిన ఆయన ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకం. దివంగత దర్శకుడు జంధ్యాల అహ నా పెళ్ళంట సినిమాలోని అరగుండు పాత్రతో మొదలైన ఆయన జర్నీ, తెలుగు సినిమా కామెడీ రూపురేఖలనే మార్చేసింది.
గోదావరి యాసలో ఆయన పలికించే డైలాగులు, బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇచ్చాయి. అప్పటి నుంచి దాదాపు 4 దశాబ్దాలుగా ఆయన నవ్వించని తెలుగు కుటుంబం లేదు. 90వ దశకం, 2000వ దశకంలో బ్రహ్మానందం డేట్స్ దొరికితే చాలు.. సినిమా సగం హిట్టయినట్టే అని నిర్మాతలు భావించేవారు. స్టార్ హీరోలు ఎవరు ఉన్నా సరే, సినిమాలో బ్రహ్మానందం కోసం ప్రత్యేకంగా ఒక ట్రాక్ ఉండాల్సిందే. కొన్ని సినిమాలు కేవలం ఆయన కామెడీ వల్లే బాక్సాఫీస్ వద్ద గట్టెక్కాయి అంటే ఆశ్చర్యం లేదు. కమెడియన్ గా ఉంటూనే.. హీరోలకు సమానమైన స్టార్డమ్, రెమ్యునరేషన్ అందుకున్న ఏకైక నటుడు బ్రహ్మానందం మాత్రమే.
ఖాన్ దాదా, గచ్చిబౌలి దివాకర్, మెక్డొవల్ మూర్తి, కిల్ బిల్ పాండే.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ లిస్ట్ కు అంతు ఉండదు. ముఖ్యంగా శ్రీను వైట్ల, త్రివిక్రమ్ వంటి దర్శకులతో ఆయన కాంబినేషన్ వెండితెరపై మ్యాజిక్ చేసింది. అమాయకంగా ఉంటూనే ఇతరులను ఇబ్బంది పెట్టడం లేదా ఇతరుల చేతిలో బలైపోయి ఫ్రస్ట్రేషన్ చూపించడం ఆయనకే చెల్లింది. రేస్ గుర్రం సినిమాలో కిల్ బిల్ పాండేగా క్లైమాక్స్ మొత్తం తన భుజాలపై మోసి సినిమాను బ్లాక్ బస్టర్ చేసిన విధానం ఆయన పవర్ని చూపిస్తుంది. కేవలం కామెడీకే పరిమితం కాకుండా.. తాను ఒక గొప్ప నటుణ్ణి అని బాబాయ్ హోటల్ నాటి నుంచే నిరూపించుకున్నారు. అయితే ఈ మధ్య కాలంలో కృష్ణవంశీ తెరకెక్కించిన రంగమార్తాండ సినిమాలో ఆయన చేసిన చక్రపాణి పాత్ర అందరినీ కంటతడి పెట్టించింది.
నవ్విస్తూనే గుండె బరువెక్కించే ఆ పాత్రలో ఆయన చూపిన పరిణితి.. ఆయనలోని నటబ్రహ్మను ఈ తరానికి కొత్తగా పరిచయం చేసింది. వయసు మీద పడుతున్నా, పాత్రల ఎంపికలో ఆయన చూపిస్తున్న వైవిధ్యం అభినందనీయం. కొత్త కమెడియన్లు ఎంతమంది వచ్చినా, బ్రహ్మానందం స్థానం ఎప్పటికీ పదిలమే. నేటి యువతకు ఆయన ఒక ఎమోషన్, ఒక స్ట్రెస్ బస్టర్. ఆయన ముఖం చూస్తే చాలు తెలియకుండానే పెదాలపై చిరునవ్వు వస్తుంది. 1000కి పైగా సినిమాల్లో నటించి, ప్రపంచ రికార్డు సృష్టించిన ఈ లెజెండ్, మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, నిండు ఆరోగ్యంతో మనల్ని ఇలాగే అలరించాలని కోరుకుందాం. హ్యాపీ బర్త్ డే బ్రహ్మీ..!