అమెరికాను కుదిపేసిన హైప్రొఫైల్ సెక్స్ కుంభకోణంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దిగ్గజ ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్‌స్టీన్ దుర్మార్గాల చిట్టాకు సంబంధించి రహస్య పత్రాలను న్యూయార్క్ కోర్టు బయటపెట్టింది. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌తో ఎప్‌స్టీన్ సాన్నిహిత్యం, బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ ఆండ్రూపై వచ్చిన ఆరోపణల వంటి వివరాలు వీటిలో ఉన్నాయి. ఈ డాక్యుమెంట్లలో పాప్ ఐకాన్ మైఖెల్ జాక్సన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా 100 మందికిపైగా పేర్లు ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణానికి సంబంధించి 30 వేల పేజీల డాక్యుమెంట్లను అమెరికా న్యాయశాఖ విడుదల చేసింది. వాటితో పాటు 2వేలకు పైగా వీడియోలు, సుమారు 1.80 లక్షల ఫొటోలను కూడా విడుదల చేసింది. దీంతో జెఫ్రీ ఎప్‌స్టీన్ ఎవరు ? అన్న దానిపై నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. జెఫ్రీ ఎపిస్టన్ న్యూయార్క్ నగరంలో పుట్టాడు. భౌతిక శాస్త్రం, గణితం చదివాడు. 1970ల్లో ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పని చేశాడు. అక్కడి విద్యార్థుల్లో ఒకరి తండ్రి ఎపిస్టన్‌ను చూసి ప్రభావితమై.. వాల్‌స్ట్రీట్‌లోని తన భాగస్వామి అయిన ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌కు పరిచయం చేశాడు. ఆ తర్వాత నాలుగేళ్లకే ఎపిస్టన్ అండ్ కో అనే అసెట్‌మేనేజ్‌మెంట్ సంస్థను సొంతగా ప్రారంభించాడు. ఆ సంస్థ వేగంగానే విజయం సాధించింది.
బిలియన్ డాలర్ల సంపద కంటే తక్కువ ఉన్నవారి కోసం ఎపిస్టన్ పని చేయలేదు. హఠాత్తుగా వచ్చిపడిన సంపదతో ఎపిస్టిన్ ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో రాజభవనాన్ని తలపించే ఇంటిని కొనుగోలు చేశాడు. న్యూమెక్సికోలో స్థలాలు కొన్నాడు. అప్పట్లోనే న్యూయార్క్‌లో అతిపెద్ద ప్రైవేట్ హోమ్‌ను సొంతం చేసుకొన్నాడు. ఇక్కడ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, కళాకారులకు పార్టీలు ఇచ్చేవాడు. ఎపిస్టన్ మిత్రుల్లో క్లింటన్, ట్రంప్, కెనడీ కుటుంబీకులు, మీడియా దిగ్గజం మద్రోక్, మిషెల్ బ్లూమ్‌బెర్గ్, రిచర్డ్ బ్రాన్సన్, మైకెల్ జాక్సన్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయర్, ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఎహుద్ బరాక్, సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ వంటి వారు ఉన్నారు. ఎపిస్టన్‌కు ఓ ప్రైవేటు బోయింగ్ 747 విమానం ఉంది. దానిలో హైప్రొఫైల్ మిత్రులతో కలిసి విదేశాలకు వెళ్లేవాడు. ఈ విమానాన్ని వర్జిన్ ద్వీపాల్లో స్థానికులు 'లోలితా ఎక్స్‌ప్రెస్'గా పిలిచేవారు. తరచూ దీనిలో యువతులు, బాలికలు అనుమానాస్పదంగా కనిపిస్తుండటంతో ఈ పేరు పెట్టారు. జెఫ్రీ మీడియాకు దూరంగా ప్రైవేటు జీవితం గడిపేందుకు ఇష్టపడుతుంటాడు.
పేద మధ్య తరగతి బాలికలు, యువతులకు భారీ మొత్తం ఆశగా చూపించి పామ్ బీచ్ బంగ్లాకు పిలిపించి అఘాయిత్యాలకు పాల్పడేవాడు. బాధితురాలికి కొంత డబ్బు ఇచ్చి.. మరో యువతిని ఆ బంగ్లాకు తెస్తే ఇంకొంత మొత్తం కమిషన్ ఇస్తానని ఆశచూపేవాడు. ఈ ఉచ్చులో చిక్కుకొన్న బాలికలకు ఎలా బయటపడాలో తెలియక ఎపిస్టన్ చెప్పినట్లు వ్యవహరించేవారు. లొంగదీసుకున్న బాలికలను తన సంపన్న మిత్రుల వద్దకు పంపి పనులు చేయించుకునేవాడు జెఫ్రీ ఎపిస్టన్. 2005లో ఈ పాపాల పుట్టపగిలి.. అసలు విషయం ప్రపంచానికి తెలిసింది. అదే ఏడాది ఓ 14ఏళ్ల బాలిక తల్లిదండ్రులు ఫ్లోరిడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎపిస్టన్ వ్యవహారం వెలుగు చూసింది.
పామ్ బీచ్‌లోని అతడి భవనంపై పోలీసులు దాడి చేసి అభ్యంతరకర వస్తువులను స్వాధీనం చేసుకొన్నారు. అప్పటికే ఎపిస్టన్ చాలావరకూ ఆధారాలను నాశనం చేయించాడు. కొన్నినేరాలు నిరూపితం కావడంతో దాదాపు 13 నెలల జైలు జీవితం గడిపాడు. జెఫ్రీ కోసం కేసు తీవ్రతను తగ్గించేందుకు ప్రాసిక్యూటర్ అలగ్జాండర్ ఎకోస్టా పనిచేసినట్లు ఆరోపణలు వచ్చాయి.2019లో మీటూ ఉద్యమం మొదలు కావడంతో మరోసారి ఎపిస్టన్‌పై ఆరోపణలు వచ్చాయి. దీంతో అతడిని అదే ఏడాది జులైలో అరెస్టు చేశారు. ఈ సారి అతడి ఇంట్లో ఛైల్డ్ పోర్నోగ్రఫీ, నకిలీ పాస్‌పోర్టు దొరికాయి. దేశం దాటేందుకు యత్నాలు చేస్తున్న సమయంలో పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత అదే ఏడాది ఆగస్టు 10న జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు.
అమెరికన్ ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్‌స్టీన్.. అమెరికాలోని విలాసవంతమైన జీవితాల వెనుక చీకటి కోణంలో కీలకపాత్రధారి. వ్యాపారవేత్తలు, దేశాధ్యక్షులు, సెలబ్రెటీలతో తన పరపతి పెంచుకోవడం కోసం ఏళ్ల తరబడి టీనేజ్ అమ్మాయిలను ఎరగా వేశాడు. ఆయన సన్నిహితుల జాబితాలో ఇద్దరు అమెరికా మాజీ అధ్యక్షులు.. బ్రిటన్ రాణి సుపుత్రుడు.. వ్యాపారవేత్తలు.. రాజకీయ నాయకులు ఉన్నారు. బ్రిటన్ రాణీ క్వీన్ ఎలిజిబెత్-2, ప్రిన్స్ ఫిలిప్‌ల కుమారుడు ప్రిన్స్ ఆండ్రూ కూడా ఉన్నాడు. ఈ పాపాల్లో సహకరించిన అతడి స్నేహితురాలి గిలిన్ మాక్స్‌వెల్‌పై తాజాగా నేర నిరూపణ జరగడంతో ఈ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఎపిస్టన్, ట్రంప్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ట్రంప్ సైతం అనేక సార్లు ఎప్‌స్టీన్ ఐలాండ్‌కు వెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత ఆర్థిక విషయాల్లో వివాదాలు జరిగినట్లు ప్రచారం జరిగింది. మరోవైపు బిల్‌క్లింటన్.. ఎపిస్టన్‌తో కలిసి 27సార్లు వివిధ పర్యటనలకు వెళ్లినట్లు ఫ్లైట్ రికార్డులు 2016లో బయటపడ్డాయి. మాజీ మిస్ స్విడన్ ఎవా అండర్సన్, గిలిన్ మాక్స్‌వెల్‌లతో ఎపిస్టిన్ డేటింగ్ చేశాడు. కానీ, జీవితంలో ఎవరినీ పెళ్లిచేసుకోలేదు.