ప్రపంచ వాణిజ్యానికి, ముఖ్యంగా భారతదేశ ఆర్థిక రంగానికి మరో భారీ ముప్పు ముంచుకొస్తోంది. ఇప్పటికే హార్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు నడుస్తుండగా, ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గంపై ఇరాన్ అనుకూల హౌతీ రెబెల్స్ కన్నేశారు. ఎర్ర సముద్రం మరియు గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌ను అనుసంధానించే అత్యంత వ్యూహాత్మకమైన 'బాబ్-ఎల్-మండేబ్ జలసంధి'ని పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి హౌతీలు స్కెచ్ వేశారు.ఈ మార్గాన్ని గనుక వారు అడ్డుకుంటే గ్లోబల్ ట్రేడ్‌తో పాటు, భారతదేశానికి వచ్చే క్రూడాయిల్ సప్లై పూర్తిగా స్తంభించిపోయే ప్రమాదం ఉంది. అసలు హౌతీ రెబెల్స్ ప్లాన్ ఏంటి? దీనివల్ల ప్రపంచ దేశాలకు ఎలాంటి నష్టం వాటిల్లబోతోంది? ముఖ్యంగా భారతదేశం ఎదుర్కోబోయే ఆ భారీ 'ఆయిల్ షాక్' ఏంటి?
అసలు ఈ బాబ్-ఎల్-మండేబ్ జలసంధి వద్ద ఏం జరగబోతోంది? ఐక్యరాజ్యసమితి నివేదికల ప్రకారం.. హౌతీ రెబెల్స్ ఈ సముద్ర మార్గం గుండా ప్రయాణించే అంతర్జాతీయ కార్గో నౌకల నుండి భారీగా రక్షణ పన్నులు వసూలు చేయాలని భావిస్తున్నారు. తమకు ఫీజు కడితేనే ఆ నౌకలకు సురక్షితంగా వెళ్లేందుకు అనుమతి ఇస్తామని, లేదంటే దాడులు చేస్తామని హెచ్చరిస్తున్నారు. గతంలోనే ఈ రెడ్ సీ మార్గంలో నౌకలను భయపెట్టి హౌతీలు నెలకు ఏకంగా 180 మిలియన్ డాలర్లు వసూలు చేసినట్లు అంచనా.
ఇప్పుడు ఈ బాబ్-ఎల్-మండేబ్ జలసంధిని పూర్తిగా చేజిక్కించుకోవడం ద్వారా.. తాము ఒక దేశాన్ని లేదా సైన్యాన్ని నడపకపోయినప్పటికీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, అంతర్జాతీయ ఇంధన భద్రతను శాసించగలమని నిరూపించాలని వారు చూస్తున్నారు. ఈ నిధులతో మరింత అధునాతన ఆయుధాలు కొనుగోలు చేసి అమెరికా, సౌదీ అరేబియా లాంటి ప్రత్యర్థి దేశాలపై ఒత్తిడి పెంచడమే వీరి ప్రధాన వ్యూహం. ఒకవేళ హౌతీలు ఈ బాబ్-ఎల్-మండేబ్ జలసంధిని బ్లాక్ చేస్తే ఏమవుతుంది? ఇది నేరుగా ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన సూయజ్ కాలువను పూర్తిగా నిరుపయోగంగా మార్చేస్తుంది. ఆసియా మరియు యూరప్ ఖండాల మధ్య దూరాన్ని తగ్గించడానికి ఈ 193 కిలోమీటర్ల సూయజ్ కాలువ ఎంతో కీలకం. ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 12 శాతం వ్యాపారం కేవలం ఈ మార్గం ద్వారానే జరుగుతుంది.
ఒకవేళ హౌతీల భయంతో ఈ రూట్ క్లోజ్ అయితే.. సముద్ర నౌకలన్నీ ఆఫ్రికా ఖండం చివరన ఉండే 'కేప్ ఆఫ్ గుడ్ హోప్' చుట్టూ తిరిగి ప్రయాణించాల్సి వస్తుంది. దీనివల్ల నౌకలు గమ్యస్థానానికి చేరడానికి అదనంగా కనీసం 14 రోజుల సమయం పట్టడమే కాకుండా, దాదాపు 7,000 కిలోమీటర్ల దూరం అదనంగా ప్రయాణించాల్సి వస్తుంది. దీనివల్ల షిప్పింగ్ ఛార్జీలు ఆకాశాన్నంటుతాయి. ఈ అంతర్జాతీయ సంక్షోభం భారతదేశాన్ని ఎంత దారుణంగా దెబ్బకొడుతుందో ఇప్పుడు చూద్దాం. భారతదేశం తన మొత్తం అంతర్జాతీయ వాణిజ్యంలో దాదాపు 25 నుండి 35 శాతం కేవలం ఈ సూయజ్ కాలువ మార్గం ద్వారానే నిర్వహిస్తుంది.
మన దేశం తనకు కావలసిన మొత్తం ఇంధన అవసరాలలో 85 శాతాన్ని విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది, అందులో చాలా భాగం ఈ రూట్ ద్వారానే వస్తుంది. ఒకవేళ ఈ సముద్ర మార్గం మూతబడితే, నౌకలు 14 రోజులు ఆలస్యంగా రావడం వల్ల దేశంలో ముడిచమురు కొరత ఏర్పడి, పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయే ప్రమాదం ఉంది. చమురు ధరలు పెరిగితే ఆటోమేటిక్‌గా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. కేవలం దిగుమతులే కాదు.. భారతదేశం నుండి యూరప్, అమెరికా మరియు ఆఫ్రికా దేశాలకు వెళ్లే ఎగుమతులు కూడా ఘోరంగా దెబ్బతింటాయి.
మన దేశం నుండి భారీగా ఎగుమతి అయ్యే టెక్స్టైల్స్, కెమికల్ ప్రొడక్ట్స్, ఇంజనీరింగ్ మిషనరీ మరియు అత్యంత కీలకమైన ఫార్మా కంటైనర్లు అన్నీ ఈ రూట్ లోనే వెళ్తాయి. ప్రయాణ దూరం మరియు సమయం పెరగడం వల్ల రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయి, అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ వస్తువుల డిమాండ్ పడిపోతుంది. ఇది భారతీయ వ్యాపారులకు మరియు ప్రభుత్వానికి వందల కోట్ల నష్టాన్ని మిగులుస్తుంది. అయితే, ఇక్కడే హౌతీలు ఒక చిన్న లింక్ పెట్టారు.. తాము చైనాకు చెందిన నౌకలపై ఎలాంటి పన్నులు వేయబోమని, వారికి మినహాయింపు ఇస్తామని సంకేతాలు ఇస్తున్నారు.
తద్వారా బీజింగ్‌తో సత్సంబంధాలు పెంచుకుని గ్లోబల్ పాలిటిక్స్‌లో మరింత లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే రాబోయే రోజుల్లో అంతర్జాతీయ సముద్ర జలాల్లో చమురు యుద్ధం తీవ్రం కాబోతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. బాబ్-ఎల్-మండేబ్ జలసంధి గనుక పూర్తిగా హౌతీల కంట్రోల్లోకి వెళ్తే ప్రపంచవ్యాప్తంగా మరోసారి తీవ్రమైన ఆర్థిక మందగమనం వచ్చే అవకాశం లేకపోలేదు. మరి ఈ అంతర్జాతీయ సముద్ర సంక్షోభాన్ని మరియు భారతదేశంపై పడబోయే దీని ప్రభావాన్ని అడ్డుకోవడానికి మన దేశం ఎలాంటి వ్యూహాలు పైనా దృష్టి పెట్టాలి అనుకుంటున్నారు?