టాలీవుడ్లో మల్టీస్టారర్స్ టైమ్ నడుస్తుందిప్పుడు. కథ బాగుంటే కలిసి నటించడానికి తమకెలాంటి అభ్యంతరాలు లేవంటున్నారు హీరోలు. అలా ఇప్పుడు ఓ క్రేజీ రూమర్ బాగా వినిపిస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కలిసి ఒకే తెరపై కనిపించబోతున్నారనే వార్త ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించేందుకు రంగం సిద్ధమవుతోందని తెలుస్తుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే, తెలుగు సినిమా చరిత్రలో ఇదొక సంచలన ప్రాజెక్ట్‌గా నిలిచిపోవడం ఖాయం. ఈ సినిమా కథాంశం గురించి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ అందించిన ఒక పవర్-ప్యాక్డ్ అన్నా-తమ్ముడు కథతో సురేందర్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. గతంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన రేసుగుర్రం సినిమాలో కూడా అన్నాదమ్ముల సెంటిమెంట్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి బ్లాక్‌బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు అదే మ్యాజిక్ మరోసారి రిపీట్ చేసేందుకు సురేందర్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టులో పవన్ కళ్యాణ్ అన్నయ్యగా, విజయ్ దేవరకొండ తమ్ముడిగా కనిపిస్తాడని టాక్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ మాస్ ఇమేజ్, విజయ్ దేవరకొండ ఎనర్జిటిక్ యాటిట్యూడ్ కలిస్తే వెండితెరపై పూనకాలు రావడం ఖాయం. ఇద్దరు వేర్వేరు జనరేషన్లకు చెందిన స్టార్స్ కావడంతో.. వీళ్ల కాంబినేషన్ అటు క్లాస్, ఇటు మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ క్రేజీ కాంబినేషన్ సెట్స్ పైకి వస్తే అది నిజంగానే ఒక పెద్ద సంచలనం అవుతుంది. ప్రముఖ నిర్మాత, పవన్ కళ్యాణ్ స్నేహితుడు రామ్ తళ్లూరి ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
మార్చి నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఉగాది రోజు పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. పవన్ కళ్యాణ్ రాజకీయ బిజీలో ఉన్నప్పటికీ, ఈ కథ నచ్చడంతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కమిట్మెంట్ ఇప్పుడు కాదు.. మూడేళ్ల కిందే ఫైనల్ అయింది. పక్కా స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా సురేందర్ రెడ్డి, పవన్ సినిమా రాబోతుంది. పైగా గతంలో మెగా హీరోలతో సూరి చేసిన సైరా, రేసుగుర్రం, ధృవ సినిమాలు బాగానే మెప్పించాయి. ఇప్పుడు పవన్ సినిమా కూడా హిట్ అవుతుందని నమ్ముతున్నారు అభిమానులు. మొత్తానికి పవన్, విజయ్ దేవరకొండ, సురేందర్ రెడ్డిల కాంబినేషన్ అనే వార్తతోనే అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వక్కంతం వంశీ మార్క్ కథ, సురేందర్ రెడ్డి స్టైలిష్ టేకింగ్, పవన్-విజయ్ ల స్క్రీన్ ప్రెజెన్స్ కలిస్తే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయం. ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందా అని అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.