సీతా పయనం మూవీ రివ్యూ.. యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకుడిగా సక్సెస్ అయ్యాడా..?

మాస్ అండ్ యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన 'యాక్షన్ కింగ్' అర్జున్, ఈసారి తన రూట్ మార్చారు. తన గారాల పట్టి ఐశ్వర్యను తెలుగులో పరిచయం చేసే బాధ్యతను స్వయంగా భుజాన వేసుకుని 'సీతా పయనం' చిత్రాన్ని

Post Published By: dialnews
Updated : 14 February 2026, 9:00 PM IST

మాస్ అండ్ యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన 'యాక్షన్ కింగ్' అర్జున్, ఈసారి తన రూట్ మార్చారు. తన గారాల పట్టి ఐశ్వర్యను తెలుగులో పరిచయం చేసే బాధ్యతను స్వయంగా భుజాన వేసుకుని 'సీతా పయనం' చిత్రాన్ని తెరకెక్కించారు. వాలెంటైన్స్ డే కానుకగా వచ్చిన ఈ చిత్రం.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ కలయికగా రూపొందింది. మరి దర్శకుడిగా అర్జున్ తన కూతురికి హిట్ ఇచ్చారా లేదా..? ఈ పయనం ప్రేక్షకులకు నచ్చిందా? రివ్యూలో చూద్దాం.

కథ విషయానికి వస్తే.. వైజాగ్‌లో ఉండే సీత (ఐశ్వర్య)కు తన నాన్న (సత్యరాజ్) అంటే లోకం. పెళ్లి ప్రస్తావన వస్తేనే మండిపడే తత్వం ఆమెది. అనుకోకుండా ఒక ప్రాజెక్ట్ పని మీద ఆమె హైదరాబాద్‌కు రోడ్డు మార్గంలో వెళ్లాల్సి వస్తుంది. ఆ ప్రయాణమే ఆమె జీవితాన్ని మలుపు తిప్పుతుంది. దారిలో పరిచయమైన అభి (నిరంజన్) ఆమె ఆలోచనలను ఎలా మార్చాడు? ఈ కథలో అభి తాతయ్య (ప్రకాష్ రాజ్) పాత్ర ఏంటి? ఇక మధ్యలో గిరి (అర్జున్), బసవన్న (ధృవ్ సర్జా)ల ఎంట్రీతో కథ ఎలాంటి మలుపులు తిరిగింది? అనేది వెండితెరపై చూడాల్సిన కథ.

స్క్రీన్ ప్లే విషయానికి వస్తే.. ఇదొక రెగ్యులర్ లవ్ స్టోరీ కాదు, బలమైన ఎమోషన్స్ ఉన్న రోడ్ మూవీ. అర్జున్ తన కూతురి కోసం కమర్షియల్ హంగుల జోలికి వెళ్లకుండా, కథనే నమ్ముకున్నారు. కథాంశం పాతదే అయినా, దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం ఫ్రెష్‌గా ఉంది. ముఖ్యంగా సనాతన ధర్మం, గోసేవ, దేశభక్తి వంటి అంశాలను కథలో మిళితం చేసిన తీరు బాగుంది. ఫస్టాఫ్ అంతా కూల్‌గా సాగిపోతుంది, కానీ సెకండాఫ్‌లో మెసేజ్ డోస్ కాస్త ఎక్కువైంది. కొన్ని సన్నివేశాలు సినిమాటిక్‌గా కాకుండా, క్లాస్ రూమ్ పాఠాల్లా అనిపించడం మైనస్. అయితే, జంతువుల పట్ల ప్రేమను చూపించిన విధానం గుండెకు హత్తుకుంటుంది. క్లైమాక్స్ ఎమోషనల్‌గా ఉన్నా, ముగింపు కాస్త హడావిడిగా అనిపిస్తుంది. అయినా సరే బయటికి వచ్చాక ఒక మంచి సినిమా చూశామన్న ఫీలింగ్ మాత్రం మిగులుతుంది. కాకపోతే నెరేషన్ విషయంలో ఇంకాస్త ఫాస్టుగా ఉండుంటే బాగుండేది.

మరీ పాతకాలం సినిమా తీసినట్లు అదే టెంప్లేట్ ఫాలో అయ్యాడు అర్జున్. ఇంకాస్త షార్ప్ ఎడిట్ చేసుంటే నిజంగానే మంచి సినిమా అయ్యుండేది సీతా పయనం.నటీనటుల విషయానికి వస్తే.. తెలుగులో మొదటి సినిమానే అయినా ఐశ్వర్య ఎక్కడా తడబడలేదు. గ్లామర్ షోకి దూరంగా, చాలా పద్ధతిగా, హుందాగా కనిపించింది. హీరో నిరంజన్ తన పాత్రకు న్యాయం చేశాడు. ఇక సీనియర్లు సత్యరాజ్, ప్రకాష్ రాజ్ సినిమాకు బ్యాక్‌బోన్‌గా నిలిచారు. ముఖ్యంగా తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ సీన్స్‌లో సత్యరాజ్ నటన సినిమాకు ప్లస్ అయింది. అర్జున్, ధృవ్ సర్జాల మాస్ ఎంట్రీలు ఫ్యాన్స్‌కు నచ్చొచ్చు. బిత్తిరి సత్తి, సిరి హనుమంతు తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు.

టెక్నికల్ టీం విషయానికి వస్తే.. ఈ సినిమాకు ఆయువుపట్టు అనూప్ రూబెన్స్ సంగీతం. పాటలతో పాటు, నేపథ్య సంగీతం కూడా సీన్ల స్థాయిని పెంచింది. వైజాగ్ అందాలను కెమెరామెన్ చాలా నేచురల్ గా బంధించారు. శ్రీరామ్ ఫిల్మ్స్ నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. ఎడిటర్ కత్తెరకు ఇంకాస్త పని చెప్పి ఉండాల్సింది, ముఖ్యంగా ద్వితీయార్థంలో సాగదీతను తగ్గించి ఉంటే బాగుండేది. దర్శకుడిగా అర్జున్ తాను చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా, నిజాయితీగా చెప్పారు.ఓవరాల్‌గా సీతా పయనం.. రెగ్యులర్ ఫ్యామిలీ సినిమా.. స్లో నెరేషన్ ఉన్నా మంచి విషయాలు కూడా ఉన్నాయి..

Published : 
  • 14 February 2026, 9:00 PM IST