6 మ్యాచ్ లలో 4 డకౌట్లు, అభిషేక్ కు అండగా రవిశాస్త్రి…!

టీ20 వరల్డ్ కప్ 2026లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ప్రస్తుతం ఫామ్ సమస్యతో సతమతమవుతున్నాడు. టోర్నీలో ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లలో వరుసగా డకౌట్‌లు కావడం అతడిపై ఒత్తిడిని పెంచింది.

Post Published By: dialnews
Updated : 17 February 2026, 4:55 PM IST

టీ20 వరల్డ్ కప్ 2026లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ప్రస్తుతం ఫామ్ సమస్యతో సతమతమవుతున్నాడు. టోర్నీలో ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లలో వరుసగా డకౌట్‌లు కావడం అతడిపై ఒత్తిడిని పెంచింది. చివరి ఆరు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో నాలుగు సార్లు సున్నాకే అవుట్ కావడం అభిమానులను నిరాశపరిచింది. ముఖ్యంగా పాకిస్తాన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో తొలి ఓవర్‌లోనే వికెట్ కోల్పోవడం చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో యువ ఆటగాడిపై విమర్శలు పెరిగినా, మాజీ భారత కోచ్ రవిశాస్త్రి మాత్రం అభిషేక్‌కు అండగా నిలిచాడు. అభిషేక్‌కు ఇది తాత్కాలిక ఫేజ్ మాత్రమేననీ, ఇలాంటి పరిస్థితులు ప్రతి క్రికెటర్ జీవితంలో వస్తాయన్నాడు. అతడు కాస్త ఓపిక పట్టాలన్న రవిశాస్త్రి తన ఆటకు కాస్త సమయం ఇవ్వాలనీ, అలా చేస్తే మళ్లీ ఫామ్‌లోకి వస్తాడని చెప్పుకొచ్చాడు.

అభిషేక్ శర్మ ఆఖరి ఆరు టీ20 ఇన్నింగ్స్‌లను ఒకసారి పరిశీలిస్తే.. మొత్తం మీద 98 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ సిరీస్‌లో రెండు సార్లు డకౌట్ అయ్యాడు. టీ20 వరల్డ్‌కప్‌లో ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు. అభిషేక్ స్టైల్ గురించి కూడా శాస్త్రి మాట్లాడాడు. హై రిస్క్ – హై రివార్డ్ విధానంలో ఆడే ఆటగాడిగా, కొన్నిసార్లు తొందరగా అవుట్ కావడం సహజమన్నాడు. అయితే, అతడికి కొన్ని బంతులు ఆడి సెటిల్ అయిన తర్వాత భారీ షాట్లు ఆడే సామర్థ్యం ఉందన్నాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ విఫలమైనా, అతడి ఓపెనింగ్ పార్ట్‌నర్ ఇషాన్ కిషన్ అద్భుత ప్రదర్శన చేశాడు.

కఠినమైన పిచ్‌పై 40 బంతుల్లో 77 పరుగులు చేసి జట్టుకు బలమైన స్కోర్ అందించాడు. ప్రస్తుతం ఇషాన్ డ్రీమ్ ఫామ్‌లో ఉన్నాడనీ, ఆ పిచ్‌పై దాదాపు 200 స్ట్రైక్ రేట్‌తో ఆడటం అసాధారణ విషయంగా రవిశాస్త్రి అభివర్ణించాడు. ఆ మ్యాచ్‌లో 175 పరుగులు చేసిన భారత్ పాకిస్తాన్‌ను 114 పరుగులకే ఆలౌట్ చేసింది. హ్యాట్రిక్ విజయంతో టీమిండియా సూపర్ 8లో అడుగుపెట్టింది. కీలక దశల్లో అబిషేక్ తిరిగి పుంజుకుంటే, అది జట్టుకు భారీ బలం అవుతుంది. అతడు తన సహజమైన అటాకింగ్ ఆటతో మళ్లీ మ్యాచ్ విన్నర్‌గా మారతాడని టీమ్ మేనేజ్‌మెంట్ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Published : 
  • 17 February 2026, 4:55 PM IST