టీ20 ప్రపంచకప్ సూపర్ 8 మ్యాచ్ ల ముంగిట సెమీఫైనల్ చేరే జట్లపై అంచనాలు మొదలయ్యాయి. ప్రస్తుతం గ్రూప్ 1 కంటే గ్రూప్ 2 ఇంకా ప్రమాదకరంగా ఉంది. పాక్ మినహా మిగతా మూడు జట్లు సెమీస్ రేసులో నువ్వా-నేనా అన్నట్లు ముందుకు సాగే అవకాశం ఉంది. ఈ గ్రూప్‌లో తక్కువ అంచనా వేయడానికి వీల్లేని జట్టు ఏదైనా ఉందా అంటే అది న్యూజిలాండే అవుతుంది. ఈ జట్టు సెమీస్‌కు చేరడమే కాదు, తమ తొలి ప్రపంచకప్ టైటిల్ సాధించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పేపర్‌పై ఈ జట్టు సాదాసీదాగా కనిపించినా, పోరాటపటిమ వారిని ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రమాదకరమైన జట్టుగా నిలబెడుతుంది.
ఇటీవల భారత్‌తో జరిగిన సిరీస్‌లో ఆ జట్టు పోరాటాన్ని ఇంకా ఎవ్వరూ మరిచిపోలేదు. పైగా ఈ జట్టులోకి చాలామంది ఆటగాళ్లకు ఉపఖండపు పిచ్‌లపై ఆడిన అనుభవం కూడా ఉంది. భారత్ తర్వాత అత్యధిక హోం అడ్వాంటేజ్ లభించే జట్టు ఏదైనా ఉందా అంటే అది న్యూజిలాండే అవుతుంది. ఈ గ్రూప్ నుంచి మరో అండర్ డాగ్‌గా శ్రీలంకను చెప్పుకోవాలి. ఎందుకంటే, ఈ జట్టుకు కూడా హోం అడ్వాంటేజ్ ఉంది. ప్రదర్శనల ఆధారంగా చూసినా, ఈ జట్టు గ్రూప్ దశలో ఆస్ట్రేలియాపై అద్భుత విజయం సాధించి ఉత్సాహంగా కనిపిస్తుంది. జట్టు పరంగా చూస్తే.. వీరు పేపర్‌పై బలంగా కనిపించకపోయినా, తమదైన రోజున ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ను మట్టికరిపించగల సత్తా ఉంది. కాబట్టి ఈ గ్రూప్ నుంచి న్యూజిలాండ్‌తో పాటు శ్రీలంకను కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు.
ఈ గ్రూప్ హాట్ ఫేవరెట్ ఇంగ్లండ్ విషయానికొస్తే.. చెప్పుకోవడానికి మాత్రమే ఇది ఈ గ్రూప్‌లో హాట్ ఫేవరెట్ అవుతుంది. ఎందుకంటే, ఈ జట్టుకు మిగతా మూడు జట్ల నుంచి టఫ్ ఫైట్ ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ జట్టు గ్రూప్ దశలో పసికూనలపై గెలిచేందుకు కూడా తీవ్రంగా శ్రమించింది. పేపర్‌పై బలంగా కనిపిస్తున్నా, కీలక ఆటగాళ్లు ఇప్పటివరకు సామర్థ్యం మేరకు రాణించలేదు. సూపర్-8 దశలో కీలక ఆటగాళ్లు టచ్‌లోకి వస్తే.. ఇంగ్లండ్‌ను సెమీస్‌కు చేరకుండా ఎవ్వరూ ఆపలేరు. ఇక ఈ గ్రూప్‌లో అత్యంత బలహీనమైన, ఏమాత్రం అంచనాలు లేని జట్టు ఏదైనా ఉందా అంటే అది పాకిస్తానే. అతికష్టం మీద సూపర్-8కు అర్హత సాధించిన ఈ జట్టు.. ఇంగ్లండ్, న్యూజిలాండ్ లాంటి పటిష్టమైన జట్లను కాదని ముందుకు వెళ్లడం దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. ఓవరాల్‌గా చూస్తే.. గ్రూప్ 1 నుంచి సెమీస్ రేసులో భారత్ హాట్ ఫేవరెట్ కాగా.. రెండో బెర్త్ కోసం సౌతాఫ్రికా, వెస్టిండీస్ మధ్య తీవ్రమైన పోటీ ఉండే అవకాశం ఉంది. గ్రూప్ 2 నుంచి ఏ జట్టునూ హాట్ ఫేవరెట్ అని చెప్పలేని పరిస్థితి ఉంది. ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంక జట్ల మధ్య ముక్కోణపు పోటీ ఉండవచ్చు.