తేలిగ్గా తీసుకుంటే ఖేల్ ఖతమ్… క్రిస్ శ్రీకాంత్ వార్నింగ్…!

టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా చెన్నైలో జరగనున్న భారత్-జింబాబ్వే సూపర్-8 మ్యాచ్‌కు ముందు భారత మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Post Published By: dialnews
Updated : 26 February 2026, 12:03 PM IST

టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా చెన్నైలో జరగనున్న భారత్-జింబాబ్వే సూపర్-8 మ్యాచ్‌కు ముందు భారత మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తమ యూట్యూబ్ ఛానెల్ వేదికగా టీమిండియాను హెచ్చరించిన ఆయన.. జింబాబ్వేను తక్కువ అంచనా వేయడం భారీ తప్పిదమవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం గ్రూప్ సమీకరణాలు ప్రకారం.. వెస్టిండీస్ కంటే జింబాబ్వే ఆటగాళ్లు భారత్‌కు గట్టి సవాలు విసిరే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ ప్రపంచకప్‌లో జింబాబ్వే అద్భుతమైన ప్రదర్శనతో దూసుకుపోతోంది.

గ్రూప్ దశలో బలమైన ఆస్ట్రేలియా, శ్రీలంక వంటి జట్లను ఓడించి పెను సంచలనం సృష్టించిన ఆ జట్టు ప్రస్తుతం ఆత్మవిశ్వాసంతో ఉంది. సూపర్-8లో వెస్టిండీస్ చేతిలో ఓటమి పాలైనప్పటికీ.. ఆ జట్టులోని సికందర్ రజా వంటి స్పిన్ ఆల్‌రౌండర్లు ఏ క్షణమైనా మ్యాచ్‌ను మలుపు తిప్పగలరు. ముఖ్యంగా చెన్నై పిచ్‌పై జింబాబ్వే బౌలర్లు భారత బ్యాటర్లను కట్టడి చేసే ప్రమాదం ఉందని శ్రీకాంత్ గుర్తు చేశారు.దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల భారీ ఓటమి తర్వాత టీమిండియా నెట్ రన్ రేట్ దారుణంగా పడిపోయింది. ఇప్పుడు సెమీఫైనల్ రేసులో నిలవాలంటే జింబాబ్వేపై కేవలం విజయం సాధిస్తే సరిపోదు.. అత్యంత భారీ మార్జిన్‌తో గెలవాల్సి ఉంటుంది.

భారత్ సెమీస్ చేరాలంటే దక్షిణాఫ్రికా-వెస్టిండీస్ మ్యాచ్ ఫలితంపై కూడా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్చి 1న వెస్టిండీస్‌తో తలపడక ముందే జింబాబ్వేను చిత్తు చేయడం భారత్‌కు అత్యంత కీలకం.కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌లకు ఈ మ్యాచ్ ఓ సవాల్‌గా మారనుంది. లెఫ్టార్మ్ బ్యాటర్లు ఎక్కువగా ఉన్న టీమిండియా.. ఆఫ్ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతుండటం ప్రధాన బలహీనతగా మారింది. సికందర్ రజా వంటి అనుభవజ్ఞులైన స్పిన్నర్లను ఎదుర్కోవడానికి జట్టు కూర్పులో మార్పులు చేయాల్సి ఉందని శ్రీకాంత్ సూచించారు. సరైన వ్యూహంతో బరిలోకి దిగకపోతే చెన్నైలో భారత్‌కు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.

Published : 
  • 26 February 2026, 12:03 PM IST