బాలీవుడ్ సెన్సేషన్, ఐటెం సాంగ్స్ క్వీన్ నోరా ఫతేహి అంటే తెలియని వారుండరు. తన అద్భుతమైన డ్యాన్స్ మూవ్స్‌తో కుర్రకారులో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ, ప్రస్తుతం ఒక కొత్త వివాదంలో చిక్కుకుంది. ఆమె నటించిన తాజా సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈసారి చర్చ ఆమె డ్యాన్స్ గురించి కాదు, ఆ పాటలోని అశ్లీల సాహిత్యం గురించి! కొందరు సినీ క్రిటిక్స్ వ్యక్తం చేస్తున్న ఆందోళన ప్రకారం.. నోరా ఫతేహి కొత్త పాటలోని కొన్ని పంక్తులను హైలైట్ చేస్తూ, ఆ సాహిత్యం సభ్య సమాజం తలదించుకునేలా ఉందంటున్నారు.
ఆ పాటలోని సాహిత్యాన్ని పరిశీలిస్తే, అందులో ఉపయోగించిన పదాలు ద్వంద్వార్థాలు కలిగి ఉండటమే కాకుండా, చాలా బహిరంగంగా అశ్లీలతను ప్రేరేపించేలా ఉన్నాయని నెటిజన్లు సైతం మండిపడుతున్నారు. ఈ వివాదాస్పద సాహిత్యాన్ని రాసిన రకీబ్ ఆలం పేరు ఇప్పుడు వైరల్ అవుతోంది. "పాట అంటే భావం ఉండాలి కానీ, ఇలాంటి అసభ్యకర పదజాలం ఉండకూడదు" అని నెమ్మదిగా విమర్శలు మొదలై ఇప్పుడు ఒక ఉద్యమంలా మారుతున్నాయి.
సాధారణంగా ఐటెం సాంగ్స్‌లో గ్లామర్, మాస్ బీట్స్ ఉండటం సహజమే కానీ, మరీ ఇంత పచ్చిగా రాయడం బాలీవుడ్ పతనానికి నిదర్శనమని కొందరు అభిప్రాయపడుతున్నారు. సదరు పాటలో నోరా ఎప్పటిలాగే తన డ్యాన్స్‌తో మెప్పించినప్పటికీ, బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తున్న లిరిక్స్ వింటుంటే మాత్రం వినేవారికి ఇబ్బందిగా అనిపిస్తోందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే 1.5 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన ఈ పోస్ట్ కింద వేల సంఖ్యలో నెటిజన్లు స్పందిస్తున్నారు. గ్లామర్ ప్రపంచంలో పాపులారిటీ కోసం ఇలాంటి వివాదాస్పద అంశాలను వాడుకోవడం కొత్తేమీ కాదు. కానీ, ఒక స్టార్ హీరోయిన్ సాంగ్‌లో ఈ స్థాయి అశ్లీలత ఉండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ వివాదంపై నోరా ఫతేహి లేదా ఆ పాట బృందం ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.