250 కొట్టినా కూడా గెలవలేరు… సన్‌రైజర్స్‌పై ఆకాశ్ చోప్రా కామెంట్స్…!

ఐపీఎల్ 2024లో అద్భుత ఆటతీరుతో ఫైనల్ చేరిన సన్ రైజర్స్ హైదరాబాద్.. గతేడాది నిరాశపరిచింది. కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే ఐపీఎల్ 2026 మినీ వేలంలోనూ ఆ జట్టు ఆశించిన స్థాయిలో జట్టు కూర్పును సెట్

Post Published By: dialnews
Updated : 24 March 2026, 8:15 PM IST

ఐపీఎల్ 2024లో అద్భుత ఆటతీరుతో ఫైనల్ చేరిన సన్ రైజర్స్ హైదరాబాద్.. గతేడాది నిరాశపరిచింది. కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే ఐపీఎల్ 2026 మినీ వేలంలోనూ ఆ జట్టు ఆశించిన స్థాయిలో జట్టు కూర్పును సెట్ చేసుకోలేకపోయిందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఆ జట్టు బౌలింగ్ బలహీనంగా కనిపిస్తోందని.. ప్యాట్ కమిన్స్ గాయంతో దూరం కావడంతో సమస్య మరింత తీవ్రమైందని పేర్కొంటున్నారు. తాజాగా ఆకాశ్ చోప్రా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.ప్రస్తుతం ప్యాట్ కమిన్స్ లేకపోవడంతో ఆ జట్టు బౌలింగ్ బలహీనంగా మారిపోయిందని పేర్కొన్నాడు.

ఇలాంటి బౌలింగ్‌తో సన్ రైజర్స్ హైదరాబాద్.. ఐపీఎల్ 2026లో తొలుత బ్యాటింగ్ చేసినా.. గెలుస్తుందనే నమ్మకం లేదని వ్యాఖ్యానించాడు. బ్యాటింగ్ బలంగా ఉన్నా.. బౌలింగ్ బలహీనంగా ఉందని పేర్కొన్నాడు. సన్ రైజర్స్ బ్యాటర్లు 250 పరుగులు చేస్తే బౌలర్లు కూడా 250 పరుగులు సమర్పించుకుంటారని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కత్‌కు మాత్రమే అనుభవం ఉందన్నాడు. ఈ బలహీనమైన బౌలింగ్ లైనప్‌తో సన్‌రైజర్స్ ఎలా మేనేజ్‌ చేస్తోందో అర్థం కావడం లేదన్నాడు. ఒకవేళ బ్యాటర్లు 250 పరుగులు చేసినా.. బౌలర్లు ఆ లక్ష్యాన్ని కాపాడలేరని ఆకాష్ చోప్రా చెప్పుకొచ్చాడు.

బ్రైడన్ కార్స్ ఉన్నప్పటికీ భారత పిచ్‌లపై అతనికి అంతగా అనుభవం లేదనీ, కేవలం భారత బౌలర్లతో జట్టు నడిపించడం చాలా కష్టమన్నాడు. కాగా గతేడాది కనీసం ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటిదారి పట్టిన ఆరెంజ్ ఆర్మీ.. ఈసారి టైటిల్ గెలవాలనే పట్టుదలతో ఉంది. ఇప్పటికే తమ హోమ్ గ్రౌండ్‌లో ప్రాక్టీస్ మొదలుపెట్టింది. అయితే ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లకు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ దూరమయ్యాడు.మోకాలి గాయంతో బాధపడుతున్న అతను సెకండాఫ్ లీగ్‌కు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. కమిన్స్ గైర్హాజరీలో ఇషాన్ కిషన్‌‌ను తాత్కలిక సారథిగా ఎంపిక చేశారు. శ్రీలంక పేసర్ ఎషాన్ మలింగ, ఆస్ట్రేలియా పేస్ ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్‌ కూడా గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకోనున్నారు. దాంతో సన్‌రైజర్స్ బౌలింగ్ బలహీనంగా మారింది.

Published : 
  • 24 March 2026, 8:15 PM IST