షేన్ వార్న్ ముందుచూపు… రూ.450 కోట్లు సొంతం…!

స్టేడియంలో తన స్పిన్ మాయాజాలంతో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిన ఆసీస్ దిగ్గజం షేన్ వార్న్.. మైదానం బయట కూడా అంతే గొప్ప వ్యూహకర్త అని నిరూపించుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు రికార్డు ధరకు అమ్ముడవ్వడంతో 18 ఏళ్ల క్రితం షేన్ వార్న్

Post Published By: dialnews
Updated : 26 March 2026, 11:15 AM IST

స్టేడియంలో తన స్పిన్ మాయాజాలంతో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిన ఆసీస్ దిగ్గజం షేన్ వార్న్.. మైదానం బయట కూడా అంతే గొప్ప వ్యూహకర్త అని నిరూపించుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు రికార్డు ధరకు అమ్ముడవ్వడంతో 18 ఏళ్ల క్రితం షేన్ వార్న్ చేసిన ఓ ఒప్పందం ఇప్పుడు ఆయన కుటుంబానికి కోట్ల వర్షం కురిపిస్తోంది. 2008లో ఐపీఎల్ మొదలైనప్పుడు రాజస్థాన్ రాయల్స్ జట్టు షేన్ వార్న్‌ను కొనుగోలు చేసింది. దాదాపు రూ.9 కోట్లకు పైగానే వెచ్చించి కొనుగోలు చేసి.. రాయల్స్ పగ్గాలు అతనికే అప్పగించింది. ఆస్ట్రేలియా తరపున ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కూడా ఆడని వార్న్‌కు రాయల్స్ కెప్టెన్సీ పగ్గాలు ఇవ్వడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ తొలి సీజన్‌లోనే రాయల్స్.. ఐపీఎల్ విజేతగా నిలిచింది.

2008లో రాయల్స్ తరపున బరిలోకి దిగిన షేన్ వార్న్ తనకు శాలరీ బదులు ప్రతీ సీజన్‌కు 0.75% ఈక్విటీ అడిగాడు. అందుకు అప్పటి యజమానులు ఓకే చెప్పారు. రాజస్థాన్ రాయల్స్ తరపున 4 సీజన్లు ఆడటంతో ఆ జట్టులో షేన్ వార్న్‌కు 3% వాటా లభించింది. వార్న్ చనిపోయే వరకు ఆ ఈక్విటీని అసలు అమ్మలేదు. తాజాగా రాజస్థాన్ రాయల్స్‌ను వాల్‌మార్ట్, ఫోర్డ్ కన్సార్టియం సుమారు 15 వేల కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. దీంతో షేన్ వార్న్ వాటాగా సుమారు 450 కోట్లు వచ్చాయి. ఇప్పుడు ఆ సంపదంతా వార్న్ కుటుంబానికే చెందుతుంది. 2008లో కేవలం 67 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు విలువ ఇప్పుడు ఆకాశాన్ని తాకింది. ఈ భారీ డీల్ కారణంగా షేన్ వార్న్ వాటా విలువ కూడా ఊహించని స్థాయికి చేరింది.

2019లో జట్టు విలువ 400 మిలియన్ డాలర్లు ఉన్నప్పుడు తన 3 శాతం వాటా చాలా విలువైందని షేన్ వార్న్ సరదాగా కామెంట్ చేశాడు. అది ఇప్పుడు నిజమైంది. క్రీడా ప్రపంచంలో ఓ ఆటగాడు తన నైపుణ్యంతో పాటు తన తెలివితేటలతో చేసిన అత్యంత విజయవంతమైన పెట్టుబడులలో ఇది ఒకటిగా నిలిచిపోతుంది.వార్న్ ముందు చూపు ఇప్పుడు ఆ కుటుంబానికి పెద్ద భరోసాగా నిలిచింది. ఐపీఎల్‌లో కేవలం నాలుగు సీజన్లు ఆడి రూ.450 కోట్లు అందుకుంటున్నట్టు లెక్క. దీని ప్రకారం ఒక్కో సీజన్‌కు 112 కోట్లకు పైగానే ముట్టినట్లు. దీంతో ఇదే కదా సంపద సృష్టించడం అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు.

Published : 
  • 26 March 2026, 11:15 AM IST